Telangana Assembly Election: ఈ ఏడాది జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో సమర శంఖారావం పూరించిన బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్.. నోటిఫికేషన్ రాక ముందే అభ్యర్థులను ప్రకటించారు. 119 స్థానాలకుగానూ 115 నియోజకవర్గాల్లో అభ్యర్థులను ప్రకటించారు. రెండు స్థానాల్లో కేసీఆర్ పోటీ చేస్తున్నట్టు ప్రకటించారు. ఇంకా నాలుగు స్థానాలను మాత్రం పెండింగ్‌లో పెట్టారు. నర్సాపూర్, జనగామ, నాంపల్లి, గోషామహల్ స్థానాల్లో అభ్యర్థుల ఎంపికపై ఇంకా చర్చలు సాగతున్నట్టు కేసీఆర్ చెప్పుకొచ్చారు.
నర్సాపూర్‌లో ప్రస్తుతం ఎమ్మెల్యే మదన్ రెడ్డి ఉన్నారు. అక్కడి నుంచి మహిళాకమిషన్ చైర్‌పర్శన్‌గా ఉన్న సునీతాలక్ష్మారెడ్డి టికెట్ ఆశిస్తున్నారు. వీళ్లిద్దరు టికెట్ కోసం తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇద్దరిలో ఎవరి వైపు మొగ్గు చూపాలన్న దానిపై చర్చలు నడుస్తున్నాయి. బుధవారం మెదక్‌లో సీఎం కేసీఆర్ పర్యటించనున్నారు. అక్కడ పర్యటన అనంతరం ఈ సీటుపై క్లారిటీ వస్తుందని బీఆర్‌ఎస్ వర్గాలు చెబుతున్నాయి.
జనగామ సీటు విషయంలో కూడా తీవ్రమైన పోటీ ఉంది. అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, పల్లా రాజేశ్వరరెడ్డి పోటీ పడుతున్నారు. వీళ్లతోపాటు పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి కూడా తనకు అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నారు. టికెట్ కోసం ముగ్గురు నేతలు ఎవరి ప్రయత్నాలు వాళ్లు చేస్తున్నారు. అనుచరులతో రహస్య మంతనాలు చేస్తూనే అధిష్ఠానంపై ఒత్తిడి తెచ్చేందుకు ట్రై చేస్తున్నారు. కేటీఆర్ విదేశాల నుంచి వచ్చిన తర్వాత ఈ సీటుపై క్లారిటీ వస్తుందని అంటున్నారు.
బీఆర్‌ఎస్ అభ్యర్థి ప్రకటించని మరో నియోజకవర్గం నాంపల్లి సెగ్మెంట్. ఇక్కడ ప్రస్తుతం ఈ నియోజకవర్గం ఎంఐఎం అకౌంట్‌లో ఉంది. ఎంఐఎంతో కలిసి పోటీ చేస్తామన్న బీఆర్‌ఎస్ ఈ సీటులో మాత్రం ప్రత్యర్థుల అభ్యర్థులను బట్టి నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉంది. ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి నుంచి గట్టి పోటీ ఉంటుందని అంచనా వేస్తున్నారు.
తెలంగాణలో చాలా మందికి సుపరిచతమైన నియోజకవర్గం గోషామహాల్. ఆ స్థానంలో విజయం సాధించిన బీజేపీ లీడర్ రాజాసింగ్ వివాదాస్పద కామెంట్స్ కారణంగా ఇది చాలా ఫేమస్ అయింది. ఇప్పుడు అక్కడ బీఆర్‌ఎస్ తరఫున అభ్యర్థిని ప్రకటించలేదు. ఈ సీటు కోసం కూడా చాలా పోటీ ఉన్నట్టు బీఆర్‌ఎస్ వర్గాలు చెబుతున్నాయి. అందుకే అందరితో చర్చించి నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నారు. ఇక్కడ సీటు కోసం గడ్డం శ్రీనివాస్ యాదవ్, ఆశిష్ కుమార్ యాదవ్, నందకిషోర్ వ్యాస్, రాజశేఖర్, మమత సంతోష్ గుప్తా పోటీ పడుతున్నారు.