Niranjan Reddy About KCR contesting from 2 places: తెలంగాణ సీఎం కేసీఆర్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి తొలి జాబితాలో 115 మంది బీఆర్ఎస్ అభ్యర్థులను ప్రకటించారు. వీరిలో ఏడుగురు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు సీట్లు ఇవ్వలేదు, అయితే అందుకు ప్రత్యేక కారణాలు ఉన్నాయని సీఎం కేసీఆర్ చెప్పారని మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. చెన్నమనేని రమేష్ కు పౌరసత్వం సమస్య ఉంది, మరోచోట తండ్రి అనారోగ్యం కారణంగా కుమారుడికి సీటు ఇవ్వాలని కుటుంబం భావించిందన్నారు. గత ఎన్నికల్లో 2018లోనూ 7 చోట్ల బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్లు ఇవ్వలేదని ఆయన గుర్తు చేశారు. వేములవాడ, ఖానాపూర్, ఆసిఫాబాద్, బోధ్, వైరా, మెట్ పల్లి, ఉప్పల్ నియోజకవర్గాల్లో వేరే వాళ్లకు ఛాన్స్ ఇచ్చారు. 


సీఎం కేసీఆర్ రెండు చోట్ల నుంచి గజ్వేల్, కామారెడ్డి నియోజకవర్గాల నుంచి పోటీ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయాన్ని ప్రజలు స్వాగతించాలని మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. రాజకీయ పార్టీకి, అధినేతకు వ్యూహం లేకుండా రెండు చోట్ల నుంచి పోటీ చేయరని అన్నారు. కానీ అందుకు కారణంగా చెబితే తమ వ్యూహం ఏంటో ఇప్పుడే ప్రతిపక్షాలకు, ప్రజలకు విషయం తెలుస్తుందన్నారు. జనగామ, నర్సాపూర్, నాంపల్లి, గోషా మహల్ 4 స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించకపోవడంపై కూడా ఆయన స్పందించారు. ప్రజల అభిప్రాయాలు సేకరిస్తున్నాం, రెండు, మూడు రోజుల్లో అధిష్టానం నిర్ణయం తీసుకుని అభ్యర్థులను ప్రకటిస్తామన్నారు. ఎక్కడైనా భిన్నాభిప్రాయలు వస్తాయని, అన్ని విషయాలు పరిశీలించి కేసీఆర్ తుది నిర్ణయం తీసుకుంటారని చెప్పారు. 


అందుకే సిట్టింగ్ లకు టికెట్లు.. ప్రశాంత్ రెడ్డి
రాజకీయ పార్టీలకు ప్రత్యేకంగా వ్యూహాలు ఉంటాయని, ఆలస్యం చేసి ఎమ్మెల్యేలను ఆందోళనకు గురిచేయవద్దని భావించి సీఎం కేసీఆర్ అభ్యర్థుల జాబితాను ప్రకటించారని మంత్రి ప్రశాంత్ రెడ్డి పేర్కొన్నారు. అంతా బాగా కష్టపడి పనిచేశారని, దాదాపుగా సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్లు ప్రకటించి వారిపై నమ్మకం ఉంచారన్నారు. తమను మరోసారి ఆశీర్వదించాలని ప్రజల్ని కోరాలని ముందుగానే జాబితా విడుదల చేసినట్లు చెప్పారు.


మంత్రి హరీష్ రావుపై మైనంపల్లి కామెంట్లు సరికాదు..
బీఆర్ఎస్ అభ్యర్థుల ప్రకటనకు ముందు ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు మంత్రి హరీష్ రావును టార్గెట్ చేస్తూ చేసిన కామెంట్లు సరికాదన్నారు. ఏదైనా అలా మాట్లాడటం సభ్యత, సంస్కారం కాదన్నారు. ప్రభుత్వ పరంగా, రాజకీయ పరంగా సమస్య ఉంటే వేదికలు ఉన్నాయి, సందర్బాన్ని బట్టి మాట్లాడాలి అన్నారు. అభ్యంతరకర భాష వాడటం, జుగుప్సాకరంగా మాట్లాడటం సరికాదని మైనంపల్లికి మంత్రి నిరంజన్ రెడ్డి హితవు పలికారు. 


హరీష్ రావుకు కేటీఆర్ మద్దతు..
రాష్ట్ర మంత్రి హ‌రీశ్‌రావుపై మైనంప‌ల్లి హ‌నుమంత‌రావు చేసిన వ్యాఖ్యల‌ను బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ఖండించారు. తన కుటుంబ సభ్యులలో ఒకరికి టికెట్ నిరాకరించారని మన ఎమ్మెల్యే మంత్రి హరీష్ రావును అవమానించేలా వ్యాఖ్యలు చేశారు. కానీ పార్టీ మొత్తం హ‌రీశ్‌రావు వెంట ఉంటాం, ఆయ‌న‌కు అండ‌గా ఉంటామ‌ని కేటీఆర్ పేర్కొన్నారు. పార్టీ ఆవిర్భావం నుంచి బీఆర్ఎస్ మూల‌స్తంభంగా హ‌రీశ్‌రావు ఉన్నారని కేటీఆర్ గుర్తుచేశారు.