Hyderabad Latest News: హైదరాబాద్ లో అక్రమ నిర్మాణాలను కూలుస్తూ సంచలనం రేపుతున్న హైడ్రా (Hyderabad Disaster Response and Asset Protection Agency) ను రద్దు చేయాలని కోరుతూ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. హైడ్రాకు ఉన్న అధికారాలను సవాలు చేస్తూ లక్ష్మి అనే మహిళ ఈ పిటిషన్‌ వేశారు. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ కె.లక్ష్మణ్‌ ధర్మాసనం విచారణ చేపట్టింది. 


దీనిపై నేడు హైకోర్టులో విచారణ కూడా జరిగింది. పిటిషన్ లో జీవో 99ను పిటిషనర్ సవాలు చేశారు. జీహెచ్ఎంసీ చట్టాన్ని కాదని హైడ్రాకు విశేష అధికారాలు ఎలా ఇస్తారని పిటిషనర్ వాదించారు. కాబట్టి, హైడ్రా చట్టబద్ధతను రద్దు చేయాలని కోరారు. దీంతో హైకోర్టు ధర్మాసనం ఇందులో కౌంటర్ దాఖలు చేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను రెండు వారాలకు హైకోర్టు వాయిదా వేసింది. 


ఈ సందర్భంగా హైడ్రా వ్యవహార తీరుపై హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా, వివరణలు తీసుకోకుండా నిర్మాణాలు ఎలా కూల్చివేస్తున్నారని హైడ్రాను హైకోర్టు ధర్మాసనం ప్రశ్నించింది. జీవో 99పై వివరణ ఇవ్వాలంటూ తెలంగాణ  ప్రభుత్వానికి ఆదేశాలు ఇచ్చింది. ఎలాంటి నోటీసు ఇవ్వకుండా అమీన్‌పూర్‌లో ఈ నెల 3న షెడ్లు కూల్చివేశారని పిటిషనర్‌ కోర్టుకు తెలిపారు. హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఉన్నప్పటికీ ఆ నిర్మాణాన్ని కూల్చి వేశారని చెప్పారు. దీంతో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ పిటిషన్ ను రెండు వారాలకు హైకోర్టు వాయిదా వేసింది.