Malla Reddy comments on CM Revanth Reddy: మాజీ మంత్రి, బీఆర్ఎస్ మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి సీఎం రేవంత్ రెడ్డిపై కీలక వ్యాఖ్యలు చేశారు. రేవంత్‌ రెడ్డి సీఎం అవుతారని మొదట తానే చెప్పానని గుర్తు చేసుకున్నారు. పదేళ్ల కిందట 2014లోనే తాను ఈ విషయం చెప్పానని అన్నారు. ఆ సమయంలో ఓసారి బొల్లారంలోని తోట ముత్యాలమ్మ దేవాలయంలో ఓ కార్యక్రమం జరిగిందని గుర్తు చేసుకున్నారు. దివంగత ఎమ్మెల్యే సాయన్న తోట ముత్యాలమ్మ దేవాలయంలో ఇచ్చిన విందుకు హాజరైనప్పుడు తాను స్వయంగా రేవంత్‌ రెడ్డితో మాట్లాడానని అన్నారు. 


నువ్వు కచ్చితంగా సీఎం అవుతావని తాను ఆనాడే ఈ విషయం రేవంత్ రెడ్డికి చెప్పినట్లు మల్లారెడ్డి తెలిపారు. ఇందుకు సంబంధించిన వీడియోను కంటోన్మెంట్‌ జయానగర్‌ కాలనీలోని తన కార్యాలయంలో శనివారం జరిగిన విలేకరుల సమావేశంలో మల్లారెడ్డి విడుదల చేశారు. ఈ సందర్భంగా మల్లారెడ్డి మాట్లాడుతూ.. తాను బీఆర్ఎస్ లోనే ఉంటానని అన్నారు. మరో పార్టీలో చేరేది లేదని స్పష్టం  చేశారు. గతంలో రేవంత్‌ రెడ్డిపై తొడగొట్టి తాను వ్యాఖ్యలు చేశానని మల్లారెడ్డి అన్నారు. 


ఆ వ్యాఖ్యలు కేవలం రాజకీయపరంగా మాత్రమే అని.. ఎలాంటి వ్యక్తిగత విభేదాలు తమ మధ్య లేవని చెప్పారు. తాము అందరం తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు ఎంతో స్నేహంగా మెలిగేవారమని అన్నారు. వచ్చే ఎన్నికల్లో తన కుమారుడు భద్రారెడ్డి ఎంపీగా పోటీ చేయడం కోసం తన వంతు ప్రయత్నాలు చేస్తున్నాడని అన్నారు. అతను ఏ పార్టీ నుంచి పోటీ చేసినా తనకు ఎలాంటి అభ్యంతరం లేదని అన్నారు.


‘‘రేవంత్ రెడ్డి సీఎం అవుతాడని.. రెడ్డిలల్ల సీఎం అయ్యే ఛాన్స్ రేవంత్ రెడ్డికి ఒక్కడికే ఉందని పదేండ్ల కిందటే చెప్పా. నాకు రేవంత్ రెడ్డికి ఎలాంటి గొడవలు లేవు.. ఎంత తిట్టుకున్నా రాజకీయపరంగానే మా మధ్య గొడవ. నా కొడుకు భద్రారెడ్డి మల్కాజ్‌గిరి ఎంపీ టికెట్‌ కోసం బీజేపీ, కాంగ్రెస్‌ల నుంచి ప్రయత్నాలు చేసిన మాట వాస్తవమే’’ అని ఎమ్మెల్యే మల్లారెడ్డి అన్నారు.