Talasani Srinivas Yadav visits Hussain Sagar: గత ఐదు రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం జరగలేదని రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో కురుస్తున్న వర్షాలకు వరద నీరు పెరుగుతోందని హుస్సేన్ సాగర్ నిండు కుండలా ఉండడంతో మంత్రి తలసాని సందర్శించారు. మంత్రి తలసాని మాట్లాడుతూ... నగర వాసులకు వర్షాల కారణంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు 428 ఎమర్జెన్సీ బృందాలు 24 గంటలు పని చేస్తున్నాయన్నారు.
జీహెచ్ఎంసీ, పోలీస్, డిఆర్ఎఫ్ మాన్సూన్ ఎమర్జెన్సీ బృందాలు సమన్వయంతో పని చేయడం వల్ల ఎలాంటి ఇబ్బందులు తలెత్తలేదన్నారు. చిన్న చిన్న సమస్యలు ఎదురైనా తక్షణమే ఈ బృందాలు పరిష్కరిస్తున్నట్లు మంత్రి పేర్కొన్నారు. సమస్యలను పరిష్కరించేందుకు 24 గంటల పాటు పని చేసే విధంగా జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం, ఈవీడీఎం బుద్ధ భవన్ లో కంట్రోల్ రూమ్ లను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు.
హైదరాబాద్ ప్రజలకు వరద ఇబ్బందులు గురికాకూడదని దూర దృష్టితో మంత్రి కేటీఆర్ నాలా అభివృద్ధి కోసం ఎస్.ఎన్.డి.పి కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు. ఎస్.ఎన్.డి.పి ద్వారా జీహెచ్ఎంసీ పరిధిలో చేపట్టిన పనుల వలన గతంలో కంటే వరద ముప్పు ఎక్కువ లేదన్నారు. ఎడతెరపి లేకుండా వర్షాలు కురుస్తుండటంతో ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ ఎప్పటికప్పుడు సమీక్ష చేస్తూ అధికారులకు పలు సూచనలు చేసినట్లు చెప్పారు. కొన్ని ప్రాంతాల్లో నాలా పై అక్రమ నిర్మాణాలు ఉండడం మూలంగా ముంపు ఏర్పడిందని అన్నారు. ఆ ప్రాంతంలో కూడా ఎలాంటి సమస్యలు లేకుండా జీహెచ్ఎంసీ ఎమర్జెన్సీ బృందాలు డీఆర్ఎఫ్, పోలీస్ శాఖ అహర్నిశలు కష్టపడుతూ ప్రజలు ఇబ్బందులకు గురికాకుండా చర్యలు తీసుకుంటున్నారని వారందరికీ మంత్రి తలసాని అభినందనలు తెలిపారు.
నాలా అక్రమాలపై కఠిన చర్యలు
వర్షాలు తగ్గిన తర్వాత నాలా అక్రమాలపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. రసూల్ పుర, మినిస్టర్ రోడ్, ముషీరాబాద్ లలో నిర్మించిన బ్రిడ్జిల వల్ల అనేక ప్రాంతాలు జలమయం కాలేదన్నారు. ఎస్.ఎన్.డి.పి పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తామని తలసాని అన్నారు. ఇంకా రెండు రోజులు వర్షపాతం ఉందని వాతావరణ శాఖ ప్రకటించడంతో అధికారులు అప్రమత్తంగా ఉండి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటారు. ఇబ్బందులు ఎదురైనప్పుడు కంట్రోల్ రూమ్ కు తెలియ జేయాలని మంత్రి నగర ప్రజలను కోరారు. అనంతరం మంత్రి తలసాని హుస్సేన్ సాగర్ కాలువ నీటి ఉధృతి ని కవాడిగూడ (భాగ్య లక్ష్మి టెంపుల్) వద్ద అశోక్ నగర్ వద్ద మంత్రి పరిశీలించారు.
రాష్ట్రంలో మరో నాలుగురోజుల పాటు భారీ వర్షాలు కురవనున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. దక్షిణ ఒడిశా, ఉత్తర ఆంధ్రా సమీపంలోని వాయువ్య బంగాళాఖాతం, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఈ నెల 24న అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని అంచనా వేశారు. తాజాగా ఏర్పడనున్న అల్పపీడనం ప్రభావంతో మరో 4 రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఉమ్మడి దిలాబాద్, కరీంనగర్, వరంగల్ జిల్లాలతో పాటు కొత్తగూడెం, నిజామాబాద్ జిల్లాలో ఆదివారం వరకు కొన్ని చోట్ల మోస్తరు వర్షం కురవగా, మిగతా చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి
Join Us on Telegram: https://t.me/abpdesamofficial