Cyber Crime: సైబర్ క్రైమ్ ఫ్రాడ్‌ను కేసును తవ్వే కొద్ది సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. దీనికి సంబంధించిన వివరాలను హైదరాబాద్ కమిషనర్ సీవీ ఆనంద్ వెల్లడించారు. దేశ వ్యాప్తంగా దాదాపు 755 ఫిర్యాదులు ఉన్నాయన్నారు. ఈ స్కాంమ్‌కు సంబంధించి బాధితుల సంఖ్య ఎక్కువగానే ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలో వారిని గుర్తించేందుకు చర్యలు చేపడతున్నట్లు పేర్కొన్నారు. షెల్ కంపెనీలు ఏర్పాటు చేసి ఇతర దేశాలకు డబ్బు పంపిస్తున్నారని, ఇందులో రాధిక మర్చంట్స్‌తో మొదలై 65 షెల్ కంపెనీల్లో లావాదేవీలు జరిగినట్లు గుర్తించామన్నారు.
ఈ స్కాం గురించి NIA, ఫైనానిషియల్ ఇంటెలిజెన్స్‌కు సమాచారం ఇచ్చామని పోలీసులు తెలిపారు. ఈ కేసులో కీలకంగా ఉన్న ప్రకాష్ ప్రజాపతి అనే వ్యక్తి ఉన్నాడని అతడు ట్రావెలింగ్‌లో ఉండగానే ముంబైలో పట్టుకున్నట్లు చెప్పారు. ప్రజాపతి ఎక్కువగా దుబాయ్, చైనా వెళ్తాడని అక్కడే డబ్బును క్రిప్టో కరెన్నీ కింద మార్చుతున్నారని వెల్లడించారు.
చైనా, దుబాయ్‌లో ఉన్న ప్రధాన నిందితులకు ఇండియాలో కొందరు ఏజెంట్లు సహకరిస్తున్నారు. అలాంటి 9 మందిని పోలీసులు అరెస్టు చేశారు. ఇన్‌వెస్ట్‌మెంట్ చేసిన డబ్బుని క్రిప్టో కరెన్సీకి మార్చి హిజ్బుల్లాకి సంబంధించిన టెర్రర్ మాడ్యూల్‌కి ట్రాన్స్ఫర్ చేసినట్లు గుర్తించారు. ఇక్కడ ఫ్రాడ్ చేసిన డబ్బును టెర్రరిస్టులకు ఫైనాన్స్ చేసే అవకాశం కూడా ఉంది.
హిజ్బుల్ టెర్రర్ మోడ్యూల్‌కు క్రిప్టో కరెన్సీ ట్రాన్స్‌ఫర్‌పై NIA విచారణ చేస్తుందన్నారు. క్రిప్టో కరెన్సీపై మానిటరింగ్ సిస్టం ఇంకా భారత్‌లో అందుబాటులోకి రాలేదని వివరించారు. ఈ కేసులో ప్రధాన నిందితులు దుబాయ్, చైనా దేశస్తులని, వారిని అరెస్టు చేయడం కష్టమైన ప్రక్రియ అన్నారు. బ్యాంక్‌లో అకౌంట్స్ తెరిచే సమయంలో వెరిఫికేషన్ కఠినం చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ఫ్రాడ్ చేసేవాళ్ళు ఫేక్ సర్టిఫికెట్స్ పెట్టి సులభంగా వందల కొద్ది అకౌంట్స్ ఓపెన్ చేస్తున్నారని అన్నారు.
అదనపు ఇన్‌కం కోసం వెతుకునే వారే ఈ సైబర్ కేటుగాళ్ల ఉచ్చులో పడుతున్నారు. మొదట్లో ఆన్‌లైన్‌లో టాస్క్‌ల పేరుతో ఈ సైబర్ నేరగాళ్లు కొన్ని లింక్‌లు పంపిస్తారు. వాట్సాప్, టెలిగ్రామ్ ద్వారా తమ మోసాలను స్టార్ట్ చేస్తారు. టాస్క్ ఓరియెంటెడ్ జాబ్స్ అని చెప్పి అందర్నీ నమ్మించేందుకు మొదట్లో చిన్న చిన్న అమౌంట్లు వేస్తూ నమ్మకాన్ని కలిగించి మోసాలకు పాల్పడుతున్నారు. ఇలాంటి వాళ్ల మాయమాటలు నమ్మి దేశవ్యాప్తంగా 15 వేల మంది బాధితులు 712 కోట్లు పోగొట్టుకున్నారు. అమాయకులే కాకుండా హై లెవెల్ పొజిషన్‌లో ఉన్న ఐటీ ఎంప్లాయిస్ కూడా వీరి బాధితులే.
వీళ్లంతా చైనా దుబాయ్ కేంద్రంగా మోసాలు చేస్తున్నారు. అక్కడి నుంచి ఆపరేట్ చేసే కొందరు కేటుగాళ్లు ఇక్కడ తమ ఏజెంట్లను నియమించుకుంటున్నారు. వారి ద్వారా మిగతా కథను నడిపిస్తున్నారు. స్థానిక భాషలు మాట్లాడుతూ నిండా ముంచుతున్నారు. షెల్ కంపెనీలు, బ్యాంక్ అకౌంట్స్ ఓపెన్ చేసి.. వచ్చిన డబ్బును చైనా, దుబాయ్‌కు పంపిస్తున్నారు.
శివకుమార్ అనే ఓ వ్యక్తి ఇచ్చిన కంప్లెయింట్ ఆధారంగా కేసును దర్యాప్తు చేసిన పోలీసులకు విస్తుపోయే వాస్తవాలు తెలిశాయి. నిందితులకు చెందిన 48 అకౌంట్స్‌లో 584 కోట్లు జమయ్యాయి. మరో 128 కోట్లు ఇతర అకౌంట్స్‌లో డిపాజిట్ అయ్యాయి. ఫేక్ పేపర్స్‌తో లక్నోలో 33 షెల్ అకౌంట్స్, 65 బ్యాంక్ అకౌంట్స్ ఓపెన్ చేశారు కేటుగాళ్లు. ఫ్రాడ్ చేసిన డబ్బును ఈ షెల్ కంపెనీలు, అకౌంట్స్‌లో డిపాజిట్ అవుతున్నట్టు పోలీసులు గుర్తించారు. ఫ్రాడ్ చేసిన డబ్బుని క్రిప్టో కరెన్సీగా ట్రాన్స్ఫర్ చేసుకుని దుబాయ్, చైనాలో విత్ డ్రా చేసుకుంటున్నారు.