అతి పెద్ద సైబర్ క్రైమ్ ఫ్రాడ్‌ను హైదరాబాద్ పోలీసులు ఛేదించారు. దీనికి సంబంధించిన వివరాలను హైదరాబాద్ కమిషనర్ సీవీ ఆనంద్ వెల్లడించారు. సోషల్ మీడియాను అడ్డాగా చేసుకొని వందల కోట్లు దోచేస్తున్నట్టు పోలీసుల విచారణలో వెల్లడైంది. దేశవ్యాప్తంగా 15 వేల మంది వీరి బారిన పడి లక్షల్లో నష్టపోయారు. మరికొందర్ని మోసం చేసే లోపు వీళ్లను పోలీసులు పట్టుకున్నారు.
ఈ మధ్య కాలంలో చేస్తున్న పనితోపాటు అదనపు ఇన్‌కం కోసం చాలా మంది ప్రయత్నాలు చేస్తున్నారు. పెరిగిపోతున్న ఖర్చులు కావచ్చు ఇంకా సంపాదించాలన్న ఆలోచన కావచ్చు కానీ ఇలాంటి వాళ్లే ఈ సైబర్ కేటుగాళ్ల ఉచ్చులో పడుతున్నారు. ఇలాంటి ఆలోచనలు ఉన్న వాళ్లే ఈ సైబరాసూరులకు ఆహారంగా మారుతున్నారు.
మొదట్లో ఆన్‌లైన్‌లో టాస్క్‌ల పేరుతో ఈ సైబర్ నేరగాళ్లు కొన్ని లింక్‌లు పంపిస్తారు. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ వీళ్ల నేరాలకు అడ్డాగా మారుతున్నాయి. ముఖ్యంగా వాట్సాప్, టెలిగ్రామ్ ద్వారా తమ మోసాలను స్టార్ట్ చేస్తారు. టాస్క్ ఓరియెంటెడ్ జాబ్స్ అని చెప్పి మొదలు పెడతారు. అందర్నీ నమ్మించేందుకు మొదట్లో చిన్న చిన్న అమౌంట్లు వేస్తారు. నమ్మకాన్ని కలిగిస్తారు.
అక్కడే నేరగాళ్లు తమ ట్రిక్‌ను ఉపయోగిస్తారు. టాక్స్ ఇష్యూ రాకుండా ఉండేందుకని చెప్పి డమ్మీ అకౌంట్ ఓపెన్ చేస్తారు. అలా చేస్తే ట్యాక్స్ తక్కువ పడుతుందని కలరింగ్ ఇస్తారు. చేస్తున్న పనికి మరింత డబ్బులు రావాలంటే కొంత అమౌంట్ పే చేయాలని కూడా చెప్తారు. అలా దాని కొంత అమౌంట్ తీసుకుంటారు. చేస్తున్న పనికి వచ్చే డబ్బులను వాళ్లు క్రియేట్ చేసన డమ్మి అకౌంట్‌లో జమ చేస్తున్నట్టు కట్టు కథలు చెప్తారు. ఆ అకౌంట్‌లో ఉన్న అమౌంట్‌ని కూడా చూపిస్తారు.
ఆ అమౌంట్ డ్రా చేసుకోవాలంటే మాత్రం కొంత ట్యాక్స్ కట్టాలనో ఇంకొకటనో చెప్తారు. ఇలాంటి వీళ్ల మాయమాటలు నమ్మి దేశవ్యాప్తంగా 15 వేల మంది బాధితులు 712 కోట్లు పోగొట్టుకున్నారు. అమాయకులే కాకుండా హై లెవెల్ పొజిషన్‌లో ఉన్న ఐటీ ఎంప్లాయిస్ కూడా వీరి బాధితులే.
వీళ్లంతా చైనా దుబాయ్ కేంద్రంగా మోసాలు చేస్తున్నారు. అక్కడి నుంచి ఆపరేట్ చేసే కొందరు కేటుగాళ్లు ఇక్కడ తమ ఏజెంట్లను నియమించుకుంటున్నారు. వారి ద్వారా మిగతా కథను నడిపిస్తున్నారు. స్థానిక భాషలు మాట్లాడుతూ నిండా ముంచుతున్నారు. షెల్ కంపెనీలు, బ్యాంక్ అకౌంట్స్ ఓపెన్ చేసి.. వచ్చిన డబ్బును చైనా, దుబాయ్‌కు పంపిస్తున్నారు.
అకౌంట్స్‌లో ఉన్న మనీని క్రిప్టో కరెన్సీ ద్వారా ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నారు సైబర్ నేరగాళ్లు. శివకుమార్ అనే ఓ వ్యక్తి ఇచ్చిన కంప్లెయింట్ ఆధారంగా కేసును దర్యాప్తు చేసిన పోలీసులకు విస్తుపోయే వాస్తవాలు తెలిశాయి. నిందితులకు చెందిన 48 అకౌంట్స్‌లో 584 కోట్లు జమయ్యాయి. మరో 128 కోట్లు ఇతర అకౌంట్స్‌లో డిపాజిట్ అయ్యాయి.
ఫేక్ పేపర్స్‌తో లక్నోలో 33 షెల్ అకౌంట్స్, 65 బ్యాంక్ అకౌంట్స్ ఓపెన్ చేశారు కేటుగాళ్లు. ఫ్రాడ్ చేసిన డబ్బును ఈ షెల్ కంపెనీలు, అకౌంట్స్‌లో డిపాజిట్ అవుతున్నట్టు పోలీసులు గుర్తించారు. ఫ్రాడ్ చేసిన డబ్బుని క్రిప్టో కరెన్సీగా ట్రాన్స్ఫర్ చేసుకుని దుబాయ్, చైనాలో విత్ డ్రా చేసుకుంటున్నారు.
చైనా, దుబాయ్‌లో ఉన్న ప్రధాన నిందితులకు ఇండియాలో కొందరు ఏజెంట్లు సహకరిస్తున్నారు. ఇప్పుడు అలాంటి 9 మందిని పోలీసులు అరెస్టు చేశారు. ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్ చేసిన డబ్బుని క్రిప్టో కరెన్సీకి మార్చి ఆ క్రిప్టో కరెన్సీని హిజ్బుల్లాకి సంబంధించిన టెర్రర్ మాడ్యూల్‌కి ట్రాన్స్ఫర్ అయినట్లు గుర్తించారు. ఇక్కడ ఫ్రాడ్ చేసిన డబ్బును టెర్రరిస్టులకు ఫైనాన్స్ చేసే అవకాశం కూడా ఉంది.