Telangana Latest News: చదువుతో ఏదైనా సాధ్యమవుతుందని అభిప్రాయపడ్డారు మంత్రి సీతక్క. ఉస్మానియా యూనివర్సిటీ ఆధ్వర్యంలో ఆర్ట్స్ కాలేజ్ వేదికగా జరిగిన మహిళా సాధికారత పై జాతీయ సదస్సులో పాల్గొని ప్రసంగించారు. ముఖ్యఅతిథిగా హాజరై సదస్సును ప్రారంభించిన మంత్రి సీతక్క పవర్‌ఫుల్ స్పీచ్ ఇచ్చారు.
గూడెం నుంచి వచ్చిన తాను ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నట్టు చెప్పారు సీతక్క. అన్నీంటినీ ఎదుర్కోవడానికి చదువు ఒక్కటే ఉత్తమమ మార్గమని దాన్ని ఎంచుకున్నట్టు వెల్లడించారు. " ఆదివాసి గూడెం నుంచి వచ్చిన నేను హాస్టల్ నుంచి అడవికి, అడవి నుంచి జనజీవన స్రవంతిలోకి వచ్చాను. చదువుతో ఏదైనా సాధ్యమవుతుందని నేను మళ్లీ చదవడం మొదలు పెట్టాను. ఏ కోర్టులో అయితే నన్ను దోషిగా నిలబెట్టారో ఆ కోర్టులోనే నేను లాయర్‌గా పని చేశాను. అని చెప్పారు.
చదువుతో పాటు సమాజానికి ఉపయోగపడాలనే ఉద్దేశంతో ప్రజా సేవలోకి వచ్చినట్టు వెల్లడించారు. తాను జనజీవస్రవంతిలోకి వచ్చిన తర్వాత మిత్రుల సలహా మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. "చిన్న చిన్న జీతభత్యాలతో సాగే జీవితంలో ఉన్న దాంట్లో కొంత సమాజం కోసం వెచ్చించాలని ప్రజా సేవ చేయడం మొదలుపెట్టాను. ఎన్ని కష్టాలు ఎదురైనా చదువు ఆపలేదు. నిత్య విద్యార్థిగా చదువుతూనే ఉన్నాను. గొప్ప గొప్ప నేతలు ఎంతోమంది ఈ యూనివర్సిటీ విద్యార్థులే. యూనివర్సిటీలో చదువుకొని వారి జ్ఞానాన్ని ప్రజాసేవ కోసం ఉపయోగించి అనేక మంది మంచి పనులు చేస్తున్నారు. ప్రజా సమస్య పట్ల అవగాహన పెంచుకొని పోరాటం చేయాలి. జనజీవన స్రవంతిలోకి వచ్చిన తర్వాత చాలామంది మిత్రులు లక్ష్యంతో ముందుకెళ్లాలని సలహా ఇచ్చారు. అందుకోసమే నేను రాజకీయంలోకి వచ్చాను.
మొదటి ప్రయత్నం తనది ఫెయిల్ అయిందని అయినా పోయిన చోటే వెతుక్కోవాలని గట్టిగా డిసైడ్ రాజకీయాలు చేసినట్టు సీతక్క తెలిపారు. అనుకున్నట్టుగానే ఇప్పుడు మంత్రిగా ప్రజలకు సేవలు అందిస్తున్నాని వివరించారు. "తెలుగుదేశం పార్టీలో చేరి ఎమ్మెల్యేగా పోటీ చేసిన ఓడిపోయినప్పటికీ ప్రజా సమస్యలపై పోరాటం చేశాను. పోయిన చోటే వెతుక్కోవాలి అన్న చందంగా నేను తిరిగి మళ్లీ ఆక్కడి నుంచే ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాను. అదేవిధంగా గన్ను పట్టుకొని తిరిగిన ఏరియాలో ఈరోజు గన్‌మెన్లతో తిరుగుతున్నాను."
ఇష్టపడి చేసిన పనులే మనకి గుర్తింపు తీసుకొస్తాయని చెప్పారు సీతక్క. అందుకే ఇష్టమైన పనిలో సమస్యలు ఉన్నా ముందుకెళ్లాలని సూచించారు. " మనిషి జీవితం ఏ విధంగా ఉంటుందనేది ఎప్పుడు ఊహించలేం. కానీ ఇష్టపడి చేసిన పనులు మనల్ని గుర్తింపు ఇస్తుంటాయి. మనం ఏం పని చేసినా వాటిపైన పూర్తి అవగాహనతో చేయాల్సిన అవసరం ఉంది. నిత్య అన్వేషణగా మన చదువు కొనసాగాలి. ఎమ్మెల్యే అయినప్పటికీ నా చదువును ఆపకుండా కొనసాగిస్తూనే ఉన్నాను."
ఒడిదుడుకులు ఎదుర్కొని పని చేసినప్పుడే మంచి ఫలితాలు వస్తాయని అప్పుడే గుర్తింపు లభిస్తుందని సీతక్క తెలిపారు. తనకు మాత్రం మారుమూల పల్లెల్లో పని చేసినప్పుడే తనకు ఆనందం కలుగుతుందని వెల్లడించారు. "మారుమూల ప్రాంత ప్రజలకు సేవలు చేస్తున్నప్పుడు నాకు మరింత ఆనందం కలుగుతుంది. కరోనా టైంలో నేను చేసిన సేవలు దేశవ్యాప్తంగా గుర్తింపు వచ్చింది. ఎవరు చేయలేని పనులను నువ్వు చేసావని ఈరోజు అందరూ అంటున్నారు. ఒక్కొక్క మెట్టుగా నేను పని చేసుకుంటూ వచ్చాను. ఎంతో ఓపికతో చేసుకుంటా వచ్చాను. ఎదిగేటప్పుడు అనేక ఒడిదుడుకులు ఉంటాయి. వాటిని అధికమించి మనం కష్టపడి పని చేసినప్పుడే వాటికి గుర్తింపు వస్తుంది. అని తన ప్రసంగాన్ని ముగించారు.
మంత్రి చేసిన ప్రసంగం తర్వాత ప్రాంగణమంతా చప్పట్లతో మారుమోగిపోయింది. అనంతరం మంత్రి సీతక్కను కలిసేందుకు సభికులంతా ఉత్సాహం చూపారు. ఆ తర్వాత అసెంబ్లీకి చేరుకున్న మంత్రి సీతక్క గవర్నర్ ప్రసంగ కార్యక్రమానికి హాజరయ్యారు.