Telangana Budget Sessions | హైదరాబాద్: అసెంబ్లీ సమావేశాలు కనీసం 20 రోజులు జరపాలని బీఏసీలో డిమాండ్ చేశామని తెలంగాణ మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు తెలిపారు. ప్రశ్న పత్రాలు లీక్ అయినట్లు.. అసెంబ్లీ ముందే లీక్ అవటంపై అభ్యంతరం తెలిపామన్నారు. బీఏసీ సమావేశం తర్వాత హారీష్ రావు చిట్ చాట్ లో మాట్లాడుతూ.. ప్రతిపక్షాలకు మైక్ ఇవ్వొద్దని సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ను బుల్డోజ్ చేస్తున్న విషయాన్ని బీఏసీలో లేవనెత్తాం. సంఖ్య బలాన్ని బట్టి బీఆర్ఎస్ (BRS) సభ్యులకుకు సభలో సమయం ఇవ్వాలని కోరగా.. మా విజ్ఞప్తికి ఓకే అన్నారని తెలిపారు.
మంత్రులు సభకు ప్రిపేర్ అయ్యి రావాలని కోరాం
రాష్ట్రంలోని ముఖ్యమైన సమస్యలపై సభలో చర్చ జరగాలని కోరాం. రైతాంగ సమస్యలు, తాగు నీటి, సాగు నీటి సమస్యలపై చర్చించాలని కోరాం. మంత్రులు సభకు ప్రిపేర్ అయ్యి రావాలని కోరాం. సుంఖిశాల, పెద్దవాగు కొట్టుకుపోవడం, వట్టెం పంప్ హౌస్ మునిగిపోవడం, ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ ప్రాజెక్టులు కూలిపోవటంపై అసెంబ్లీలో చర్చ జరపాలని డిమాండ్ చేశాం. అసెంబ్లీ నియోజకవర్గాల అభివృద్ధికి స్పీకర్ ప్రత్యేక చొరవ తీసుకుని నిధులు ఇప్పించాలని కోరాం.
కృష్ణా నదీ జలాల వినియోగంలో తెలంగాణ ప్రభుత్వం విఫలమైందని సభలో చర్చించాలని బీఏసీలో స్పష్టం చేశాం. ఏపీ వాళ్లు కృష్ణా జలాలు తరలించుకుపోతుంటే కాంగ్రెస్ ప్రభుత్వం చోద్యం చూసింది. బిల్లులు చెల్లింపుకు 20శాతం కమిషన్ విషయంపై చర్చ జరగాలి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేందుకు కీలకమైన ఆరు గ్యారంటీలు అమలు చేయకపోవటంపై చర్చించాలి. ఎల్ఆర్ఎస్ ఉచిత హామీపై, బార్స్, వైన్స్, బెల్ట్ షాపులు పెంచటంపై చర్చించాలని కోరాం. నిరుద్యోగులకు సంబంధించి నిరుద్యోగ భృతి, జాబ్ క్యాలెండర్ పై సభలో చర్చ జరగాలి. చిన్న కాంట్రాక్టర్లకు, మాజీ సర్పంచ్‌లకు పెండింగ్ బిల్లులు ఇవ్వకుండా వేధింపులకు గురిచేయడంపై చర్చ జరగాలి. కాళేశ్వరం ప్రాజెక్టులో కూలిన పిల్లర్ ను రాష్ట్ర ప్రభుత్వం కావాలనే నిర్లక్ష్యం చేస్తోందని, వెంటనే కాళేశ్వరం పునరుద్ధరణ పనులు చేయాలని బీఏసీలో సూచించామని’ హరీష్ రావు వెల్లడించారు.
Also Read: Telangana Budget Date: ఈ 19న బడ్జెట్, 27 వరకు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు
అసెంబ్లీ రేపటికి వాయిదా
మార్చి 12న తెలంగానలో బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. తొలిరోజు బుధవారం నాడు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగించారు. ఆయన ప్రసంగం అనంతరం రేపటికి వాయిదా పడింది. ఆ తర్వాత స్పీకర్ చాంబర్‌లో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అధ్యక్షతన బీఏసీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో తెలంగాణ ప్రభుత్వం తరఫున డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, శాసన సభ వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు, బీఆర్ఎస్ నుంచి మాజీ మంత్రులు హరీష్ రావు, ప్రశాంత్ రెడ్డి, బీజేపీ నుంచి మహేశ్వర్ రెడ్డి, సీపీఐ నుంచి కూనమనేని సాంబశివరావు, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్యలు పాల్గొన్నారు. మార్చి 27 వరకు సభ జరపాలని బీఆర్ఎస్ పట్టుబట్టింది.