TSRTC Merged Into Telangana Government: ఆర్టీసీ ఉద్యోగుల విలీన బిల్లుకు అసెంబ్లీ ఆమోదం తెలిపింది. దాంతోపాటు పురపాలక చట్ట సవరణ బిల్లును సైతం శాసనసభ ఆమోదించింది. ప్రభుత్వ ఉద్యోగులకు వర్తించే పీఆర్సీనే ఆర్టీసీ ఉద్యోగులకు వర్తిస్తుందని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తెలిపారు. కార్మికుల బకాయిలను చెల్లిస్తామని, ఆర్టీసీ కార్పొరేషన్, దాని ఆస్తులు అదే విధంగా ఉంటాయన్నారు. ఆర్టీసీ ఉద్యోగులతో చర్చించి పదవి విరమణ ప్రయోజనాలు నిర్ణయిస్తామన్నారు. 43,055 మంది ఆర్టీసీ ఉద్యోగులు ప్రభుత్వ ఉద్యోగులుగా మారారని చెప్పారు. కానీ ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు కార్పొరేషన్ రూల్స్ ప్రకారం కొనసాగుతారని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ స్పష్టం చేశారు.


ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేశాం..
ఆర్టీసీ ఉద్యోగుల బిల్లుపై గవర్నర్‌ తమిళిసై తెలిసీ తెలియక వివాదం చేశారని సీఎం కేసీఆర్ అన్నారు. శాసనసభ సమావేశాలు చివరిరోజు సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. ఆర్టీసీ ఆస్తులపై కన్నేశామని కొందరు ఆరోపణలు చేశారని, కానీ తాము ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేశామన్నారు. ఆర్టీసీ ఉద్యోగులకు మంచి పీఆర్సీ ఇస్తామన్నారు. త్వరలో ఆర్టీసీ సేవలు విస్తరిస్తామని, యువ ఐఏఎస్‌లను నియమించి మరింతగా అభివృద్ధి చేస్తామని చెప్పారు. గవర్నర్ తమిళిసై ప్రభుత్వానికి చేసిన సూచనలపై రాష్ట్ర ప్రభుత్వం ఏ ప్రకటన చేయలేదు. ఉద్యోగుల భవిష్యత్, రక్షణ కోసం తాను కొన్ని విషయాలపై ప్రభుత్వాన్ని స్పష్టత కోరాను తప్పా, ఆ బిల్లును ఆపడం తన ఉద్దేశం కాదని గవర్నర్ పదే పదే ప్రస్తావించడం తెలిసిందే.


అంతకుముందు తెలంగాణ సీఎం కేసీఆర్ సుదీర్ఘ ప్రసంగం అనంతరం అసెంబ్లీలో ఆర్టీసీ విలీనం బిల్లును ప్రవేశపెట్టారు. రాష్ట్ర రోడ్లు, రవాణా శాఖల మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం బిల్లును ప్రశపెడుతూ తీర్మానం చేశారు. ఆర్టీసీ ఉద్యోగులకు ప్రభుత్వంలో విలీనం చేయాలని రాష్ట్ర కేబినెట్ ఇటీవల నిర్ణయం తీసుకుందున్నారు. ఇకనుంచి ఆర్టీసీ కార్యకలాపాలు యాధాతథంగా కొనసాగుతాయని చెప్పారు. ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేయడం వల్ల రాష్ట్ర ఖజానాపై ప్రతి ఏడాది రూ.3000 కోట్లు అదనపు బారం పడనుందని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ సభలో వెల్లడించారు. ప్రస్తుతం ఈ అంశంపై శాసనసభలో చర్చ మొదలైంది. అంతకుముందు ఆర్టీసీ బిల్లుకు గవర్నర్ తమిళిసై ఆమోదం తెలిపారు. అయితే, కొన్ని సూచనలు ఇచ్చినట్లుగా తెలుస్తోంది. మొత్తానికి గవర్నర్ ఆమోదం తెలపడంతో ఆర్టీసీ బిల్లు అసెంబ్లీలో ప్రవేశపెట్టడానికి మార్గం సుగమం అయింది.


నేటి ఉదయం తెలంగాణ ఆర్ అండ్ బీ అధికారులు గవర్నర్‌ తమిళిసై సమావేశం అయ్యారు. ప్రభుత్వం తరఫున రవాణా శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కూడా గవర్నర్ తో భేటీ అయ్యారు. వారి వివరణ అనంతరం ఆర్టీసీ బిల్లుకు గవర్నర్ ఆమోదం తెలిపారు. అనంతరం తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం బిల్లుకు గవర్నర్ తమిళిసై ఆమోదం తెలపడంతో ప్రభుత్వం అసెంబ్లీ సమావేశాలను మరో 2 రోజులు పొడిగించింది. కానీ ఆర్టీసీ బిల్లుతో పాటు మరిన్ని బిల్లులు ఆమోదం పొందడంతో సమావేశాల పొడిగింపు నిర్ణయాన్ని ప్రభుత్వం ఉపసంహరించుకుంది.