MLC Kavitha: తెలంగాణ సిద్ధాంతకర్త ఆచార్య జయశంకర్‌ నుంచి తాను అనేక అంశాలు నేర్చుకున్నాని బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత అన్నారు. ఆదివారం మేడ్చల్‌లోని కేఎల్‌ఆర్‌ వెంచర్‌లో మంత్రి మల్లారెడ్డితో కలిసి అమరవీరుల స్థూపం, ప్రొఫెసర్‌ జయశంకర్‌ సార్‌ విగ్రహాన్ని ఎమ్మెల్సీ కవిత ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ.. మంచి వ్యక్తులు పుట్టినప్పుడు భూమాత సంతోషిస్తుందని, అలాగే ప్రొఫెసర్ జయశంకర్  పుట్టినప్పుడు కూడా ఆమె సంతోషించి ఉంటుందన్నారు. 


ఆచార్య జయశంకర్‌ తమ కుటుంబ సభ్యుల్లో ఒకరని చెప్పారు. జయశంకర్‌ అందరికీ స్ఫూర్తి ప్రధాత అని, అందరిలో ఉద్యమ స్ఫూర్తిని నింపారని కొనియడారు. ఆచార్య జయశంకర్‌ జయంతి రోజున ఆయన విగ్రహాన్ని ప్రతిష్ఠాపన చేయడం ఆనందంగా ఉందన్నారు. తెలంగాణ ఉద్యమంలో ఎన్ని అవహేళనలు ఎదురైనా ఎక్కడా అధైర్యపడలేదని చెప్పారు.


1948 నుండే  జయశంకర్ పోరాటం చేశారని, వారి స్ఫూర్తి తోనే ఉద్యమం ఊపందుకుందన్నారు. అప్పట్లో అందరూ గులాబీ కండువా కప్పుకున్న వారందరిని చాలా మంది తిట్టారని, ఇప్పుడు అదే నోర్లతో పొగుడుతున్నారని చెప్పారు. తెలంగాణ రాష్ట్రం ఇస్తున్న ప్రభుత్వ పథకాలను చూసి జయశంకర్ ఆత్మ సంతృప్తి చెందుతుందన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయని ఎమ్మెల్సీ అన్నారు.


అదే సమయంలో కేంద్రంపై ఎమ్మెల్సీ ఘాటు విమర్శలు చేశారు. తెలంగాణపై కేంద్రం వివక్ష చూపిస్తోందన్నారు. ఇటీవల కురిసిన వర్షాలకు రాష్ట్రానికి కేంద్రం ఒక్క రూపాయి కూడా సహాయం చేయలేదని విమర్శించారు. గుజరాత్‌కు ఒక నీతి.. తెలంగాణకు ఒక నీతా అంటూ కేంద్రాన్ని నిలదీశారు. నీరు, నిధులు, నియామాకాల కోసం పోరాడి చరిత్రను గుర్తు పెట్టుకోవాలని, ఆ చరిత్రను సీఎం కేసీఆర్ తిరగరాశారని అన్నారు.


రాష్ట్రాన్ని ఎన్నివిధాలుగా ఇబ్బంది పెట్టాలో అన్ని విధాలుగా కేంద్రం ప్రయత్నాలు చేస్తోందని ఆరోపించారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసుకోవాలని ఉన్నా.. దీనిపై గవర్నర్‌కు వచ్చిన ఇబ్బంది ఏంటో తెలియడంలేదన్నారు. ఇటీవల ఆర్టీసీ బిల్లుకు ఎవరు అడ్డు పడుతున్నారో ప్రజలకు తెలుసునని, గవర్నర్‌ను ఎవరు ఆడిస్తున్నారో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసునని వ్యాఖ్యానించారు.  మీకు తెలుసని ఆమె ఎద్దెవా చేశారు. చివరగా బార్ అసోసియేషన్ వారు నూతన‌ భవనం అడిగారని, వారి సమస్య పరిష్కారానికి కృషి చేయాలని మంత్రి మల్లారెడ్డికి విజ్ఞప్తి చేశారు.


అంతకు ముందు అమరవీరులకు నివాళులు అర్పించి, అమర వీరులకు జోహార్, జోహర్ ప్రొఫెసర్ జయశంకర్  మంత్రి మల్లారెడ్డి  కార్యక్రమాన్ని ప్రారంభించారు. మేడ్చల్‌లో ఉద్యమంలో  అమరడైన శ్రీనివాస్‌కు నివాళులర్పించి అతని భార్య, కుటుంబ సభ్యులకు రూ.5 లక్షల అందజేశారు. 


ట్విటర్‌లో నివాళి
అంతకుముందు ట్విట్టర్‌ వేదికగా ప్రొఫెసర్‌ జయశంకర్‌ సార్‌కు ఎమ్మెల్సీ కవిత నివాళులర్పించారు. తెలంగాణ రాష్ట్ర భావజాల వ్యాప్తికి తన జీవితాన్ని అంకితం చేసిన మహనీయుడని చెప్పారు. స్వరాష్ట సాధన కోసం నిరంతరం పరితపించి, తెలంగాణకు జరుగుతున్న అన్యాయాలు, అసమానతలను ఎత్తిచూపుతూ, తెలంగాణ ప్రజలలో చైతన్య దివిటీ వెలిగించిన గొప్ప మేధావి అని తెలిపారు. ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ సార్ జయంతి సందర్భంగా ఆ‌ మహనీయుడికి ఘన‌ంగా నివాళులర్పిస్తున్నానని అన్నారు.


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి   
Join Us on Telegram: https://t.me/abpdesamofficial