MLA Raja Singh: గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఆదివారం సంచలన వాఖ్యలు చేశారు. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు మూడవ రోజైన ఆదివారం మొదలయ్యాయి. ఈ సందర్భగా గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో గోషామహల్ నుంచి ఎవరు గెలుస్తారో తెలియదన్నరు. తాను మాత్రం తిరిగి అసెంబ్లీకి రాననే నమ్మకం ఉందన్నారు.


తనను అసెంబ్లీలో అడుగు పెట్టకుండా తన చుట్టూ చాలా రాజకీయాలు జరుగుతున్నాయని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నియోజకవర్గంలో పరిస్థితులు అన్నీ మారిపోయాయని, తన సొంత వారు, బయటి వారు తనను గెలవకుండా చేసేందుకు కుట్రలు చేస్తున్నారని వాపోయారు.


సీఎం కేసీఆర్‌కు రిక్వెస్ట్
ఆయన ఇంకా మాట్లాడుతూ.. ప్రస్తుతం తన చుట్టూ ఏం జరుగుతుందో అర్థం కావడం లేదన్నారు. సీఎం చంద్రశేఖర్‌రావుకు ఆయన ఓ విజ్ఞప్తి చేశారు. తాను ఉన్నా లేకపోయినా తన గోషామహల్ నియోజకవర్గ ప్రజలపై దయ చూపాలని కోరారు. అక్కడి ప్రజలు సీఎం కేసీఆర్‌పై నమ్మకంతో కొండంత ఆశతో ఎదురు చూస్తున్నారని చెప్పారు. ఇదే తన ప్రార్థన అంటూ రాజా సింగ్  ఉద్వేగభరిత వ్యాఖ్యలు చేశారు.


ప్రభుత్వం గోషామహల్ నియోజకవర్గాన్ని విస్మరించడం బాధాకరంగా ఉందన్నారు. అసెంబ్లీ సాక్షిగా ధూల్‌పేటలో పర్యటిస్తానని, అక్కడి అభివృద్ధికి కట్టుబడి ఉంటానని చెప్పిన సీఎం కేసీఆర్ ఆ తరువాత మర్చిపోయారని విమర్శించారు. అసెంబ్లీలో తాను ఉన్నా లేకపోయినా ధూల్‌పేటను అభివృద్ధి చేయాలని స్పీకర్‌ను కోరారు. అక్కడి ప్రజలు గుడుంబా తయారీ మానివేశారని ప్రభుత్వం తరఫున ఉపాధి మార్గాలు కోసం ఎదురుచూస్తున్నారని చెప్పారు.


తాను గోషామహల్ నియోజకవర్గానికి ఎంతో చేశానని చెప్పారు. నియోజకవర్గ సమస్యలు, తన పరిధిలో లేని పనులు చేయాలని ప్రభుత్వానికి పలు సార్లు, పలు వేదికల మీదుగా విజ్ఞప్తి చేశానని చెప్పుకొచ్చారు.  నియోజకవర్గంలో ప్రభుత్వం చేయాల్సిన పనులను అన్ని అసెంబ్లీ సమావేశాల్లో వివరించానని ప్రస్తావించారు. తన ప్రజలను జాగ్రత్తగా చూసుకోవాలని, వారికి కనీస వసతులు కల్పించాలని కోరారు.


బీజేపీ సస్పెన్షన్ వేటు
గత ఏడాది సోషల్ మీడియాలో మహమ్మద్ ప్రవక్తపై  రాజా సింగ్‌ అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీనిపై పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తడంతో పోలీసులు ఆయన్ను అరెస్ట్ చేశారు. పీడీ యాక్ట్‌ కింద కేసు నమోదు చేశారు. ఈ వ్యాఖ్యల కారణంగా బీజేపీ రాజాసింగ్ ను పార్టీ నుంచి సస్పెండ్‌ చేసింది. ఈ కేసులో రాజాసింగ్ కు తెలంగాణ హైకోర్టు షరతులతో కూడిన బెయిల్‌ ఇచ్చింది. అప్పటి నుంచి ఆయన బీజేపీకి దూరంగా ఉంటున్నారు. 


అధిష్టానం నుంచి అందని గ్రీన్ సిగ్నల్
కొంతకాలం గడిచాక సస్పెన్షన్ ఎత్తివేస్తారని భావించినా ఆ దిశగా ఇంతవరకు ఎలాంటి సంకేతాలు రాలేదు. అయితే.. ఈమధ్య బీఆర్ఎస్ కీలక నేత, మంత్రి హరీష్ రావుతో రాజాసింగ్ భేటీ అవ్వడం కొత్త ఊహాగానాలకు దారితీసింది. ఆయన పార్టీ మారబోతున్నారంటూ ప్రచారం జరిగింది. అయితే ఈ ప్రచారంలో నిజం లేదని రాజాసింగ్ కొట్టిపారేశారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఈ రోజు (ఆదివారం) అసెంబ్లీలో రాజాసింగ్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి   
Join Us on Telegram: https://t.me/abpdesamofficial