Activist and Singer Gaddar Passes Away: ప్రజా గాయకుడు గద్దర్ కన్నుమూశారు. అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గద్దర్ తుదిశ్వాస విడిచారు. 1949లో లచ్చమ్మ, శేషయ్య దంపతులకు తూప్రాన్ లో గద్దర్ జన్మించారు.  తెలంగాణ ఉద్యమంలో తన పాటలతో ప్రజల్లో చైతన్యం కల్పించడంలో గద్దర్ ఎంతో కీలకపాత్ర పోషించారు. తన పాటలతో ఉద్యమాలకు ఊపు తెచ్చిన ఘనత గద్దర్ దే. 1987లో కారంచేడులో దళితుల హత్యలను తీవ్రంగా వ్యతిరేకించారు. ఫేక్ ఎన్ కౌంటర్లపై గద్దర్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. 1990 ఫిబ్రవరి 18న జన నాట్య మండలి ఆధ్వర్యంలో హైదరాబాద్ లోని నిజాం కాలేజీ గ్రౌండ్స్ లో గద్దర్ నిర్వహించిన భారి బహిరంగ సభకు 2 లక్షల మంది ప్రజలు హాజరయ్యారంటే ఆయన క్రేజ్ ఏంటన్నది అర్థం చేసుకోవచ్చు.


1997 ఏప్రిల్ లో గద్దర్ పై  పోలీసులు  కాల్పులు జరపడంతో ఆయన శరీరంలోకి బుల్లెట్లు గుచ్చుకున్నాయి. ఒక్కటి తప్ప అన్ని బుల్లెట్ లను తొలగించారు. అది తొలగిస్తే ఆయన ప్రాణాలకే ప్రమాదమని కడుపులోనే బుల్లెట్ ను డాక్టర్లు వదిలేశారు. 2010లో తెలంగాణ ఉద్యమంలో చేరకముందు గద్దర్... నక్సలైట్ గా ఉండేవారు. గద్దర్ అసలు పేరు గుమ్మడి విఠల్ రావు. 76 ఏళ్ల వయసులో అనారోగ్యానికి చికిత్స పొందుతూ గద్దర్ కన్నుమూశారు. ఆయన తుదిశ్వాస విడిచినట్టు ఆయన కుమారుడు సూర్యం ధ్రువీకరించారు.


నా గుండె చప్పుడు ఆగిపోలేదంటూ ఇటీవల గద్దర్ ప్రకటన..
నా పేరు గుమ్మడి విఠల్ రావు.  గద్దర్ నాపాట పేరు. నా బతుకు సుదీర్ఘ పోరాటం. నా వయస్సు 76 సంవత్సరాలు. నా వెన్నుపూసలో ఇరుక్కున్న తూటా వయస్సు 25 సంవత్సరాలు.  ఇటీవల నేను పీపుల్స్ మార్చ్ పాదయాత్రకు మద్దతుగా "మా భూములు మాకే" నినాదంతో పాదయాత్రలో పాల్గొన్నాను అని జులై 31న ఓ ప్రకటన విడుదల చేశారు. ‘నా పేరు జనం గుండెల చప్పుడు. నా గుండె చప్పుడు ఆగిపోలేదు. కానీ ఎందుకో గుండెకు గాయం అయ్యింది. ఈ గాయానికి చికిత్సకై అమీర్ పేట/ బేగంపేట లోని శ్యామకరణ్ రోడులో అపోలో  స్పెక్ట్రా (Apollo Spectra) హాస్పిటల్ లో ఇటీవల చేరాను.  జూలై ఇరువై నుండి నేటి వరకు అన్నిరకాల పరీక్షలు, చికిత్సలు తీసుకుంటూ కుదుట పడుతున్నాను. 
గుండె చికిత్స నిపుణులు డాక్టర్ దాసరి ప్రసాదరావు, డాక్టర్ డి. శేషగిరిరావు, డాక్టర్ వికాస్, డాక్టర్ కిరణ్ కుమార్ రెడ్డి, డాక్టర్ ఎన్. నర్సప్ప (అనిస్తీషియా), డాక్టర్ ప్రఫుల్  చంద్ర నిరంతర పర్యవేక్షణలో వైద్యం అందుతున్నది. గతంలో నాకు డాక్టర్ జి. సూర్య ప్రకాశ్ గారు, బి. సోమరాజు గారు వైద్యం చేశారు.
పూర్తి ఆరోగ్యంతో కోలుకొని తిరిగి మీ మధ్యకు వచ్చి సాంస్కృతిక ఉద్యమం తిరిగి ప్రారంభించి, ప్రజల రుణం తీర్చుకుంటానని ప్రజల సాక్షిగా మాట ఇస్తున్నాను. నా యోగ క్షేమాలు విచారించడానికి అపోలో స్పెక్ట్రా హాస్పిటల్ అని ప్రజా గాయకుడు గద్దర్ ఓ ప్రకటనలో తన అనారోగ్యం, చికిత్సకు సంబంధించి అప్ డేట్ ఇచ్చారు. ఇది చూసిన ఆయన అభిమానులు, రాష్ట్ర ప్రజలు త్వరలోనే గద్దర్ ప్రజల్లోకి రానున్నారని, ఆయన గళంతో అలరిస్తారని భావించారు. కానీ ఒక్కసారిగా పరిస్థితి విషమించడంతో గద్దర్ ఆదివారం తుదిశ్వాస విడిచారని తెలియగానే అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు.