తెలంగాణ మంత్రి కేటీఆర్ మరోసారి కేంద్ర విధానాలపై విరుచుకు పడ్డారు. ఈసారి ఆయిల్ కంపెనీలకు ఆర్థిక సాయం చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయిల్ కంపెనీల నష్టాలు తప్ప ఆడబిడ్డల కష్టాలు కనిపించవా అంటూ మోదీ ప్రభుత్వాన్ని నిలదీశారు. 


నష్టాల్లో ఉన్న ఆయిల్ కంపెనీలకు కేంద్రం ఆర్థిక సాయం చేసింది. 22 వేల కోట్లు సాయం చేస్తున్నట్టు ఇంగ్లీష్‌ మీడియాలో వచ్చింది. దీన్ని పోస్టు చేసిన కేటీఆర్... కేంద్రం ప్రజల గుండెల్లో మంట పెడుతున్న వాళ్లకే సాయం చేస్తోందని మండిపడ్డారు. 


ఆయిల్ కంపెనీలకు ఆర్థిక సాయం చేస్తున్న కేంద్రం.. ఆడబిడ్డలపై  ఆర్థిక భారాన్ని మోపుతోందని కేటీఆర్ విమర్శించారు. మోదీ పాలనలో ధరలు ఆకాశంలో ఉంటే... ఆదాయాలు పాతాళంలో ఉన్నాయంటూ  సెటైర్లు వేశారు. ఆయిల్ కంపెనీలకు కాసుల పంట కురిపిస్తూ... సామాన్యుడి గుండెల్లో గ్యాస్ మంట రగిలిస్తున్నారని ఆరోపణలు చేశారు. 






ఆయిల్ కంపెనీల నష్టాలు తప్ప... ఆడబిడ్డల కష్టాలు కనిపించవా? అంటూ కేంద్రాన్ని ప్రశ్నించారు కేటీఆర్. గరీబోల్ల గుండెలపై మోయలేని గుదిబండలు ఈ గ్యాస్ బండలు అంటూ తీవ్ర ఆగ్రహంతో ట్వీట్ చేశారు. గ్యాస్ వెయ్యి అయ్యిందని... పేదలకు మళ్లీ కట్టెలపొయ్యి దిక్కయ్యిందని మండిపడ్డారు. పేదోడి పొట్టగొట్టడం, మళ్లీ చేతిలో పొగగొట్టం పెట్టడమేనని అభిప్రాయపడ్డారు. 


సిలిండర్ భారాన్ని మూడింతలు చేసి... ఇప్పుడు 3 సిలిండర్ల  జపం చేస్తారా అంటు కేంద్రాన్ని నిలదీశారు కేటీఆర్. మూడు సిలిండర్లతో మూడుపూటలా వంట సాధ్యమా అని అడిగారు. మోయలేని భారం మోపే వాడో మోదీ అని మహిళా లోకానికి అర్థమైందన్నారు. 






పేద మధ్యతరగతి మహిళల వంటింట్లో నుంచే బీజేపీ పతనం షురూ అయిందన్నారు కేటీఆర్. గ్యాస్ సబ్సిడీని ఎత్తివేస్తారు...
కంపెనీలకు మాత్రం ప్యాకేజీలు ఎత్తిపోస్తారా? అని ఆక్షేపించారు. రూ.400 ఉన్న సిలిండర్ ధర... ఇప్పుడు రూ.1100 అయిందని... ఇంకా నాట్‌ అవుట్‌గా ఉంటూ పరుగులు పెడుతోందని ఎద్దేవా చేశారు. స్పెషల్ ప్యాకేజీలు ఇవ్వాల్సింది ఆయిల్ కంపెనీలకు కాదని... ఆర్థికంగా నష్టపోయిన ఆడబిడ్డలకు ఇయ్యాలని అభిప్రాయపడ్డారు.