నరేంద్ర మోదీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి పెట్రోల్‌  డీజిల్‌పై వేసిన సెస్‌లు తగ్గిస్తే భారీగా ధరలు దిగి వస్తాయన్నారు తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్. 2014లో ఉన్న ధరలకే పెట్రోల్, డీజిల్‌ ప్రజలకు లభిస్తుందని ట్వీట్ చేశారు. పెట్రోల్‌ డీజిల్‌ ధరలపై ఎక్సైజ్‌ డ్యూటీ తగ్గించినం సంగతి తెలిసిందే. 


పెట్రోల్‌, డీజిల్‌ ధరలపై ఎక్సైజ్‌ డ్యూటీని కేంద్రం తగ్గించిన వెంటనే తెలంగాణ బీజేపీ రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే ప్లాన్‌ వేసింది. రాష్ట్ర ప్రభుత్వం విధించే వ్యాట్‌ తగ్గిస్తే సామాన్యులపై భారం తగ్గుతుందని డిమాండ్ చేసింది. 






బీజేపీ లీడర్లు చేస్తున్న ప్రచారంపై కేటీఆర్‌ సీరియస్‌గా రియాక్ట్ అయ్యారు. పెట్రోల్‌ ధర 70 రూపాయాలు ఉన్నప్పుడు తెలంగాణలో ఎంత వ్యాట్‌ ఉందో.. 120 రూపాయలు అయినప్పుడు కూడా తెలంగాణలో వ్యాట్ అంతే ఉందని వివరించారు కేటీఆర్. దీన్ని చూస్తే పెట్రోల్‌ ధరలు పెరగడానికి ఎవరు కారకులని.. ఎవరు బాధ్యులని ప్రశ్నించారు. 






పెట్రోల్‌పై ప్రత్యేక అదనుపు ఎక్సైజ్‌ డ్యూటీ, రోడ్‌ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ సెస్‌, అగ్రికల్చర్‌ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ డెవలప్‌మెంట్‌ పేరుతో సెస్‌లు వేసి కేంద్రం ధరలు పెంచేసిందన్నారు కేటీఆర్. దీని నుంచి వచ్చే ఆదాయాన్ని రాష్ట్రాలకు పంచడం లేదని... ఈ సెస్‌ను తగ్గించినట్టైతే 2014 నాటి ధరలకే ఇప్పుడు పెట్రోల్‌ లభిస్తుందన్నారు.  


కేంద్రం శనివారం పెట్రోల్‌పై 8రూపాయలు, డీజిల్‌పై 6 రూపాయల ఎక్సైజ్‌డ్యూటీ తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. దీనిపై కూడా కేటీఆర్‌ చాలా వ్యంగ్యంగా ఉదాహరణతో రియాక్ట్ అయ్యారు. మా స్కూల్‌ పక్కనే ఉన్న షాప్‌ యజమాని తాను అమ్మే వస్తువుల ధరలను పీక్‌ సీజన్‌లో 300 శాతం పెంచేశాడు. తర్వాత 30 శాతం తగ్గించేవాడు. దీన్ని బంపర్‌ ఆఫర్ అంటూ అతని స్నేహితులు ప్రచారం చేయడం స్టార్ట్ చేశారు. ఇక్కడ ధరలు పెంచింది ఎవరు.. తగ్గించింది ఎవరు అని అడుగుతూ శనివారం కేటీఆర్‌ ట్వీట్ చేశారు.