Honour Killing In Hyderabad: హైదరాబాద్: నగరంలోని బేగం బజార్‌లో పరువు హత్యకు గురైన నీరజ్ పన్వార్ రిపోర్ట్‌లో కీలక అంశాలు వెలుగు చూశాయి. తమ ఇంటి అమ్మాయిని వేరే కులానికి చెందిన వ్యక్తి వివాహం చేసుకోవడంతో తమ పరువు పోవడంతో పాటు అవమానం జరిగిందని భావించి నిందితులు నీరజ్‌ను హత్య చేశారు. పోలీసుల విచారణ లో నిందితులు (నీరజ్ భార్య సంజన బంధువులు) అంగీకరించారు. పెళ్లి సమయంలో, ఆపై బాబు పుట్టిన తరువాత యాదవ అహీర్ సమాజ్ కు చెందిన వ్యక్తులతో నీరజ్ రెచ్చగొట్టే వాఖ్యలు చేసినట్టు  నిందితులు పోలీసులకు తెలిపారు. 


గత ఏడాది మరో అబ్బాయితో సంజన నిశ్చితార్థం
యాదవ సామాజిక వర్గానికి చెందిన సంజనకు గత ఏప్రిల్‌లో పెళ్లి సంబంధం చూసి ఓ యువకుడితో నిశ్చితార్థం జరిపించారు. అయితే తాను నీరజ్ పన్వార్‌ను ప్రేమించానని, పెళ్లి చేసుకుంటానని చెప్పగా కుటుంబసభ్యులు అందుకు అంగీకరించలేదు. పెళ్లికి మూడు నెలల ముందు సంజన, నీరజ్ పారిపోయి పెళ్లి చేసుకున్నారు. తమ కూతురు ఇంట్లో నుంచి వెళ్లిపోవడంతో కూతురు సంజనకు కుటుంబ సభ్యులు ఫోటోకు పూల మాలవేసి నివాళులు అర్పించారు. 


ఇటీవల తమకు బాబు పుట్టిన తరువాత సంజన తన తల్లితో మాట్లాడింది. తన తప్పు క్షమించాలని కోరింది. తల్లి మాత్రం భిన్నంగా స్పందించింది. ఇకనుంచి మీరు బేగం బజార్ కు రావద్దని హెచ్చరించింది. తన తల్లి హెచ్చరికను లెక్క చేయకుండా సంజన, నీరజ్ దంపతులు బేగం బజార్‌లోనే ఉంటున్నారు. మరోవైపు సంజన ప్రేమ పెళ్లి అనంతరం యాదవ్ సమాజ్ లో జరిగే కార్యక్రమాలకి సంజన కుటుంబసభ్యులను పిలవడం లేదు. ఎక్కడికి వెళ్ళినా అవమాన భారంతో సంజన కుటుంబ సభ్యులు కుంగిపోయారు. 


నీరజ్ హత్యకు పక్కా ప్లాన్..
తమ కుటుంబం పరువు పోవడానికి, అవమానాలకు కారణం నీరజ్ అని, దీంతో అతడ్ని ఎలాగైనా హత్య చేయాలని సంజన బంధువులు భావించారు. తమ ప్లాన్‌లో భాగంగా గురువారం జుమేరాత్ బజార్ లో కత్తులు, రాడ్లు కొన్నారు. శుక్రవారం రాత్రి నీరజ్ పన్వార్ కోసం ఒక బాలుడితో రెక్కీ చేశారు. తాతతో కలిసి బైకుపై వెళ్తుండగా నీరజ్‌ను అడ్డుకున్నారు. ఏం జరుగుతుందో అర్థమయ్యేలోగా, నీరజ్ కళ్లల్లో కారం చల్లి కత్తులతో దాడి చేశారు. మద్యం సేవించి ఉన్న నిందితులు కత్తులతో దాడి చేసి, బండరాయితో తలపై కొట్టి నీరజ్‌ను హత్య చేశారని పోలీసులు రిమాండ్ రిపోర్ట్‌లో పేర్కొన్నారు. 


Also Read: BegumBazar Honor Killing: పరువుహత్యకు గురైన నీరజ్ పన్వార్ మృతదేహానికి పోస్ట్‌మార్టం పూర్తి, ఫ్యామిలీకి డెడ్‌బాడీ అప్పగింత