High Tension in in begumpet hyderabad : సికింద్రాబాద్: కాంగ్రెస్ నేతలు ఓటర్లకు డబ్బులు పంచుతున్నారని బీజేపీ నేతలు ఆరోపించారు. ఓటర్లకు డబ్బులు పంచి ప్రలోభాలకు గురిచేస్తున్నారని కాంగ్రెస్ నేత కారును అడ్డుకున్నారు బీజేపీ కార్యకర్తలు. కానీ కాంగ్రెస్ నేతకు చెందిన కారు బీజేపీ కార్యకర్తలను ఢీకొడుతూ దూసుకెళ్లింది. ఈ ఘటనలో బీజేపీ కార్యకర్తలు నలుగురు గాయపడ్డారని సమాచారం. బేగంపేట్ పోలీస్ స్టేషన్ వద్ద బిజెపి నాయకులు ఆందోళనకు దిగారు. బేగంపేట ఏసీబీ ఆఫీస్ దగ్గర కంటోన్మెంట్ అసెంబ్లీ పోలింగ్ బూత్ నంబర్స్ 45, 49, 50 సమీపంలో కాంగ్రెస్ వర్గీయులు డబ్బులు పంచుతుంటే తాము అడ్డుకునే ప్రయత్నం చేయగా ఫార్చునర్ వెహికల్ బిజెపి కార్యకర్తలను ఢీ కొట్టి వెళ్లిపోయినట్లు చెప్పారు. 




ఈ ఘటనపై బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి టిఎన్ వంశ తిలక్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే పోలీసులు పట్టించుకోవడం లేదని, ఇన్ స్పెక్టర్ రామయ్య దురుసుగా మాట్లాడుతున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ నేతలు రెండు కార్లలో డబ్బులు పెట్టుకొని తిరుగుతూ ఓటర్లను ప్రలోభ పెడుతున్నారని ఆరోపించారు. బీజేపీ కార్యకర్తలు ఆ కార్లను అడ్డుకొనగా ఓ కారు వేగంగా దూసుకొని వెళ్లిపోయిందని తెలిపారు. ఫిర్యాదు చేస్తే పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఇన్ స్పెక్టర్ ను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ నాయకులు ఓటర్లకు డబ్బులు పంచుతున్నారంటూ బీజేపీ నేతలు ఆందోళన చేపట్టగా.. రంగంలోకి దిగిన పోలీసులు ఓ కారును సీజ్ చేశారు.