Kompella Madhavi Latha Dharmapuri Arvind: తెలంగాణలో జరుగుతున్న లోక్ సభ ఎన్నికల్లో హైదరాబాద్ పార్లమెంటు స్థానానికి ఎంతో ప్రాధాన్యం ఉన్న సంగతి తెలిసిందే. గత 40 ఏళ్లుగా అక్కడ గెలుస్తూ వస్తున్న ఏఐఎంఐఎం పార్టీని ఢీకొట్టడం కోసం బీజేపీ కొంపెల్ల మాధవీ లతను బరిలోకి దింపింది. దీంతో హైదరాబాద్ లోక్ సభ స్థానం దేశ వ్యాప్తంగా హైలైట్ అయింది. పైగా బీజేపీ అభ్యర్థి మాధవీ లత తనదైన ప్రత్యేకతతో ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తుండడంతో ఆమె దేశ వ్యాప్తంగా వైరల్ అయ్యారు.


పోలింగ్ రోజున మాధవీ లత (Kompella Madhavi Latha) పోలింగ్ రోజున చాలా అలర్ట్ గా ఉంటున్నారు. అన్ని పోలింగ్ బూత్ లు తిరుగుతూ ఎన్నికలు జరుగుతున్న తీరును పరిశీలిస్తున్నారు. ఎంఐఎం పార్టీ దొంగ ఓట్లు వేయించి గెలుస్తుందని మాధవీ లత ఎప్పటి నుంచో ఆరోపిస్తున్నారు. అందుకు తగ్గట్లుగా పటిష్ఠమైన రీతిలో ఈసారి మాధవీ లత బీజేపీ ఏజెంట్లను నియమించారు. అంతేకాక, దొంగ ఓట్లను అరికట్టడం కోసం ఆమె నేరుగా రంగంలోకి దిగారు.


ఓటు వేసేందుకు బుర్ఖా వేసుకొని వస్తున్న ముస్లిం మహిళా ఓటర్లను ఆమె తనిఖీ చేశారు. ఆమె ఓటర్ కార్డు, ఆధార్ కార్డులను తనిఖీ చేస్తూ పరదా పైకెత్తి ముఖం చూపించాలని ఆదేశించారు. అలా మహిళా ముస్లిం ఓటర్లను నిశితంగా పరిశీలిస్తున్నారు. ఆధార్ కార్డుల్లోని ఫోటోలు, ముస్లిం మహిళ ముఖాలు సరిపోలటం లేదని ఆమె అనుమానం వ్యక్తం చేస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ వీడియోలను అసదుద్దీన్ ఒవైసీ కూడా రీట్వీట్ చేసి ఆమె తీరును తప్పుబట్టారు.






నిజామాబాద్‌లోనూ...                      
నిజామాబాద్ పార్లమెంటు స్థానంలో బీజేపీ అభ్యర్థిగా ఉన్న ధర్మపురి అర్వింద్ కూడా బుర్ఖాలపై పోకస్ చేశారు. ఆయన కూడా ప్రతి బూత్ లకు తిరుగుతూ ఓటింగ్ సరళిని పర్యవేక్షిస్తున్నారు. ఈ క్రమంలో బుర్ఖా వేసుకొని కొందరు మహిళలు కనిపించడంతో వారి ముఖాన్ని చెక్ చేయాలని ప్రిసైడింగ్ ఆఫీసర్ ను ఆదేశించారు. బుర్ఖాల మాటున కొందరు దొంగ ఓట్లు వేసే అవకాశం ఉందని హెచ్చరించారు. ఈయన వీడియోలు కూడా వైరల్ అవుతున్నాయి.