ఉదయాన్నే ఓటర్లు బారులు తీరారు. ఓటు వేసేందుకు ఉత్సాహం కదులుతున్నారు. ఎండలు ముదిరిపోక ముందే ఓటు వేసి వెళ్లిపోదామన్న ఆలోచనలో చాలా మంది ఉన్నారు. పెద్ద వయసు వాళ్లంతా వచ్చి ఓట్లు వేస్తున్నారు. తెలుగు రాష్ట్రాలతోపాటు నాల్గో దశలో పోలింగ్ జరుగుతున్న అని ప్రాంతాల్లో ఈ వాతావరణం కనిపిస్తోంది. 


ఉదయాన్నే ఐదున్నర గంటలకు మాక్ పోలింగ్ ప్రారంభించారు. అన్ని ఈవీఎం మెషిన్లను పరీక్షించారు. ఆయా పార్టీల ఏజెంట్ల సమక్షంలో ఈ ప్రక్రియను అధికారులు పూర్తి చేశారు. ఉదయం ఐదున్నర నుంచి 7 గంటల వరకు మాక్ పోలింగ్ నిర్వహించారు. అనంతరం వాటిని క్లియర్ చేసిన తర్వాత అసలు పోలింగ్ ప్రారంభించారు. 


కొన్ని ప్రాంతాల్లో మాక్‌ పోలింగ్‌లో గందరగోళం నెలకొంది. దీంతో ఆయా ప్రాంతాల్లో సాధారణ పోలింగ్ ఆలస్యంగా ప్రారంభమైంది. సాంకేతిక లోపం కారణంగా ఇది జరిగిందని అధికారులు చెబుతున్నారు. నార్మల్ పోలింగ్ ప్రారంభమైన కొన్ని ప్రాంతాల్లో కూడా ఈవీఎంలు మొరాయించాయి. అలాంటి ప్రాంతాల్లో కూడా పోలింగ్ కాస్త ఆలస్యంగా మొదలైంది. 


చాలా మంది ప్రముఖులు ఉదయాన్నే ఓటు వేశారు. సీఎం జగన్ మోహన్ రెడ్డి తన ఓటు హక్కును ఉదయాన్నే వినియోగించుకున్నారు. పులివెందులలోని బాకరాపురంలో పోలింగ్ స్టేషన్‌లో సతీసమేతంగా వచ్చి ఓటు వేశారు. 






మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు హైదరాబాద్‌లోని జూబ్లీహిల్‌లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. సతీసమేతంగా వచ్చి ఓటు వేశారు. 






వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి నెల్లూరులో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. 


హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో హీరోలు జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్ ఓటు హక్కును వినియోగించుకున్నారు. కుటుంబంతో వచ్చి ఓటు వేశారు.










హైదరాబాద్‌ పార్లమెంట్‌ నియోజకవర్గంలో పోటీ చేస్తున్న మాధవి లత కూడా తన ఓటు హక్కు వినియోగించుకున్నారు.










ఓటు హక్కు ఉన్న వారంతా వచ్చి ఓటు వేయాలని పార్టీలు, నేతలు, ఇతర ప్రముఖులు పిలుపునిచ్చారు. సోషల్ మీడియా ద్వారా ఓటు చైతన్యం కల్పించారు. "నా అవ్వాతాతలందరూ, నా అక్కచెల్లెమ్మలందరూ, నా అన్నదమ్ములందరూ, నా రైతన్నలందరూ, నా యువతీయువకులందరూ, నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనారిటీలందరూ, కదిలి రండి, తప్పకుండా ఓటు వేయండి అంటూ జగన్ పిలుపునిచ్చారు. ఉదయాన్నే ట్వీట్ చేశారు. 


"ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మీ చేతిలో ఉన్న ఓటు అనే ఆయుధాన్ని తప్పనిసరిగా ఉపయోగించండీ. మీ భవిష్యత్‌ కోసం పని చేసే ప్రభుత్వాన్ని ఎన్నుకోండి... గుర్తుంచుకోడి ఓటు అనేది హక్కు మాత్రమే కాదు.. ప్రజలందరి బాధ్యత" అని జనసేన ట్వీట్ చేసింది. 


 


"మీ భవిష్యత్తును, మీ రాష్ట్ర భవిష్యత్తును ఈరోజు మీరు వేసే ఓటు నిర్ణయిస్తుంది. అందుకే ఇళ్ల నుంచి కదలండి. పోలింగ్ కేంద్రాలకు వెళ్లి మీ ఓటు హక్కును వినియోగించుకోండి. ప్రజా చైతన్యాన్ని నిరూపించండి." అని చంద్రబాబు పోస్టు చేశారు.