No Pubs : న్యూ ఇయర్​ సందర్భంగా జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ లోని పబ్ లకు హైకోర్టు షాక్ ఇచ్చింది. గతంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై మరోసారి పబ్ నిర్వాహకులు కోర్టును ఆశ్రయించారు. పబ్ ల వ్యవహారంపై హైకోర్టులో విచారణ సాగింది. జూబ్లీహిల్స్ లో ఉన్న 10 పబ్ లు రాత్రి 10 తర్వాత మ్యూజిక్ పెట్టరాదని హైకోర్టు ఆదేశించింది. 10 పబ్బుల్లో న్యూ ఇయర్ ఈవెంట్స్ లోనూ 10 తరువాత సౌండ్ పెట్టరాదని పేర్కొంది. గతంలో ఇచ్చిన ఆర్డర్ నే న్యాయస్థానం సమర్థించింది. రాత్రి 10 గంటల తర్వాత పబ్బుల్లో సౌండ్స్ ను ఎట్టి పరిస్థితులలో అనుమతించేది లేదని హైకోర్టు స్పష్టం చేసింది. 


పోలీసులు ఇప్పటికే పబ్‌లకు కొత్త రూల్స్ పెట్టారు. న్యూఇయర్ ఈవెంట్స్, పబ్స్‌లో స్పెషల్ పార్టీలు, స్టార్ హోటళ్లలో హంగామాతో పాటు ప్రతీ రోడ్డు, బారు, వైన్స్ దగ్గర ఫుల్ సందడి నెలకొంటుంది. అయితే న్యూ ఇయర్ వేడుల సమయంలో నగరంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా చూసేందుకు హైదరాబాద్ నగర పోలీసులు పలు నిబంధనలు విధించారు. న్యూ ఇయర్ రోజు రాత్రి 1.00 వరకు 3 స్టార్, అంత కంటే పెద్ద హోటల్స్, పబ్బులు, క్లబ్స్‌లో వేడుకలు నిర్వహించుకోవాలంటే తప్పనిసరిగా ముందస్తు అనుమతి తీసుకోవాలని యాజమాన్యాలకు నోటీసులు ఇచ్చారు. 10 రోజుల ముందుగానే ఇందుకు సంబంధించిన అనుమతి తప్పని సరిగా తీసుకోవాలని పోలీసులు తెలిపారు. అంతే కాకుండా వేడుకలు నిర్వహించే ప్రదేశంలో తప్పకుండా సీసీ కెమేరాలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఈవెంట్ జరిగే ప్రదేశం ఎంట్రీ, ఎగ్జిట్, పార్కింగ్ పాయింట్లతో సీసీ కెమేరాలు తప్పనిసరి అని ఆదేశాలిచ్చారు. అయితే జూబ్లిహిల్స్ పరిధిలోని పబ్‌లకు మాత్రం హైకోర్టు ఆదేశాలు వర్తిస్తాయి. 


ప్రతీ రోజూ అర్ధరాత్రి కాగానే పబ్బుల నుంచి భారీ ఎత్తున శబ్దాలు వస్తున్నాయని, దీనివల్ల నిద్రా భంగం కలుగుతోందని, కాలనీకి సమీపంలో ఉన్న పబ్బును తొలగించాలని గతంలో పబ్బులు ఉన్న కాలనీల ప్రజలు హైకోర్టులో పిటిషన్లు వేశారు. వీటిపై విచారణ జరిపిన హైకోర్టు హైదరాబాద్‌లోని మూడు పోలీసు కమిషనరేట్ల పరిధిలో నడుస్తున్న పబ్‌లలో రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు డీజే శబ్దాలు లేకుండా చర్యలు తీసుకోవాలని హైకోర్టు ఆదేశించింది. సిటీ పోలీసు చట్టం , సౌండ్‌ పొల్యూషన్‌ రెగ్యులేషన్‌ ప్రకారం లౌడ్‌ స్పీకర్లకు నిర్దేశిత సమయం ఉంటుందని హైకోర్టు పేర్కొంది. రాత్రివేలల్లో ఎలాంటి శబ్దాలు, డీజే సౌండ్‌లకు అనుమతి లేదని పేర్కొంది.   పబ్బుల్లో రాత్రిపూట లిక్కర్‌ మాత్రమే సరఫరా చేయాలని ఆదేశించింది. అయితే తర్వాత ఆ తీర్పును సవరించి జూబ్లీహిల్స్ ప్రాంతా పబ్‌లకే పరిమితం చేసింది.


హైదరాబాద్ నగరంలో పబ్బుల తీరుపై మొదటి నుంచి విమర్శలు ఉన్నాయి. అసాంఘిక కార్యకలాపాలకు నిలయంగా మారుతున్నాయని మైనర్లకు అనుమతి లేకపోయినా ... అక్రమంగా అనుమతిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. ఎప్పటికప్పుడు పోలీసులు చర్యలు తీసుకుంటున్నా ప్రయోజనం ఉండటం లేదు. దీంతో హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది.