సీనియర్ ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మికి భారీ ఊరట లభించింది. ఓబులాపురం మైనింగ్ కంపెనీ కేసులో ఆమెను తెలంగాణ హైకోర్టు నిర్దోషిగా పరిగణించింది. ఆమెకు క్లీన్ చిట్ ఇస్తూ ఆ కేసును హైకోర్టు కొట్టేసింది. ఈ ఓఎంసీ కేసులో అరెస్టై గతంలో ఏడాది పాటు శ్రీలక్ష్మి జైలులో ఉన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం శ్రీలక్ష్మి ఏపీలో విధులు నిర్వర్తిస్తున్నారు. తాజాగా హైకోర్టు తీర్పుతో అమె ఇకపై ఏపీ చీఫ్ సెక్రటరీగా నియమితులు కావడానికి అడ్డంకులు తొలగిపోయాయి.
2011లో అరెస్టు, ఏడాది జైలులోనే
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 2007-2009 మధ్య కాలంలో శ్రీలక్ష్మి గనుల శాఖ కార్యదర్శిగా పని చేశారు. అదే సమయంలో కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్ధన్ రెడ్డికి చెందిన ఓబుళాపురం మైనింగ్ కంపెనీకి రూ.80 లక్షలు లంచం తీసుకుని అనుమతులు ఇచ్చారని శ్రీలక్ష్మిపై ఆరోపణలు వచ్చాయి. ఈ కేసులో శ్రీలక్ష్మి ఆరో నిందితురాలిగా ఉన్నారు. అలా ఆమె 2011లో అరెస్ట్ అయ్యారు. ఈ మేరకు దర్యాప్తు చేసిన సీబీఐ 2012లో ఛార్జిషీట్ కూడా దాఖలు చేసింది. దీనిపై దర్యాప్తు సమయంలో శ్రీలక్ష్మి ఏడాది పాటు చంచల్ గూడ జైలులో ఉన్నారు.
ఆ అరెస్టు ఘటనతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శ్రీలక్ష్మిని సస్పెండ్ చేసింది. ఏప్రిల్ 2, 2013న చంచల్‌గూడ మహిళా జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న ఆమెకు షరతులతో కూడిన బెయిల్ రావడంతో ఆమె విడుదల అయ్యారు. జైలు నుంచి బెయిల్‌పై విడుదలయిన తర్వాత సస్పెన్షన్‌ను ప్రభుత్వం ఎత్తి వేసింది.
కీలక పరిణామాలు
ఓబుళాపురం మైనింగ్ అక్రమాల కేసులో సీబీఐ ఛార్జిషీట్ దాఖలు చేసిన తర్వాత కూడా కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న గాలి జనార్ధన్ రెడ్డి తనకు బెయిల్ కోసం లంచం ఇచ్చారన్న ఆరోపణలు వచ్చాయి. ఆ తర్వాత ఈ కేసులో గాలి జనార్థన్ రెడ్డితో పాటు ఐఏఎస్ శ్రీలక్ష్మి, వీడీ రాజగోపాల్ వంటి అధికారుల పాత్రపైన కూడా సీబీఐ గట్టి ఆధారాలు సంపాదించింది. ఈకేసులో తన ప్రమేయం లేదని శ్రీలక్ష్మి విన్నవించుకున్నా ఈ కేసు కొట్టేసేందుకు హైకోర్టు నిరాకరించింది. చివరకు ఇప్పుడు శ్రీలక్ష్మికి క్లీన్ చిట్ ఇస్తూ తుది తీర్పు వచ్చింది. ఈ తీర్పుతో ఇక ఆమె ఏపీ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అవ్వడానికి అర్హురాలు అయ్యారు. అయినా సీబీఐ హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో అప్పీలు చేసే అవకాశం కూడా లేకపోలేదు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన సమయంలో అఖిల భారత సర్వీసు అధికారుల విభజన సందర్భంగా శ్రీలక్ష్మిని తెలంగాణకు కేటాయించారు. ఆమె పోస్టల్ అడ్రస్ తెలంగాణలో ఉండడంతో ఆమెను తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వానికి కేటాయించింది. అయితే, 2014లో తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ క్యాడర్ కు వెళ్లేందుకు ప్రయత్నించగా.. కేంద్ర ప్రభుత్వం అందుకు నిరాకరించింది. ఆ నిర్ణయంపై శ్రీలక్షి కేంద్ర పరిపాలన ట్రైబ్యునల్ ను ఆశ్రయించారు. ఆమె తన సొంత రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని దానికి సంబంధించిన ఆధారాలను అందజేశారు. అక్కడ అన్ని రుజువు చేయడంతో సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ ఆమెను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి బదిలీ చేసింది.