తెలంగాణ ప్రాంతంలో మాంసాహార ప్రియులు ఎక్కువగా ఉండే సంగతి తెలిసిందే. ఇక్కడి సంప్రదాయం ప్రకారం ప్రతి పెళ్లిలోనూ లేదా కర్మల్లాంటి కార్యక్రమాల్లోనూ మాంసాహారాన్ని అధిక మంది వడ్డిస్తూ ఉంటారు. మటన్ విషయంలో పక్క రాష్ట్రాలతో పోలిస్తే ఎక్కువ వినియోగం తెలంగాణలో ఉంటుంది. అయితే, ఈ మధ్య మటన్ ధరలు బాగా పెరగడం సామాన్యులను ఇబ్బందికి గురి చేస్తున్నాయి. ఇలాంటి వారికి తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. తక్కువ ధరలకు నాణ్యమైన మటన్ బిర్యానీ, వేరే మాంసాహార వంటకాలను అందించడానికి రెడీ అయింది. దీనికోసం ప్రత్యేకంగా మటన్ క్యాంటిన్లు నిర్వహించనున్నారు.
రాష్ట్ర ప్రభుత్వ గొర్రెలు, మేకల అభివృద్ధి సంఘం ఆధ్వర్యంలో ఈ వంటకాలను తయారు చేసి వడ్డించనున్నారు. ముందుగా హైదరాబాద్‌లోని మాసాబ్ ట్యాంక్ సమీపంలో ఉన్న శాంతినగర్ ఏరియాలో ఈ నెల 12న తొలి తెలంగాణ మటన్ క్యాంటీన్ ప్రారంభం కానుంది. ఇప్పటికే శాంతినగర్‌లో ప్రారంభించిన చేపల క్యాంటీన్‌కు ప్రజల నుంచి మంచి స్పందన వస్తుందని అధికారులు చెబుతున్నారు. దీంతో గొర్రెలు, మేకల అభివృద్ధి సమాఖ్య మటన్ క్యాంటీన్ పై ఫోకస్ పెట్టింది. ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్‌ల మద్దతుతో మటన్ క్యాంటీన్‌ల ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు.
ఇప్పటికే ఫెడరేషన్ కేంద్ర కార్యాలయం సమీపంలో క్యాంటీన్‌ను నిర్మించారు. ముందుగా హైదరాబాద్‌లో ప్రారంభించి అనంతరం అన్ని జిల్లా కేంద్రాలలోనూ మటన్ క్యాంటిన్లు ప్రారంభిస్తామని సమాఖ్య చైర్మన్ దూదిమెట్ల బాలరాజు యాదవ్ వెల్లడించారు. గొర్రెల పంపిణీ పథకం ద్వారా రాష్ట్రంలో గొర్రెల సంఖ్య పెరిగిందని అన్నారు. అయినా మటన్ ధరలు తగ్గకపోవడంతో ప్రభుత్వ ఆధ్వర్యంలో మటన్ క్యాంటీన్లను ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. ఈనెల 12న తొలి క్యాంటిన్ ఏర్పాటు ఉంటుందని చెప్పారు.
మటన్ క్యాంటిన్‌లలో లభించే వంటకాలు ఇవే
మటన్ క్యాంటిన్ మేలురకం గెర్రెలు లేదా మేకల నుంచి సేకరించిన మటన్ తో వంటకాలు చేయనున్నారు. మటన్ బిర్యానీ, కీమా, తలకాయ కూర, మటన్ టిక్కా వంటి అన్ని రకాల మాంసాహార వంటకాలు సరసమైన ధరలకు విక్రయిస్తామని అధికారులు చెబుతున్నారు.
తెలంగాణలో ప్రభుత్వ ప్రోత్సాహం వల్లే గొర్రెలు, మేకల ఉత్పత్తి బాగా పెరిగిందని అధికారులు తెలిపారు. ప్రాథమిక పెంపకం దారుల సొసైటీల ద్వారా గొర్రెల పెంపకందారులు లాభాలు గడిస్తున్నారని అన్నారు. ప్రైమరీ బ్రీడర్ సొసైటీలను ఇప్పుడు ఏర్పాటు చేయనున్న మటన్ మార్కెట్‌లకు కనెక్ట్ చేస్తామని అధికారులు చెబుతున్నారు. తద్వారా నేరుగా మటన్ విక్రయించేలా చర్యలు తీసుకుంటామని అన్నారు. రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాల్లో ఏర్పాటు చేయనున్న మటన్ క్యాంటిన్లలో కురుమ, యాదవ సామాజిక వర్గాలకు రిజర్వేషన్లు కల్పిస్తామని అధికారులు చెబుతున్నారు. పశు సంవర్థక శాఖ, పర్యాటక శాఖ, ఇతర శాఖల సమన్వయంతో ఈ క్యాంటిన్లను సక్సెస్‌ఫుల్ గా నిర్వహిస్తామని అన్నారు.