LB Nagar Murder Case: హైదరాబాద్‌లోని ఎల్బీనగర్ లో కలకలం సృష్టించిన ప్రేమోన్మాది దాడి ఘటనలో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. పోలీసులను ముప్పు తిప్పలు పెట్టిన నిందితుడు శివ కుమార్ ఎట్టకేలకు హత్యకు సంబంధించిన కారణాలను వివరించినట్లు సమాచారం. అయితే ఆదివారం అరెస్ట్ అయిన అతడు ఒక్కోసారి ఒక్కో విధంగా సమాధానం ఇచ్చాడు. ఒకసారేమో సంఘవిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నానని, మరోసారి తనకేమీ తెలియదని బదులు ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే వాస్తవాలు తెలుసుకునేందుకు పోలీసులు సీన్ రీకన్ స్ట్రక్షన్ చేయించారు. అనంతరం వాంగ్మూలం నమోదు చేసి కోర్టులో హాజరు పరిచి రిమాండ్ కు తరలించారు. ఈక్రమంలోనే అనేక షాకింగ్ విషయాలు వెల్లడయ్యాయి. అసలు శివ కుమార్.. సంఘవిపై దాడి ఎలా చేశాడు, పృథ్వీని ఎలా చంపాడనే వివరాలు తెలిశాయి. 


పూర్వవిద్యార్థుల సమ్మేళనానికి వెళ్లడమే తప్పయింది..!


ఎల్బీ నగర్ ఆర్టీసీ కాలనీలో సంఘవి తన సోదరులు పృథ్వీ తేజ్, రోహిత్, శ్రీనివాస్ తో నివాసం ఉంటోంది. ఇక్కడే ఉండి వీరంతా చదువుకుంటున్నారు. అయితే కొన్ని నెలల క్రితం సంఘవి చదివిన పదో తరగతి పూర్వ విద్యార్థుల సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరు అయిన సంఘవిని శివ కుమార్ మళ్లీ కలిశాడు. అప్పటి నుంచి ఆమెను ప్రేమిస్తున్నానంటూ వెంటపడడం ప్రారంభించాడు. పెళ్లి కూడా చేసుకుంటానంటూ వేధింపులు ప్రారంభించాడు. ఎల్బీనగర్ లో ఉంటూ రామాంతపూర్ లో చదువుతుందనే విషయం తెలుసుకుని నగరానికి మకాం మార్చాడు. ఎప్పుడూ ఆమె వెనకాలే తిరుగుతూ పెళ్లి చేసుకోవాలని కోరుతున్నాడు. అయితే రోహిత్, శ్రీనివాస్ లు కొందుర్గులో బంధువుల వివాహానికి వెళ్లారు. ఈ విషయం తెలుసుకున్న శివ కుమార్ కర్మాన్ ఘాట్ లో ఉండే తన సమీప బంధువు, సోదరిని వెంట తీసుకొని సంఘవి ఇంటికి వెళ్లాడు. పెళ్లి చేసుకోవాలిన అడిగించాడు. అందుకు సంఘవి నో చెప్పింది. దీంతో తన సోదరిని తీసుకొని కర్మాన్ ఘాట్ లో దింపేశాడు.


అడ్డుకునేందుకు వెళ్లిన సంఘవి తమ్ముడి హత్య 


ఆపై కత్తి తీసుకొని మళ్లీ సంఘవి నివాసానికి వచ్చాడు. తొలత ఇంట్లో సంఘవి ఒక్కతే ఉండగా.. పృథ్వీ తేజ్ వచ్చాడు. అప్పటికే శివ కుమార్ ఆమెపై దాడికి పాల్పడడం గుర్తించి అడ్డుకోబోయాడు. ఈక్రమంలోనే శివ కుమార్ పృథ్వీపై కూడా దాడికి పాల్పడ్డాడు. తీవ్ర గాయాలపాలైన పృథ్వీ అక్కడికక్కడే చనిపోయాడు. సంఘవి తీవ్ర గాయాలపాలైంది. అప్పటికే వారి కేకలు విని స్థానికులంతా వచ్చేశారు. దీంతో నిందితుడు గదిలోకి వెళ్లి తలుపు వేసుకున్నాడు. పోలీసులకు సమాచారం ఇచ్చిన స్థానికులు.. సంఘవిని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం మెరుగైన చికిత్స నిమిత్తం సంఘవిని గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రికి తరలించారు. ఉస్మానియా ఆసుపత్రిలో పోస్టుమార్టం పూర్తి చేసి పృథ్వీ తేజ్ మృతదేహాన్ని సోమవారం రోజు కుటుంబ సభ్యులకు అప్పగించారు. 


గతంలో తండ్రిని కొట్టి చంపిన శివ కుమార్


నిందితుడు శివకుమార్ కు గత నేర చరిత్ర ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. డిగ్రీ ఫస్ట్ క్లాసులో పాసైన ఇతడు.. సినిమాలపై ఆసక్తితో భవిష్యత్తుపై దృష్టి పెట్టకుండా సమయం వృథా చేశాడని నేరళ్ల చెరువు గ్రామస్థులు చెబుతున్నారు. ఈ క్రమంలోనే తండ్రి మందలించగా... తట్టుకోలేని శివ కుమార్ తండ్రి తలపై సుత్తెతో కొట్టాడు. దీంతో తీవ్ర గాయాలపాలైన తండ్రిని ఆసుపత్రిలో చేర్చగా.. చికిత్సపొందతూ ఆయన మరణించారు. ఈ విషయం బయటకు వస్తే శివ కుమార్ జీవితం నాశనం అవుతుందని భావించిన గ్రామస్థులు.. నేరాన్ని దాచి పెట్టి సహజ మరణంగా చిత్రీకరించి అంత్యక్రియలు పూర్తి చేశారు. అయితే ఇలాంటి నేర చరిత్ర ఉన్న శివ కుమార్ ను కఠినంగా శిక్షించాలని బాధిత కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. అతడు జైలు నుంచి బయటకు వస్తే.. మళ్లీ సంఘవిపై దాడి చేసి హత్య చేసే అవకాశం ఉందని ఆమె సోదరుడు రోహిత్ చెబుతున్నాడు. కాబట్టి అతడిని కఠినంగా శిక్షించాని కోరుతున్నాడు.