Prashanth Kishore: రాష్ట్రంలో రాబోయే ఎన్నికల్లో తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ ప్రభంజనం సృష్టించబోతుందని రాజకీయ వ్యూవహకర్త ప్రశాంత్ కిషోర్ అన్నారు. మరోసారి తెలంగాణలో సీఎం కేసీఆర్ యే ముఖ్యమంత్రి కాబోతున్నారని చెప్పారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ కు తిరుగులేదని వెల్లడించారు. సోమవారం ఆయన జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ... ఈ కామెంట్లు చేశారు. రాజస్థాన్ లో కాంగ్రెస్, మధ్యప్రదేశ్ లో బీజేపీ, ఛత్తీస్ గఢ్ లో కాంగ్రెస్, తెలంగాణలో బీఆర్ఎస్ విజయం సాధిస్తాయని వివరించారు. విపక్ష ఇండియా కూటమిని ముందుకు నడిపై సరైన నాయకుడు లేడని పేర్కొన్నారు. అలాగే రాహుల్ కు ఆ సామర్థ్యంం లేదన్నారు. విద్యార్థులు పరీక్షల ముందు అరగంట సేపు పుస్తకం పట్టినట్లు ఎన్నికలు సమీపిస్తున్న వేళ కూటమి కట్టారని విమర్శనాస్త్రాలు విసిరారు. తాను భవిష్యత్తులో ఏ పార్టీకీ పని చేయబోనని.. తాను ఆ పని మానేశానని చెప్పారు. తన దష్టి అంతా తన సొంత రాష్ట్రం అయిన బీహార్ అభివృద్ధి పైనే ఉందని వెల్లడించారు. తాను బీహార్ లో సరైన వ్యవస్థను ఏర్పాటు చేస్తానని అక్కడి ప్రజల కోసమే పని చేస్తానని తేల్చి చెప్పారు.
ప్రశాంత్ కిషోర్ ఇండియన్ పొలిటికల్ యాక్షన్ కమిటి.. ఐ ప్యాక్ అనే సంస్థను ప్రారంభించి రాజకీయ పార్టీలకు సేవలు అందిస్తున్నారు. మొదట బీజేపీతో ప్రారంభించి ఆ తర్వాత చాలా పార్టీలకు పని చేశారు. ఇప్పుడు ఆయన ఐ ప్యాక్ యాజమాన్యంలో ఉన్నారు కానీ.. నిర్వహణ నుంచి మాత్రం వైదొలిగారు. ఐ ప్యాక్ సేవలు అందిన వారిలో కాంగ్రెస్ , వైఎస్ఆర్‌సీపీ, టీఎంసీ, డీఎంకే వంటి అధికారం పొందిన పార్టీలు ఉన్నాయి. వీటికి సేవలు అందించేందుకు ఆయన వందల కోట్లలోనే ఫీజు వసూలు చేశారన్న ప్రచారం జరిగింది. కానీ రాజకీయ పార్టీలు నేరుగా అన్ని వందల కోట్లు చెల్లించలేవు. చెల్లిస్తే ఆడిటింగ్‌లో తేలిపోతుంది. కానీ ఇప్పటి వరకూ అలా చెల్లించినట్లుగా ఎప్పుడూ బయటకు రాలేదు. గతేడాది బీఆర్ఎస్‌తో ఐ ప్యాక్ ఒప్పందం చేసుకున్న సమయంలోనూ ఇలాగే వందల కోట్ల డీల్ అంటూ ప్రచారం జరిగింది. కానీ కేసీఆర్ పీకే తనకు మిత్రుడని ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా సేవలు అందిస్తున్నారని చెప్పారు. కానీ ఉచితంగా సేవల చేయడానికి ప్రశాంతి కిషోర్ పెట్టింది స్వచ్చంద సంస్థ కాదు కాబట్టి ఎవరూ నమ్మలేదు. ఆ సంస్థకు ఎంత ఆదాయం వస్తుంది.. ఎంత లాభం అనేది స్పష్టత లేదు. కానీ ఇప్పుడు కూడా వైఎస్ఆర్‌సీపీ వంటి పార్టీలకు కీలకంగా పని చేస్తోంది. కానీ ఫీజు విషయంలో మాత్రం క్లారిటీ లేదు.
ప్రశాంత్ కిషోర్ 2012 నుంచి రాజకీయ వ్యూహకర్తగా వ్యవహరిస్తున్నారు. 2012లో గుజరాత్ సీఎంగా నరేంద్ర మోదీ విజయం సాధించడంతో పాటు 2014లో దేశ ప్రధానిగా అద్భుత విజయం సాధించడంలో కీలకంగా పని చేశారు. బీహార్ లో నితీష్ కుమార్ హ్యాట్రిక్ సీఎంగా గద్దెనెక్కడంలోనూ ఆయన కృషి ఉందని పేర్కొన్నారు. అనంతరం పశ్చిమ బెంగాల్ లో మమతా బెనర్జీ, ఢిల్లీలో అరవింద్ కేజ్రీవాల్, ఏపీలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రులుగా గద్దెనెక్కేందుకు కారణం అయ్యారు. 2012 నుంచి ఇప్పటి వరకూ ఒకటి రెండు చోట్ల తప్ప అన్ని ఎన్నికల్లో ఆయన చెప్పిన పార్టీలే విజయం సాధించడం గమనార్హం.