31 People dies during heavy rains in State says Harish Rao | హైదరాబాద్: తెలంగాణలో రెండు, మూడు రోజులు కురిసిన భారీ వర్షాలకు ప్రాణ నష్టం సంభవించింది. తాజాగా కురిసిన వర్షాలు, వరద ప్రవాహం కారణంగా తెలంగాణ వ్యాప్తంగా 16 మంది చనిపోయారని సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) ప్రకటించారు. సోమవారం ఉదయం సూర్యాపేటలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిలతో కలిసి జిల్లాలో వర్షాలు, వరద నష్టంపై సమీక్ష నిర్వహించారు. ఆపై ఖమ్మం జిల్లా (Khammam District)లో పర్యటించి, వరద ప్రభావిత ప్రాంతాలను మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో వెళ్లి స్వయంగా పరిశీలించారు రేవంత్ రెడ్డి. రాష్ట్రంలో వర్షాల కారణంగా పదహారు మంది ప్రాణాలు కోల్పోవడం బాధాకరం అన్నారు. ఫాం హౌస్ లో కూర్చున్న ఒకరు, అమెరికాలో ఉన్న మరొకరు వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి బాధితులను పరామర్శించడం, సాయం చేయడం లాంటివి చేయలేదని రేవంత్ బీఆర్ఎస్ నేతల్ని విమర్శించారు. 


మృతుల సంఖ్యను తెలంగాణ ప్రభుత్వం తగ్గించి చూపిస్తుందా ?


సీఎం రేవంత్ కామెంట్లపై మాజీ మంత్రి హరీష్ రావు (Harish Rao) స్పందించి ఘాటు వ్యాఖ్యలు చేశారు. 16 మంది చనిపోయారు అని ప్రభుత్యం చెబుతోందని, అయితే 31 మంది చనిపోయారని తమకు సమాచారం ఉందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇది ముమ్మాటికీ ప్రభుత్వ వైఫల్యమని, సీఎం రేవంత్ రెడ్డి వరద బాధితులకు సహాయం చెయ్యకుండా బీఆర్ఎస్ నేతలపై బురుద వేస్తున్నారంటూ మండిపడ్డారు. ప్రతిపక్షంలో ఉన్నా, అధికార పక్షంలో ఉన్నా తమపై విమర్శలు చెయ్యడమే రేవంత్ రెడ్డికి పనిగా పెట్టుకున్నారా అని ప్రశ్నించారు. 74 ఏళ్ల వయసులో చంద్రబాబు వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి, బాధితులకు అండగా ఉంటే.. తెలంగాణ సీఎం రేవంత్ హైదరాబాద్ కే పరిమితమయ్యారని విమర్శించారు.






ఆ ముగ్గురు ఖమ్మం మంత్రులు ఫెయిల్
‘ఖమ్మం జిల్లాలో తొమ్మిది సీట్లు ఇస్తే, 9 మందిని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కాపాడలేకపోయింది. ఖమ్మం జిల్లా నుంచి ముగ్గురు మంత్రులున్నా అంతా ఫెయిల్ అయ్యారు.. వాతావరణ శాఖ చెప్పినా కూడా ముందస్తు చర్యలు చేపట్టలేదు. ఇప్పటికైనా మంత్రులు, కాంగ్రెస్ నేతలు బుద్ధి తెచ్చుకోవాలి. తమ తప్పులు సరిదిద్దుకుని, ఆపదలో ఉన్న వారిని కాపాడండి. కాంగ్రెస్ నేతలు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చనిపోయిన వారికి రూ. 25 లక్షల చొప్పున అడిగారు. ఇప్పుడు మీ హయాంలో చనిపోయిన వ్యక్తులకు అలాగే 25 లక్షలు రూపాయలు ఇవ్వండి. సహాయం కోరిన వారిపై సైతం లాఠీఛార్జ్ చేశారు. ప్రజాపాలన అంటే ఇదేనా’ అని ప్రశ్నించారు హరీష్ రావు. ఈ మేరకు ఓ వీడియో సైతం విడుదల చేశారు.


Also Read: Revanth Reddy: వరద సమయంలో బురద రాజకీయాలు వద్దు, 3 రోజుల నుంచి నిద్రలేదు: రేవంత్ రెడ్డి