KTR Comments: విజన్ ఉంటే విపత్తులను కూడా సమర్థంగా ఎదుర్కోవచ్చని బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అమలుచేసిన  ఎస్.ఎన్.డి.పి. కార్యక్రమం అక్షరాలా నిరూపించిందని మున్సిపల్ శాఖ మాజీ మంత్రి కేటిఆర్ వెల్లడించారు. గత రెండు, మూడు రోజులుగా హైదరాబాద్ లో ఎడతెరిపి లేకుండా  వర్షం కురుస్తున్నా లోతట్టు ప్రాంతాలకు ముంపు లేకుండా కాపాడటంలో ఎస్.ఎన్.డి.పి. కీలక పాత్ర పోషించిందని గుర్తుచేశారు. తెలంగాణకు  ఎకనమిక్ ఇంజన్ అయిన హైదరాబాద్ లో భారీవర్షాల వల్ల వచ్చే వరద ముప్పును నివారించేందుకు గతంలో ముఖ్యమంత్రి కేసిఆర్ ఆదేశాల మేరకు మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో  వ్యూహాత్మక నాలాల అభివృద్ధి కార్యక్రమాన్ని (ఎస్.ఎన్.డి.పి) చేపట్టామని స్పష్టంచేశారు. 


సమైక్య రాష్ట్రంలో ఉన్నప్పుడు భారీ వర్షాలు, వరదలు వచ్చిన ప్రతి సందర్భంలోనూ  హైదరాబాద్ లోని లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యేవని, కాలనీల్లోని ఇళ్లలోకి వరదనీరు చేరి పేద, మధ్యతరగతి ప్రజల జనజీవనం పూర్తిగా అస్తవ్యస్థంగా మారేదని గుర్తు చేశారు. ఈ కీలక సమస్యకు శాశ్వత పరిష్కారం కనుగొనాలనే ఆలోచనలో భాగంగానే ఎస్.ఎన్.డి.పీ. పురుడుపోసుకుందని చెప్పారు.  రాష్ట్ర రాజధానిలో వరదనీరు, మురుగునీటి వ్యవస్థను పూర్తిస్థాయిలో పటిష్టపరిచేందుకు 985 కోట్లతో 60 పనులు చేపట్టడం వల్లే ఈ రోజు  వరద ముప్పు తప్పిందన్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక్క పైసా సహకారం లేకున్నా.. మొత్తం రాష్ట్ర ప్రభుత్వ నిధులతో ఎస్.ఎన్.డి.పి. పనులు చేపట్టడం మరో ప్రత్యేకత అని వెల్లడించారు. 


చిన్నపాటి వర్షానికే పొంగిపొర్లే 36 కీలకమైన నాలాల అభివృద్ధి పనులను శరవేగంగా చేపట్టామన్నారు. తాజాగా రాజధానిలో ఇంత భారీగా వర్షం కురిసినప్పటికీ గతంలో  ముంపునకు గురైన  ప్రాంతాల్లో వరద నీరు నిలవకపోవడం ఎస్.ఎన్.డి.పి ఘనతేనన్నారు. ఇదే విషయాన్ని ఆయా ప్రాంతాల్లోని ప్రజలే హర్షం వ్యక్తం చేస్తూ చెబుతుండటం  గొప్ప సంతృప్తినిస్తోందన్నారు. గతంలో మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ హైదరాబాద్ ఉన్నప్పుడు వరదనీటి కాల్వలు, మురుగునీటి కాల్వలు కలిసిపోయి వ్యవస్థంతా అధ్వాన్నంగా ఉండేదన్నారు.  ఎస్.ఎన్.డి.పి కార్యక్రమంలో భాగంగా  పాడైపోయిన పాత నాలాల పునరుద్ధరణతోపాటు, కొత్త నాలాల నిర్మాణాన్ని యుద్ధప్రాతిపదికన పూర్తిచేశామన్నారు. ఈ సందర్భంగా నాడు ఎస్.ఎన్.డి.పి. పనుల్లో భాగస్వాములైన ప్రతిఒక్కరికీ కేటిఆర్ అభినందనలు తెలియజేశారు.