నేషనల్ సెమినార్‌కు వెళ్తూ వరదల్లో కొట్టుకుపోయిన తండ్రీ కూతురు- ఖమ్మం జిల్లాలో హృదయ విదారకర ఘటన 


ఇది మాటలకు అందని విషాదం. జాతీయస్థాయి సెమినార్‌కు వెళ్తూ కుమార్తె, ఆమెను డ్రాప్ చేయడానికి వెళ్తూ తండ్రి ఇద్దరూ వరదల్లో కొట్టుకుపోయారు. ఖమ్మం జిల్లాకు చెందిన వీళ్లిద్దరి మరణ వార్త కంటతడి పెట్టిస్తుంది. 


యువ శాస్త్రవేత్తగా జాతీయ స్థాయి సెమినార్‌లో ప్రసంగించాల్సిన కూతురిని హైదరాబాద్ ఎయిర్ పోర్ట్‌లో దింపడానికి తండ్రి వెళ్లారు. అకస్మాత్తుగా వచ్చిన వరదల్లో వాళ్లు వెళ్తున్న కారు కొట్టుకుపోయింది. దీంతో ఇద్దరూ ప్రాణాలు కోల్పోయారు.


భారీ వర్షాలకు మహబూబాద్ జిల్లాలో హృదయ విదారకర ఘటన చోటు చేసుకుంది. కుటుంబం సభ్యులకు ఫోన్ చేసి వరదల్లో చిక్కుకున్నామని చెప్పిన కాసేపటికే కొట్టుకుపోయారు.


ఖమ్మం జిల్లా సింగరేణి మండలం గేట్ కారేపల్లి గంగారం తండాకు చెందిన నూనావత్ మోతిలాల్, నూనావత్ అశ్విని కారులో హైదారాబాద్ బయల్దేరారు. శంషాబాద్ ఎయిర్ పోర్ట్‌లో కుమార్తెను డ్రాప్ చేసి ఇంటికి తిరిగ వచ్చేద్దామని మోతిలాల్ అనుకున్నారు. అయితే మహబూబాబాద్ జిల్లా  పురుషోత్తమాయగూడెం వద్దకు వచ్చేసరికి వారిని మృత్యువు కమ్మేసింది. 


ఆకేరు వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తున్న సంగతి తెలుసుకోకుండా కారును ముందుకుపోనిచ్చారు. ఆ ప్రవాహం ధాటికి తండ్రీకుమార్తె  ప్రయాణిస్తున్న కారు వాగులో కొట్టుకుపోయింది. తాము వరదల్లో చిక్కుకున్నామని కుటుంబానికి తెలియజేశారు. వాళ్లు అధికారులకు సమాచారం ఇచ్చే లోపు ఘోరం జరిగిపోయింది. 
అధికారులకు సమాచారం ఇచ్చి మోతిలాల్‌కు ఫోన్ చేస్తే తండ్రీకూతురు ఫోన్‌లు స్విచ్ఛాప్ వస్తున్నాయి. కాసేపటికి అధికారులు వెళ్లి చూస్తే కొంత దూరంలో రెండు డెడ్‌బాడీలు కనిపించాయి. దీంతో ఆ ఫ్యామిలీ కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది. 


నిన్న ఉదయం కారు కొట్టుకుపోగా మధ్యాహ్నం తరువాత ఆకేరు వాగు సమీపంలో ఉన్న పామాయిల్ తోటలో అశ్విని మృతదేహం లభ్యమైంది. ఈ ఉదయం తండ్రి మోతిలాల్ మృతదేహం దొరికింది.