Rains In Telangana: తెలంగాణలో మూడు రోజుల నుంచి కురుస్తున్న వర్షాలు బీభత్సం సృష్టించాయి. రహదారులు, రైల్వే పట్టాలు కొట్టుకుపోయాయి. ఊళ్లకు ఊళ్లే జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. చాలా మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించినా ఇంకా చాలా పల్లెల్లు నీటిలో కాపురాలు చేస్తున్నాయి. బయట ప్రపంచంతో సంబంధాలు తెగిపోయి సమస్యల్లో కొట్టుమిట్టాడుతున్నాయి. 


ఈ వర్షాలకు ఖమ్మం జిల్లాలో భారీ నష్టం జరిగింది. ఎగువ నుంచి వస్తున్న వరద కారణంగా వాగులు, వంకలు, నదులు పొంగి ప్రవహిస్తున్నాయి. మంత్రులు బాధిత ప్రాంతాల్లోనే ఉంటూ ప్రజలకు చేదోడుగా ఉంటున్నారు. అధికారులను అప్రమత్తం చేసి ప్రజలకు సమస్యలు రాకుండా ప్రయత్నిస్తున్నారు. పంట భూములు వేల ఎకరాలు నీట మునిగిపోయాయి. 



వర్షాలపై సమీక్ష నిర్వహించిన సీఎం రేవంత్ రెడ్డి అధికారులు ఎవరూ సెలవులు పెట్టొద్దని 24 గంటలక పాటు ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు. ముఖ్యంగా సీఎం, డీజీపీ, పురపాలక, విద్యుత్, పంచాయతీరాజ్‌ శాఖ, నీటిపారుదల శాఖ, హైడ్రా అధికారులంతా మరింత అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ఖమ్మంలో పరిస్థితి ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్న సీఎం అక్కడ పరిస్థితి తెలుసుకునేందుకు నేరుగా బయల్దేరి వెళ్తున్నారు. రోడ్డు మార్గంలో ఖమ్మం చేరుకొని ప్రజలకు భరోసా ఇవ్వనున్నారు. 


ఖమ్మం, భద్రాద్రి, సూర్యపేట, మహబూబాద్‌ జిల్లాలకు ప్రత్యేక నిధులను ప్రభుత్వం విడుదల చేసింది. ఈ జిల్లాల్లో వరద బాధితులను ఆదుకునేందుకు తక్షణ సాయం కింద ఐదు కోట్లను రేవంత్ రెడ్డి విడుదల చేశారు. ఇప్పటి వరకు ప్రకృతి విపత్తుల్లో మరణించే వాళ్లకు ఇచ్చే సాయాన్ని నాలుగు లక్షల నుంచి ఐదు లక్షలకు పెంచుతున్నట్టు ప్రకటించారు.  


తెలంగాణలో వరుణుడి బీభత్సం- ఈ జిల్లాల ప్రజలు బయటకు రావద్దని అధికారుల సూచన


ఇప్పటికే ఇద్దరు మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మల్లు భట్టి విక్రమార్క ఖమ్మంలో బస చేసి పరిస్థితులను పర్యవేక్షిస్తున్నారు. మిగతా జిల్లాల్లో ఉన్న పరిస్థితులను తెలుసుకునేందుకు ఆయా జిల్లాల మంత్రులు, ఇన్‌ఛార్జ్ మంత్రులను కూడా రేవంత్ రెడ్డి అప్రమత్తం చేశారు. వారితో ఎప్పటికప్పుడు మాట్లాడుతూ విషయాలు తెలుసుకుంటున్నారు. 


తెలంగాణలో వరద పరిస్థితులు గురించి కేంద్రం కూడా ఆరా తీసింది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ... సీఎం రేవంత్ రెడ్డికి ఫోన్‌ చేసి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం వరద ప్రభావిత ప్రాంతాలు, తీసుకుంటున్న చర్యలను సీఎం రేవంత్ రెడ్డి ప్రధానికి వివరించారు. కేంద్రం నుంచి మరిన్ని ఎన్డీఆర్‌ఎఫ్‌ బలగాలను పంపిస్తున్నట్టు సీఎంకే ప్రధాని భరోసా ఇచ్చారు. ప్రాణ నష్టం లేకుండా అప్రమత్తంగా సూచించారు. ఎలాంటి సాయం కావాలన్నా అడగాలని చెప్పారు. కేంద్ర హోంమంత్రి అమిత్‌షా కూడా రేవతంత్ రెడ్డికి ఫోన్ చేశారు. పరిస్థితిపై ఆరా తీశారు. 


ఖమ్మం జిల్లాలతోపాటు పక్కనే ఉన్న ఉమ్మడి వరంగల్, నల్గొండ జిల్లాలో కూడా వర్షాలు నష్టాన్ని కలిగించాయి. మహబూబాబాద్‌ జిల్లా నీటిలో మునిగిపోయింది. జిల్లాలోనే ఇంటికన్నె-కేసముద్రం స్టేషన్ల సుమారు 300 మీటర్ల మేర రైల్వే ట్రాక్ కొట్టుకుపోయింది. దీంతో సుమారు 24 రైళ్ల రాకపోకలను నిలిచిపోయాయి. అయితే కీలకమైన మార్గం కావడంతో 24 గంటల్లోనే ట్రాగ్‌ను పునరుద్దరించారు. ప్రస్తుతం పరిమిత వేగంతో రైళ్లు రాకపోకలను అనుమతిస్తున్నారు. సూర్యాపేట జిల్లా మఠంపల్లి వద్ద కూడా పట్టాలు కొట్టుకుపోయాయి. 


Also Read: తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు - 432 రైళ్లు రద్దు, మరికొన్ని సర్వీసులు దారి మళ్లింపు


ఈ మూడు జిల్లాలల్లో సాగునీటి కాలువలు తెగిపోయాయి. చెరువులు కోతకు గురయ్యాయి. సూర్యాపేట జిల్లా నడిగూడెం మండలం కాగితరామచంద్రాపురంలో సాగర్‌ ఎడమ కాల్వకు పెద్ద ఎత్తున గండి పడింది. ఖమ్మం జిల్లా పరిధిలో కూడా సాగర్‌ ఎడమ కాల్వకు రెండు ప్రాంతాల్లో గండి పడింది. వివిధ జిల్లాల్లో కురిసిన వర్షాలకు వరుణుడు సృష్టించిన బీభత్సానికి 15 మందికిపైగా ప్రజలు మృతి చెందారు. మరికొందరు గల్లంతయ్యారు. 


Also Read: అల్ప‌పీడనం అంటే ఏమిటి? తుపాన్ ఎలా ఏర్ప‌డుతుంది? తుపాన్ల‌కు ఆ పేర్లు ఎలా పెడ‌తారు