Telangana News : తెలంగాణలో కొలువు జాతర స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీ వేదికగా ఉద్యోగ ప్రకటన చేశారు. 80 వేలకు పైగా ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు ప్రకటించారు. అయితే ఇప్పటి వరకూ ఓకే కానీ నోటిఫికేషన్లు ఎప్పుడన్న విషయంపై స్పష్టత లేదు. సీఎం కేసీఆర్ ప్రకటన చేశాక రేపో మాపో నోటిఫికేషన్లు వస్తాయని నమ్మకంతో అభ్యర్థులు కోచింగ్ సెంటర్ల బాట పట్టారు. ఇప్పటికే కోచింగ్ తీసుకున్న వారంతా మూలనపడేసిన పుస్తకాలు దుమ్ముదులుపుతున్నారు. అయితే నోటిఫికేషన్లు రాకముందే మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఇంట్లో ఉండి చదువుకోండి. అని పదే పదే చెప్తున్నారు. అయితే ఈ మాటలను ప్రతిపక్షాలను తప్పుబడుతున్నాయి. 


ఆ మాటాల్లో ఏదో మర్మం ఉంది : ప్రతిపక్షాలు 


నోటిఫికేషన్లు  విడుదల చేయకుండా ఇంట్లో ఉండి చదువుకోండి, బయటకు రాకండి అంటున్న టీఆర్ఎస్ నేతల మాటల్లో ఏదో మర్మం దాగిఉందని తప్పుబడుతున్నాయి. ప్రతిపక్షాలకు యువతను దూరం చేసేందుకు సీఎం కేసీఆర్ వేసిన ఎత్తుగడ ఇది బలంగా నమ్ముతున్నాయి. ఇప్పటి వరకూ ప్రతిపక్షాల వద్ద ఉన్న ప్రధాన ఆయుధాల్లో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ. నీళ్లు, నిధులు, నియామకాలతో తెచ్చుకున్న తెలంగాణలో నియామకాలు చేపట్టలేదని సమయం దొరికనప్పుడల్లా ప్రతిపక్షాలు విరుచుకుపడేవి. ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం పెద్ద ర్యాలీలు, ధర్నా, ప్రగతి భవన్ ముట్టడి చేసేవి. అయితే సీఎం కేసీఆర్ ఒక్క ప్రకటనతో ప్రతిపక్షాలను కట్టడి చేశారు. రేపు టీవీలు చూడండని చెప్పి మరీ ఉద్యోగ ప్రకటన చేశారు. అసెంబ్లీ వేదికగా 80 వేలకు పైగా ఉద్యోగాలు భర్తీ చేస్తామని, కాంట్రాక్ట్ ఉద్యోగులను పర్మినెంట్ చేస్తున్నట్లు ప్రకటించారు. 


నోటిఫికేషన్ల కోసం ఎదురుచూపులు 


అయితే ఉద్యోగార్ధులు ఇప్పుడు నోటిఫికేషన్ల కోసం ఎదురుచూస్తున్నారు. అన్ని లెక్కలు వేసుకుని ప్రిఫరేషన్ స్టార్ట్ చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. కోడిని కొంటే కాదు దాన్ని వండి పెట్టినప్పుడే సీఎం కేసీఆర్  మాటలు నమ్ముతాం అని కొందరు అభ్యర్థులు అంటున్నారు. నోటిఫికేషన్ల కోసం కళ్లు కాయలు కాసే వరకు చూసిన అభ్యర్థుల్లో అసహనాన్ని ప్రతిపక్షాలు కూడా క్యాష్ చేసుకున్నాయి. తరచూ యువతను ఆకర్షించేలా ఉద్యోగాల భర్తీకి నిరసనలు చేపట్టేవి. అధికార పార్టీ ప్రతిపక్షాలకు యువతను దూరం చేసేందుకు ఈ ఎత్తు వేసిందని కొందరు నేతలు ఆరోపిస్తున్నారు. ప్రతీ పార్టీలో యువ కేడర్ చాలా ముఖ్యం. ప్రచారంలో ముందుండే యువత, తమ నాయకుల కోసం ఎంతో కష్టపడి ప్రచారాలు చేస్తుంటారు. మంత్రులు, ఎమ్మెల్యేలు ఇంట్లో ఉండి చదువుకోండి అనడానికి ప్రధాన కారణం యువతను దూరం చేయడమేనని నేతలు అంటున్నారు. ఏది ఏమైనా ఉద్యోగ ప్రకటన తర్వాత యువత కొంత రాజకీయాలకు దూరంగా ఉంటారనడంలో వాస్తవం లేకపోలేదు.