Telangana Heat Wave : తెలంగాణలో ఎండలు(Heat) మండిపోతున్నాయి. రోజు రోజుకూ ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. మార్చి నెలలోనే ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల మార్క్ ను దాటేస్తున్నాయి. కొన్ని జిల్లాల్లో 42 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఎండ తీవ్రతతో రోడ్లపై జనసంచారం క్రమంగా తగ్గుతోంది. గత ఏడాది కన్న ముందుగానే ఈసారి ఎండలు మొదలయ్యాయి. మార్చిలోనే ఎండలు మండిపోతుంటే ఏప్రిల్, మే నెలల్లో ఇంకెంత తీవ్రంగా ఉంటాయో అని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. 






సాధారణం కన్నా నాలుగు డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు 


తెలంగాణ వ్యాప్తంగా గురువారం అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. నిజామాబాద్, ఆదిలాబాద్, రామగుండం, భద్రాచలం, మహబూబ్ నగర్, నల్లగొండ(Nalgonda) జిల్లాల్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. నల్లగొండ జిల్లాలో అత్యధికంగా 42.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. గురువారం ఉదయం నుంచే ఎండ తీవ్రతకు అధికంగా ఉంది. ఎండతో పాటు వేడి గాలులు వీస్తుడడంతో ఉష్ణోగ్రత పెరుగుతున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. సాధారణంగా కన్నా నాలుగు డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రతలు నమోదు అవుతుండడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఉక్కపోతతో ఇబ్బందులు పడుతున్నారు. గత వారం రోజులుగా రోజుకో డిగ్రీ చొప్పున ఉష్ణోగ్రతలు క్రమంగా పెరిగాయి. హీట్ వేవ్ నేపథ్యంలో ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ కోరుతుంది. అవసరం ఉంటే తప్ప బయటకు రావొద్దని హెచ్చరిస్తుంది. 


తెలంగాణలో ఆరెంజ్ అలెర్ట్ 


పలు జిల్లాల్లో ఇవాళ, రేపు వడగాల్పులు వీచే అవకాశం ఉందని హైద‌రా‌బాద్‌ వాతా‌వ‌రణ కేంద్రం హెచ్చరించింది. పగటిపూట అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని ఆరెంజ్ అలెర్ట్(Orange Alert) జారీ చేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ కేంద్రం(Metrological Department) సూచించింది. సాధారణంగా మే నెలలో హీట్ వేవ్(Heat Wave) వీస్తాయి కానీ ఈ ఏడాది మార్చి‌లోనే వడగాల్పులు వీస్తుం‌డటం ఆందో‌ళన కలిగిస్తుంది. మార్చి 19, 20 తేదీల్లో సాధా‌రణం కన్నా 2 నుంచి 4 డిగ్రీలు అద‌నంగా ఉష్ణో‌గ్రతలు నమో‌దయ్యే అవ‌కాశం ఉన్నట్టు వాతావరణ శాఖ పేర్కొంది. గురువారం ఆదిలాబాద్ లో 40.3 డిగ్రీలు, భద్రాచలంలో 40 డిగ్రీలు, హకీంపేట్ 37.3 డిగ్రీలు, దుండిగల్ 38.1 డిగ్రీలు, హన్మకొండ 38 డిగ్రీలు, హైదరాబాద్ 38.6 డిగ్రీలు, ఖమ్మం 38.2 డిగ్రీలు, మహబూబ్ నగర్ 40.1 డిగ్రీలు, మేదక్ 39.6 డిగ్రీలు, నల్లగొండ 42.4 డిగ్రీలు, నిజామాబాద్ 40.1 డిగ్రీలు, రామగుండం 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి.