Malakpet Incident: హైదరాబాద్ మలక్ పేట సంఘటనపై గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ స్పందించారు. మలక్ పేట ఆస్పత్రిలో ఇద్దరు బాలింతల మృతి బాధాకరమని అన్నారు. అలాగే ఈ ఘటనపై గైనకాలజిస్ట్ గా తనకు ఎన్నో ప్రశ్నలు ఉన్నాయంటూ అందరినీ షాక్ కు గురి చేశారు. రాష్ట్రంలోని వైద్య రంగంలో వసతులను మరింత మెరుగు పరచాల్సిన అవసరం చాలా ఉందంటూ చెప్పారు. బిల్లులు పెండింగ్ కాదు, పరిశీలనలో ఉన్నాయన్నారు. అన్ని అంశాలను పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉందని గవర్నర్ తమిళిసై చెప్పుకొచ్చారు. గతంలో కుటుంబ నియంత్రణ చికిత్సల సమయంలో కూడా నలుగురు మరణించారని గుర్తు చేశారు. రాష్ట్రంలో జనాభాకు అనుగుణంగా వైద్య రంగంలో వసతులు మరింతగా మెరుగు పరచాలని గవర్నర్ తమిళిసై చెప్పారు. అలాగే రాష్ట్రంలో వివాదాలతో నిమాయకాలు ఆలస్యం కాకూడదన్నదే తన భావని అని వివరించారు. ఈ విధంగా ప్రభత్వం చర్యలు తీసుకోవాలని సూచించారు. 


మరోవైపు ఈ ఘటనపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి స్పందించారు. వైద్యం వికటించి మలక్ పేట ప్రభుత్వ ఆసుపత్రి లో ఇద్దరు బాలింతలు మృతి చెందిన ఘటన అత్యంత  దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. ఇది ప్రభుత్వ నిర్లక్షానికి పరాకాష్ట అని విమర్శించారు. మలక్ పేట ఆసుపత్రిలో కల్వకుర్తి కి  సిరివెన్నెల, సైదాబాద్ కు చెందిన శివాని లు చికిత్స పొందుతూ వైద్యం వికటించి మృత్యువాత పడ్డారని..  హైదరాబాద్ లో మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రులు కడుతున్నామని గొప్పలు చెప్పుకుంటున్న ప్రభుత్వం కనీసం బాలింతలను కాపాడలేకపోతోందని విమర్శించారు. ప్రభుత్వ వైద్యంలో తెలంగాణ పూర్తిగా నిర్లక్ష్యం చేస్తుంది. ప్రభుత్వ వైఖరి వల్లనే ప్రైవేట్ వైద్యం ఇక్కడ అభివృద్ధి చెందుతోందని విమర్శించారు. 


అసలేం జరిగిందంటే ? 


మలక్ పేట ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యం  కారణంగా ఇద్దరు బాలింతలు మృతి చెందినట్టు మృతుల బంధువులు ఆరోపిస్తున్నారు. తీవ్ర అస్వస్థతకు గురై గాంధి ఆసుపత్రి లో చికిత్స పొందుతున్న ఇద్దరు బాలింతలు చనిపోయారని కుటుంబసభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనకు వైద్యుల నిర్లక్ష్యమే కారణమంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ఈ మేరకు ఛాదర్ ఘాట్ పోలీసులకు బాధితులు ఫిర్యాదు చేశారు. అనంతరం మలక్ పేట ఏరియా ఆసుపత్రి ముందు బాధితుల కుటుంబ సభ్యులు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా ప్రమాదానికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలంటూ వారు డిమాండ్ చేశారు.


ఆస్పత్రి తప్పిదమేమీ లేదంటున్న  వైద్యులు


ఈ ఘటపై మలక్ పేట  ఆస్పత్రి సూపరింటెడెంట్  స్పందించారు. ఇద్దరు బాలింతలకు ఈ నెల 11 న సిజేరియన్ చేశామన్నారు.  అందులో ఓ మహిళకు12న 4 గంటలకు... హార్ట్ రేట్ పడిపోయిందని, వెంటనే గాంధీకి రిఫర్ చేశామన్నారు. ఆమె గాంధీలో ట్రీట్మెంట్ తీసుకుంటూ మృతి చెందిందని చెప్పారు. ఇంకో మహిళకు అప్పటికే  హైపో థైరాడిజం ఉండడంతో... 12న రాత్రి షుగర్ లెవల్స్ పడిపోవడంతో గాంధీకి తరలించారని, ఆమె కూడా ట్రీట్మెంట్ తీసుకుంటూ మృతి చెందిందని తెలిపారు. ఈ కేసుల్లో వైద్యుల నిర్లక్ష్యం లేదని, ఆపరేషన్ కి ముందు అన్ని పరీక్షలు చేశామని చెబుతున్నారు.