తెలంగాణ రాష్ట్ర కొత్త సచివాలయాన్ని ప్రారంభించడానికి ముహూర్తం కుదిరింది. ఫిబ్రవరి 17న సీఎం కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా కొత్త సచివాలయాన్ని ప్రారంభిస్తారని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తెలిపారు.
ఈ కొత్త సచివాలయాన్ని సంక్రాంతి సందర్భంగా ప్రారంభించాలని ముందే భావించారు. కానీ, నిర్మాణ పనులు పూర్తి కాకపోవడం వల్ల వాయిదా వేశారు. తాజాగా సంక్రాంతి రోజునే సచివాలయం ప్రారంభంపై మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అధికారిక ప్రకటన విడుదల చేశారు. కేసీఆర్ పుట్టిన రోజు సందర్భంగా ఆయనే స్వయంగా ప్రారంభిస్తారని చెప్పారు.
నాలుగు ద్వారాలు
కొత్త సచివాలయం ప్రధాన ద్వారం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సచివాలయానికి ఉన్నట్లుగానే లుంబినీ పార్కు ఎదురుగా నిర్మితం అవుతోంది. తెలంగాణ రాకముందు ఈ వైపునే ప్రధాన ద్వారంగా పిలిచేవారు. వాస్తుపరంగా అలాగే కుదరటంతో ఇప్పుడు అక్కడే భారీ కమాన్ ఏర్పాటు చేస్తున్నారు. సీఎం కాన్వాయ్ ఇందులో నుంచే సచివాలయంలోకి ప్రవేశించనుంది. కొత్త సచివాలయానికి మొత్తం నాలుగు ద్వారాలు ఉంటాయి. ప్రధాన ద్వారం తూర్పు వైపుగా రానుండగా, ఎన్టీఆర్ గార్డెన్స్ వైపు ఉన్న గేటు వద్ద ఉద్యోగుల ప్రవేశ ద్వారం ఉంటుంది. ఇక ప్రస్తుతం బిర్లామందిర్ వైపు రోడ్డులో ఉన్న పెట్రోలు బంకును తొలగించి విజిటర్స్ కోసం ఇంకో గేటు నిర్మిస్తున్నారు. ఇలా మూడు ద్వారాలు ఉండడం సరికాదన్న ఉద్దేశంతో, సచివాలయం వెనకవైపు కూడా నాలుగో గేటును ఉంచుతున్నారు. దీన్ని ఎమర్జెన్సీ సందర్భాల్లో మాత్రమే వాడతారని తెలుస్తోంది.