నవ భారత శక్తి సామర్థ్యాలకు వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలు ప్రతీక అని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఈ ఏడాది తొలి వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌ను విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖపట్నం మధ్య ప్రారంభిస్తున్నట్లుగా చెప్పారు. ఆదివారం (జనవరి 15) సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లోని 9వ నెంబరు ప్లాట్ ఫాంపైన నిలిచి ఉన్న వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌ను ప్రధాని మోదీ వర్చువల్ గా ఆకుపచ్చ జెండా ఊపి ప్రారంభించారు. అంతకుముందు ప్రధాని మోదీ వందేభారత్ ఎక్స్ ప్రెస్ గురించి మాట్లాడారు.






‘‘ఈ సంక్రాంతి పండుగ వాతావరణంలో ఈరోజు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లకు గొప్ప కానుక అందుతోంది. వందే భారత్ ఎక్స్‌ప్రెస్, ఒక విధంగా తెలంగాణ - ఆంధ్రప్రదేశ్‌ల సంస్కృతి, వారసత్వాన్ని అనుసంధానం చేస్తుంది. వందే భారత్ రైలు ఇండియా నిర్దేశించుకున్న లక్ష్యాలు, సామర్థ్యానికి చిహ్నం. దేశం వేగవంతమైన మార్పు చెందడంలో ఇదొక మార్గం. కలలు, ఆకాంక్షల కోసం పరితపిస్తున్న దేశం తన లక్ష్యాన్ని వేగంగా చేరుకోవాలనుకుంటోంది. పౌరులందరికీ మెరుగైన సౌకర్యాలు కల్పించాలని కోరుకునే భారతదేశానికి ఇదొక ప్రతీక. వలసవాద మనస్తత్వం నుండి బయటికి వచ్చిన తర్వాత స్వావలంబన దిశగా పయనిస్తున్న భారతదేశానికి ఇది చిహ్నం.


ఈ రోజు ఆర్మీ డే కూడా. మన సైన్యాన్ని చూసి ప్రతి భారతీయుడు గర్విస్తున్నాడు. దేశం, సరిహద్దుల భద్రతకు భారత సైన్యం యొక్క సహకారం అసమానమైనది.’’ అని ప్రధాని మోదీ మాట్లాడారు.


ఈ సందర్భంగా ప్లాట్ ఫాం పైన ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కేంద్ర మంత్రులు అశ్వినీ వైష్ణవ్, కిషన్ రెడ్డి, గవర్నర్ తమిళిసై, తెలంగాణ మంత్రులు తలసాని శ్రీనివాస్, మహమూద్ అలీ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, ఎంపీ డాక్టర్ కే లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.