Sankranti 2023: తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ రాజకీయ ప్రముఖులు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ వ్యవసాయ రంగంలో చోటుచేసుకున్న విప్లవాత్మక ప్రగతి అందించే స్ఫూర్తితో, యావత్ దేశ రైతాంగానికి వ్యవసాయం పండుగగా మారిన రోజే.. భారత దేశానికి సంపూర్ణ క్రాంతి చేకూరుతుందని సీఎం కేసీఆర్ అన్నారు. భోగి, మకర సంక్రాంతి, కనుమ పండుగలను పురస్కరించుకొని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు దేశ, రాష్ట్ర  రైతాంగానికి, ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర, దేశ ప్రజలంతా సుఖ సంతోషాల నడుమ హాయిగా పండుగ జరుపుకోవాలని సూచించారు. పంట పొలాల నుంచి ధాన్యపు రాశులు ఇండ్లకు చేరుకున్న శుభ సందర్భంలో రైతన్న జరుపుకునే సంబురమే సంక్రాంతి పండుగని, నమ్ముకున్న భూతల్లికి రైతు కృతజ్ఞతలు తెలుపుకునే రోజే సంక్రాంతి పండుగ అని సీఎం వివరించారు.






అలాగే మంత్రి కేటీఆర్ కూడా సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సంబరాల సంక్రాంతి మీ అందరి జీవితాల్లో సంతోషాన్ని నింపాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. అందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు అంటూ ట్వీట్ చేశారు. 






సంక్రాంతి పర్వదినం సందర్భంగా రాష్ట్ర గవర్నర్ తమిళిసై ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. పంట చేతికి వచ్చిన సమయంలో జరిగే ఈ పండుగ ప్రతీ ఒక్కరిలో సంతోషాలు నింపాలని ఆకాంక్షించారు. పంట చేతికి వచ్చిన సమయంలో జరిగే ఈ పండుగ ప్రతీ ఒక్కరిలో ఆనందం నింపుతుందన్నారు. మన గొప్ప సంస్కృతి, సంప్రదాయాలను పాటిస్తూ.. కొత్త వస్త్రాలతో పిల్లపాపలంతా సుఖ సంతోషాలతో సంక్రాంతి పండుగను జరుపుకోవాలని కోరారు. 






అంతేకాకుండా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్.. సంక్రాంతి విశ్వమంగళ దినమని పేర్కొన్నారు. తెలుగు ప్రజలకు ఆయన భోగి, సంక్రాంతి, కనుమ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రత్యేక రాష్ట్రం వచ్చి ఎనిమిదేళ్లు అవుతున్నా... ధనిక రాష్ట్రం అప్పుల తెలంగాణగా మారినా ప్రజల జీవితాల్లో మాత్రం మార్పులేదన్నారు. 






తెలుగు రాష్ట్రాల ప్రజలకు టీపీసీసీ అధ్యక్షుడు, ఎంపీ రేవంత్ రెడ్డి సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. భోగి, సంక్రాంతి, కనుమ పండుగలను ప్రజలంతా సంతోషంగా జరుపుకోవాలని, ఈ పండుగ ప్రతీ ఒక్కరి జీవితంలో ఆనంద సిరులు కురిపించాలని ప్రకటనలో పేర్కొన్నారు.