ప్రజారోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు, మెరుగైన ఔషధాలు అందేలా రాష్ట్రవ్యాప్తంగా సెంట్రల్‌ మెడిసిన స్టోర్స్‌ ఏర్పాటు చేయనున్నారు. 


తెలంగాణ ప్రభుత్వంలో ఆసుపత్రులు, వైద్య సేవలను మెరుగు పరిచేందుకు రాష్ట్రవ్యాప్తంగా మెడిసిన్ స్టోర్స్ ఏర్పాటుకు నిర్ణయించింది. 12 చోట్ల ఈ సీఎంఎస్‌లను ఏర్పాటు చేయనుంది. ఒక్కొక్క స్టోర్‌పై 3.60 కోట్లు ఖర్చు పెట్టనుంది. అంటే రాష్ట్రవ్యాప్తంగా 43.20 కోట్లు ఖర్చు చేయనుంది. 


ఈ సెంట్రల్ మెడిసిన్ స్టోర్స్ వల్ల ప్రభుత్వాసుపత్రులు బలోపేతం అవ్వడమే కాకుండా ప్రతి ఒక్కరికీ సకాలంలో వైద్యం అందుబాటులో ఉంటుందని ప్రభుత్వం భావిస్తోంది. రాష్ట్రంలో 12 చోట్ల సెంట్రల్ మెడిసిన్ స్టోర్స్‌ ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు కూడా వైద్యారోగ్యశాఖ జారీ చేసింది. 


ఈ స్టోర్స్‌లో ప‌ని చేసేందుకు అవ‌స‌ర‌మైన సిబ్బందిని కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ విధానంలో భ‌ర్తీ చేయ‌నున్నారు. ఈ స్టోర్స్ ప‌రిధిలోని అన్ని ఆస్పత్రుల‌కు కూడా స‌కాలంలో మెడిసిన్స్‌ను చేర‌వేసే అవ‌కాశం ఉంటుందని ప్రభుత్వం చెబుతోంది. 


సెంట్రల్‌ మెడిసిన్ స్టోర్స్ ఏర్పాటు చేసే ప్రాంతాలు ఇవే. 
1. సిద్దిపేట‌(టీచింగ్ హాస్పిట‌ల్)
2. వ‌న‌ప‌ర్తి (జిల్లా ఆసుపత్రి)
3. మ‌హ‌బూబాబాద్ (జిల్లా ఆసుపత్రి)
4. జ‌గిత్యాల (జిల్లా ఆసుపత్రి)
5. మంచిర్యాల (జిల్లా ఆసుపత్రి)
6. భూపాల‌ప‌ల్లి (జిల్లా ఆసుపత్రి)
7. కొత్త‌గూడెం (జిల్లా ఆసుపత్రి)
8. నాగ‌ర్‌క‌ర్నూల్ (జిల్లా ఆసుపత్రి)
9. సూర్యాపేట (జిల్లా ఆసుపత్రి)
10. భువ‌న‌గిరి (జిల్లా ఆసుపత్రి)
11. వికారాబాద్ (ఏరియా హాస్పిట‌ల్)
12. గద్వాల (జిల్లా ఆసుపత్రి)