Telangana New Secretariat: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న నూతన సచివాలయం ప్రారంభోత్సవానికి సిద్ధం అవుతోందని పురపాలక, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా తెలిపారు. త్వరలోనే సీఎం కేసీఆర్ సచివాలయాన్ని ప్రారంభిస్తారని తెలిపారు. మరో రెండు మెగా ప్రాజెక్టుల గురించి మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. అంతే కాకుండా తెలంగాణ అమరవీరుల స్మారక స్థూపం, 125 ఫీట్ల అంబేద్కర్ విగ్రహాన్ని సీఎం కేసీఆర్ మరికొద్ది నెలల్లోనే ప్రారంభిస్తారని వెల్లడించారు. ఈ మూడు ప్రాజెక్ులు కూడా నగరం నడిబొడ్డున ఏర్పాటు అవుతున్నాయి. 150 నుంచి 200 ఏళ్ల వరకు నూతన సచివాలయం చెక్కు చెదరకుండా ఉండేలా నిర్మిస్తున్నారు. దీనికోసం అధికారులు, నిర్మాణ సంస్థ ప్రత్యేక దృష్టి సారించాయి. చాంబర్ల నిర్మాణం, ఇంటీరియర్ డిజైన్, ఎలక్ర్టికల్, ప్లంబింగ్, వర్క్ స్టేషన్ ఏర్పాటు, కలరింగ్ ఫ్లోరింగ్, మార్బుల్స్, పోర్టికోల నిర్మాణం... ఇలా వివిధ రకాల పనులన్నీ ఏక కాలంలో చేపడుతున్నారు. 






ఫ్లడ్ లైట్ల వెలుగుల్లోనూ పని చేస్తున్న కార్మికులు..


మూడు షిఫ్టుల్లో కలిసి దాదాపు 2 వేల మంది కార్మికులు పని చేస్తున్నారు. ప్లడ్ లైట్ల వెలుగులోనూ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. రూ. 617 కోట్లతో నిర్మితం అవుతున్న నూతన సచివాలయ భవనాన్ని గ్రీన్ బిల్డింగ్ కాన్సెప్ట్ పద్ధతిలో నిర్మిస్తున్నారు. నూతన సచివాలయ భవనంలోకి సహజమైన గాలి, వెలుతూరు వచ్చేలా నిర్మిస్తున్నారు. కొత్త సచివాలయానికి రాజ్యాంగ నిర్మాత, భారత రత్న బాబాసాహెబ్ అంబేడ్కర్ పేరు పెట్టాలని సీఎం కేసీఆర్ ఇటీవల నిర్ణయించిన విషయం అందరికీ తెలిసిందే. ఇందుకు సంబంధించిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని సీఎం ఇప్పటికే ఆదేశించారు. 


బీఆర్ అంబేడ్కర్ పేరు పెట్టాలంటున్న సీఎం కేసీఆర్..


దేశ గౌరవం మరింతగా ఇనుమడించాలంటే, ఆయన పేరును మించిన పేరు లేదని సీఎం కేసీఆర్ వ్యాఖ్యానించారు. రాష్ట్ర శాసన సభ ఏకగ్రీవంగా తీర్మానించిందని.. ఇదే విషయమై ప్రధానికి త్వరలోనే లేఖ రాస్తానని సీఎం చెప్పారు. తెలంగాణ ప్రభుత్వ విజ్ఞప్తిని పరిగణలోనికి తీసుకొని కొత్త పార్లమెంట్ భవనానికి బీఆర్ అంబేడ్కర్ పేరు పెట్టాలని ముఖ్యమంత్రి కేసీఆర్ కేంద్ర ప్రభుత్వాన్ని మరోమారు డిమాండ్ చేశారు.