రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ సమీపంలోని టోల్ ప్లాజా వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. మహబూబ్‌నగర్ టీఆర్‌ఎస్‌ లీడర్, జిల్లా సర్పంచ్‌ల సంఘ అధ్యక్షుడు ప్రనిల్‌ చందర్‌ టోల్‌ప్లాజా సిబ్బందిపై దాడి చేశారు. అక్కడితో ఆగకుండా తన అనుచరులతో టోల్ ప్లాజాపై దాడి చేయించారు. ఈ ఘటనతో టోల్ ప్లాజా అద్దాలు ధ్వంసం అయ్యాయి. 


రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రాయికల్ టోల్ ప్లాజా వద్ద బుధవారం జరిగిన ఘర్షణ ఉద్రిక్తత వాతావరణానికి సంబంధించిన సిసి ఫుటేజ్ వెలుగులోకి వచ్చింది. టోల్ ప్లాజా వద్ద జడ్చర్ల పరిధిలోని నసురుల్లాబాద్ గ్రామ సర్పంచ్ ప్రనిల్ చందర్ తన ఇన్నోవా వాహనంతో ఆ టోల్‌ప్లాజా దాటే టైంలో ఘర్షణ జరిగింది. 


సిబ్బంది ఏమన్నారో ఏమో తెలియదు కానీ... ప్రనిల్‌ చందర్‌ వాహనం నుంచి సీరియస్‌గా కిందకి దిగి మరి టోల్ ప్లాజా సిబ్బంది చొక్కా పట్టుకున్నారు. దీంతో ఘర్షణ మొదలైంది. మొదట సిబ్బందిపై చేయి చేసుకున్న ప్రనిల్ చందర్ దౌర్జన్యంగా వ్యవహరించారు. 


ఆ తర్వాత తన అనుచరులను రప్పించి దాడులు చేయించారు. చట్టాన్ని తన చేతుల్లోకి తీసుకొని సర్పంచ్ ప్రనిల్ చందర్‌ ఇష్టానుసారంగా వ్యవహరించారని టోల్‌ప్లాజ్‌ సిబ్బంది ఆరోపిస్తున్నారు. ఆయనపై చటారీత్యా చర్య తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. సిసి ఫుటేజీలో అతను వ్యవహరించిన తీరు స్పష్టంగా కనిపిస్తుందన్నారు.