Teachers Transfers: నిలిచి పోయిన టీచర్ల బదిలీలను పునఃప్రారంభించేందుకు, మళ్లీ దరఖాస్తులు స్వీకరించేందుకు తెలంగాణ రాష్ట్ర సర్కారు కీలక ముందడుగు వేసింది. జీవో నెంబర్ 5, 9 లకు శుక్రవారం అసెంబ్లీలో చట్టబద్ధత కల్పించింది. ఉపాధ్యాయుల బదిలీలకు ఈ ఏడాది ప్రారంభంలోనే రాష్ట్ర సర్కారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ట్రాన్స్‌ఫర్ల మార్గదర్శకాలతో కూడిన జీవో నెంబర్ 5ను జనవరి 25వ తేదీన విడుదల చేసింది. కొన్ని సవరణల తర్వాత ఫిబ్రవరి 7వ తేదీన 9 జీవోను జారీ చేసింది. ఆ తర్వాత షెడ్యూల్ ను విడుదల చేసింది. ఈ మేరకు ఆన్ లైన్ లో దరఖాస్తులను కూడా స్వీకరించింది. దీంతో 79 వేలకు పైగా దరఖాస్తులు కూడా ప్రభుత్వానికి అందాయి. అయితే బదిలీలు ప్రారంభం కావాల్సిన తరుణంలో కొందరు ప్రభుత్వం బదిలీలపై ఇచ్చిన జీవోల చట్టబద్ధతను ప్రశ్నిస్తూ కేసులు వేశారు. దీంతో 7 నెలల నుంచి టీచర్ల ట్రాన్స్‌ఫర్ లు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. ఈ తరుణంలోనే రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సమస్య పరిష్కారానికి వ్యూహాత్మకంగా వ్యవహరించింది. కోర్టులో సుదీర్ఘకాలం వాదనలు వినిపించడం కంటే కూడా ఆయా జీవోలకు చట్టబద్ధత కల్పిస్తే సమస్యే ఉత్పన్నం కాదని భావించింది. ఈ మేరకు శుక్రవారం అసెంబ్లీలో జీవో 5, 9 లకు చట్టబద్ధత కల్పించింది. దీని వల్ల హైకోర్టులో బదిలీలపై ఉన్న స్టే వెకేట్ అవుతుందని, దాంతో ఉపాధ్యాయుల బదిలీలకు మార్గం సుగుమమవుతుందని భావిస్తోంది రాష్ట్ర సర్కారు. అనుకున్నట్లుగానే హైకోర్టు స్టే తొలగిస్తే.. ఉపాధ్యాయుల నుంచి మళ్లీ దరఖాస్తులు స్వీకరించాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. 


Also Read: Apple India Revenue: భారత్‌లో జూన్ త్రైమాసికంలో ఆపిల్ అమ్మకాల రికార్డు, రెండంకెల వృద్ధి నమోదు


జీవో నంబర్ 5, 9 లకు చట్టబద్ధత కల్పించడంపై ఉపాధ్యాయ సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి. అసెంబ్లీలో విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డిని కలిసి ఉపాధ్యాయ సంఘాల నేతలు ధన్యవాదాలు తెలిపారు. ఎమ్మెల్సీ కూర రఘోత్తం రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ రవీందర్, పీఆర్టీయూ అధ్యక్షుడు పింగళి శ్రీపాల్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి కమలాకర్ రావు, తెలంగాణ గెజిటెడ్ హెచ్ఎం ల అసోసియేషన్ అధ్యక్షుడు చంద్రప్రకాష్, ప్రధాన కార్యదర్శి రాజ గంగారెడ్డి, ఎస్జీటీయూ అధ్యక్షుడు మహిపాల్ రెడ్డి సహా ఇతర నాయకులు మంత్రి సబితను కలిశారు.