Apple India Revenue: భారత్ లో ఆపిల్ సంస్థ రికార్డు నమోదు చేసింది. జూన్ త్రైమాసికంలో ఐఫోన్ అమ్మకాల్లో ఏకంగా రెండంకెల వృద్ధిని నమోదు చేసింది. ప్రపంచంలోనే రెండో అతిపెద్ద స్మార్ట్ ఫోన్ మార్కెట్ గా ఉన్న భారత్ లో.. పాగా వేయడానికి ఆపిల్ వేసిన అడుగులు అదిరిపోయే ఫలితాన్ని ఇచ్చాయి. ఆపిల్ సంస్థ ఇటీవల ఢిల్లీ, ముంబైలలో రెండు ఔట్ లెట్‌లు ప్రారంభించిన విషయం తెలిసిందే. భారత్ లో అమ్మకాల వృద్ధి పట్ల కంపెనీ సంతోషంగా ఉందని యాపిల్ సీఈవో టిమ్ కుక్ తెలిపారు. ఆపిల్ సంస్థ తాజా ఆదాయాల ప్రకటనలో భారత్ ను ప్రముఖంగా గుర్తించడం విశేషం. 


'మేము భారత్ లో జూన్ త్రైమాసిక రికార్డును నెలకొల్పాం. ఐఫోన్ బలమైన అమ్మకాల ద్వారా ఈ రికార్డు సాధించాం. ఈ స్ప్రింగ్ సీజన్ లో భారత్ లో మా కొత్త స్టోర్ ల పనితీరు మా అంచనాలకు మించి నమోదు అయింది' అని ఆదాయ వివరాల ప్రకటన సందర్భంగా ఆపిల్ సంస్థ సీఈవో టిమ్ కుక్ వెల్లడించారు. 


ఆపిల్ యొక్క టాప్ 5 మార్కెట్లలో ఒకటిగా భారత్


ఆపిల్ కంపెనీ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ లూకా మేస్త్రీ ప్రకారం.. భారత్ లో ఐఫోన్ ఆదాయ వృద్ధి రెండంకెలలో ఉంది. ఇటీవలె ఢిల్లీ, ముంబయి నగరాల్లో ఏర్పాటు చేసిన స్టోర్లతో అమ్మకాలు మరింతగా పెరిగినట్లు ఆపిల్ సంస్థ పేర్కొంది. ఆపిల్ బలమైన ఐఫోన్ అమ్మకాలు నమోదు చేసిన మార్కెట్లలో ఇండోనేషియా, పోలాండ్, ఫిలిప్పీన్స్, టర్కీ, యూఏఈ, మెక్సికో, సౌదీ అరేబియా ఉన్నట్లు ఆదాయ వివరాల ప్రకటన సందర్భంగా టిమ్ కుక్ పేర్కొన్నారు. ఢిల్లీ, ముంబయి రిటైల్ స్టోర్లు అంచనాలకు మించిన పనితీరు కనబరుస్తున్నట్లు వెల్లడించారు. ప్రపంచంలోనే రెండో అతి పెద్ద స్మార్ట్ ఫోన్ మార్కెట్ అయిన భారత్ లో బాగా పని చేయాల్సి ఉంటుందని, ప్రస్తుతం కనబరిచిన వృద్ధి పట్ల చాలా సంతోషంగా ఉందని టిమ్ కుక్ అన్నారు. అయితే భారత్ లో ఆపిల్ వాటా ఇప్పటికీ తక్కువగానే ఉందని, ఈ రెండో అతిపెద్ద స్మార్ట్ ఫోన్ మార్కెట్ లో ఎదగడానికి గొప్ప అవకాశాలు ఉన్నాయన్నారు. అది సాధించడానికి శాయశక్తులా కృషి చేస్తామని టిమ్ కుక్ పేర్కొన్నారు.


Also Read: NEET Aspirant Death: కోటాలో మరో విద్యార్థి ఆత్మహత్య, ఈ ఏడాది ఇప్పటివరకూ 19 మంది సూసైడ్


7వ స్థానంలో ఉన్న ఆపిల్


మార్కెట్ ఇంటెలిజెన్స్ సంస్థ ఐడీసీ ప్రకారం.. శామ్‌సంగ్, వివో, వన్ ప్లస్ లు, 5జి సెగ్మెంట్ లో 54 శాతం మార్కెట్ వాటాతో అగ్రగామిగా ఉన్నాయి. ఆపిల్ ఐఫోన్ 13, వన్ ప్లస్ నార్డ్ సీఈ3 లైట్.. 2023 రెండో త్రైమాసికంలో అత్యధికంగా రవాణా చేసిన 5జి మోడల్స్ గా ఉన్నాయి. శామ్‌సంగ్, వివో, వన్ ప్లస్ మొదటి స్థానాల్లో ఉండగా.. భారత్ స్మార్ట్ ఫోన్ మార్కెట్ లో ఆపిల్ 7వ స్థానంలో నిలిచింది. రెండో త్రైమాసికం స్మార్ట్‌ ఫోన్ మార్కెట్‌లో ఆపిల్ 5 శాతం మార్కెట్ వాటాను కైవసం చేసుకుంది. ఆపిల్ సంస్థ ఆదాయం మార్చి వరకు దాదాపు 50 శాతం వరకు పెరిగి దాదాపు 6 బిలియన్ డాలర్లకు చేరుకుందని బ్లూమ్‌బెర్గ్‌ న్యూస్ నివేదిక పేర్కొంది.