NEET Aspirant Death: విపరీతమైన చదువు ఒత్తిడి.. ఎలాగైనా ర్యాంకు సాధించాలి.. నీట్ లో మంచి ర్యాంకు కొట్టి పేరొందిన కాలేజీలో సీటు సాధించి డాక్టరైపోవాలి. లక్షలు పెట్టి కోచింగ్ ఇప్పించే తల్లిదండ్రులు నిత్యం.. చదువు, చదువు అంటూ ఒత్తిడి పెడుతుండటం, ర్యాంకు వస్తుందో రాదో.. తల్లిదండ్రులను పరువును కాపాడతామో లేదో అనే ఒత్తిడిని తట్టుకోలేక విద్యార్థులు ప్రాణాలు తీసుకుంటున్నారు. రాజస్థాన్ లోని కోటా ప్రాంతంలో ఈ ఏడాది ఏకంగా 19 మంది నీట్ విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. కోటాలో జరుగుతున్న బలవన్మరణాల ఘటనలపై దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేగుతోంది. అయినా.. అక్కడ విద్యార్థులపై ఒత్తిడి పెట్టడం మాత్రం ఆగడం లేదు.. విద్యార్థుల మృతదేహాలను మోసుకెళ్తున్న అంబులెన్స్ కూతలు సైలెంట్ కావడం లేదు. 


రాజస్థాన్ లోని కోటా ప్రాంతం.. నీట్ కోచింగ్ కు చిరునామా లాంటిది. సివిల్స్ కోచింగ్ కు ఢిల్లీ, సాఫ్ట్ వేర్ కోచింగ్ లకు హైదరాబాద్ ఎలాగో.. మెడికల్ ప్రవేశ పరీక్ష నీట్ కోచింగ్ కు రాజస్థాన్ లోని కోటా పట్టణం అలాంటింది. ఇక్కడ వందలకొద్దీ ఉండే కోచింగ్ సెంటర్లలో లక్షలకొద్దీ విద్యార్థులు చదువుకుంటారు. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి నీట్ కోచింగ్ కోసం రాజస్థాన్ లోని కోటా ప్రాంతానికి వస్తారు. అయితే ఈ మధ్యకాలంలో కోటా అంటేనే జడుసుకునే పరిస్థితి వస్తోంది. వరుస పెట్టి విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతుండటంతో దేశవ్యాప్తంగా కలకలం రేగుతోంది. కోటాలోని విద్యార్థుల హాస్టల్ గదుల్లోని సీలింగ్ ఫ్యాన్లకు యాంటీ సూసైడ్ టూల్స్ అమర్చారు అంటేనే అక్కడి పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. తాజాగా మరో విద్యార్థి సూసైడ్ చేసుకోవడంతో కోటా ప్రాంతం గురించి మరోసారి దేశవ్యాప్తంగా చర్చ నడుస్తోంది. ఇప్పటి వరకు ఈ ప్రాంతంలో కేవలం ఈ సంవత్సరంలోనే 18 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకుని చనిపోయారు. తాజాగా జరిగిన ఘటనతో ఆ సంఖ్య 19కి చేరింది.


మెడికల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ నీట్ కోసం జనవరి నుంచి కోటాలో ఉంటూ కోచింగ్ తీసుకుంటున్న.. ఉత్తరప్రదేశ్ రామ్‌పుర్‌కు చెందిన 17 ఏళ్ల మన్‌జ్యోత్ సింగ్ ఆత్మహత్య చేసుకున్నాడు. మన్‌జ్యోత్ అతని తల్లిదండ్రులు ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయకపోవడంతో వారు హాస్టల్ వార్డెన్ ను అప్రమత్తం చేశారు. గది తలుపులు బద్దలు కొట్టి చూడగా మన్‌జ్యోత్ సింగ్ విగతజీవిగా పడి ఉండటం కనిపించింది. ఇటీవలి కాలంలో విద్యార్థుల ఆత్మహత్యలు పెరిగిపోవడంతో హాస్టల్ గదుల్లో సీలింగ్ ఫ్యాన్లకు యాంటీ సూసైడ్ పరికరాలు అమర్చారు. దీంతో మన్‌జ్యోత్ సింగ్ తన ముఖానికి, తలకి ఒక ప్లాస్టిక్ బ్యాగ్ ని చుట్టుకుని, దానికి ఒక బట్టను గట్టిగా కట్టి ప్రాణాలు తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. తన మృతికి ఎవరూ కారణం కాదని రాసి ఉన్న లేఖను పోలీసులు తన రూములో గుర్తించారు. 


Also Read: Vegetables Price: టమాటా మాత్రమే కాదు బ్రో! అన్నింటి రేట్లు ఆకాశంవైపే పరుగులు- పప్పు ధరలు సైతం తగ్గేదేలే


'హ్యాపీ బర్త్ డే పాపా' అని రాసిన లెటర్ ను పోలీసులు సేకరించారు. 'నేను నా ఇష్టానుసారం చేశాను. దయచేసి నా స్నేహితులను, తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టవద్దు' అని మరో లేఖ రాసి పెట్టాడు మన్‌జ్యోత్‌ సింగ్. 


అయితే, మన్‌జ్యోత్‌ సింగ్ చాలా తెలివైన విద్యార్థి అని, అందరితో జోక్స్ వేస్తూ సరదాగా ఉంటాడని అతని స్నేహితులు చెప్పారు. అంతకు ముందు విద్యార్థుల ఆత్మహత్యల గురించి జరిగిన చర్చలో.. 'ఆ తర్వాత నేనే' అని మన్‌జ్యోత్ సింగ్ చెప్పినట్లు తన ఫ్రెండ్స్ గుర్తు చేశారు. కానీ ఎప్పుడూ సరాదాగా ఉండే మన్‌జ్యోత్‌ సింగ్.. అలా అన్నప్పటికీ సరదాగానే అంటున్నాడని అంతా అనుకున్నారు. కానీ నిజంగానే ఇలా చేస్తాడని ఎవరూ ఊహించలేకపోయారు. మన్‌జ్యోత్‌ సింగ్ ఆత్మహత్యతో ఈ ఏడాది కోటాలో చనిపోయిన విద్యార్థుల సంఖ్య 19కి చేరింది. గతేడాది 15 మంది విద్యార్థులు సూసైడ్ చేసుకున్నారు. ఏటా ఈ కోటా పట్టణంలో 2.5 లక్షల మంది విద్యార్థులు కోచింగ్ తీసుకుంటారని అధికారిక వర్గాలు చెబుతున్నాయి.