రోడ్డు ప్రమాదాలను అరికట్టడంతో పాటు ట్రాఫిక్ రూల్స్ పాటించని వారిపై కేరళ ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. ఎక్కడా ట్రాఫిక్ నింబంధనలు ఉల్లంఘించకుండా ఏకంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) కెమెరాలను ఉపయోగిస్తోంది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రధాన నగరాల్లో వీటిని అమర్చారు. తాజాగా వీటి పనితీరును పరిశీలించారు. ఒక్క నెలలో ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్  కెమెరాలు ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘించిన 32 లక్షల మందిని గుర్తించాయి. వీరిలో 19 మంది ఎమ్మెల్యేలు, 10 మంది ఎంపీలు సహా పలువురు వీఐపీలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు.  ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘిస్తూ పట్టుబడిన వారికి రవాణా శాఖ అధికారులు  చలాన్లు జారీ చేశారు.


నెల రోజుల్లో 32 లక్షల  మంది ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘన


జులై 5 నుంచి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కెమెరాల ద్వారా ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించే వారిని గుర్తిస్తున్నారు. తాజాగా తిరువనంతపురంలో రవాణా శాఖ మంత్రి ఆంటోని రాజు అధ్యక్షతన ఏఐ కెమెరాల పనితీరుకు సంబంధించి సమీక్షా సమావేశం జరిగింది. నెల రోజుల్లోనే 19 మంది ఎమ్మెల్యేలు, 10 మంది ఎంపీలు, వీఐపీలు సహా 32 లక్షల  మందికిపైగా ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘించినట్టు గుర్తించామన్నారు.  ఒక ఎంపీ ఆరుసార్లు, ఒక ఎమ్మెల్యే ఏడుసార్లు ట్రాఫిల్ రూల్స్ పాటిచకుండా కెమెరాలకు చిక్కారని వెల్లడించారు. 328 ప్రభుత్వ వాహనాలు సైతం ట్రాఫిక్‌ రూల్స్ ఉల్లంఘించినట్లు చెప్పారు. ట్రాఫిక్ ఉల్లంఘించిన వారందరికీ ఈ-చలాన్లు జారీ చేశామన్నారు. అయితే, కెమెరాలకు చిక్కిన ఎంపీలు, ఎమ్మెల్యేల పేర్లను మాత్రం ఆయన వెల్లడించలేదు.


ఫైన్ చెల్లించకపోతే నో ఇన్స్యూరెన్స్  రెన్యువల్  


జులై 5 నుంచి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కెమెరాల నిఘా ప్రారంభం కాగా, బుధవారం(ఆగష్టు 3) నాటికి 32.42 లక్షల ట్రాఫిక్ ఉల్లంఘనలను గుర్తించాయి.  వీటిలో 15,83,367 కేసులను పరిశీలించి, 3,82,580 మందికి ఈ-చలాన్లు జారీ చేశారు. ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించినందుకు గాను 3,23,604 మందికి ప్రభుత్వం చలాన్లు పంపింది. జరిమానా చెల్లించని వారికి ఇన్స్యూరెన్స్  రెన్యువల్ చేయకూడదనే ప్రతిపాదన పరిశీలనలో ఉన్నట్లు తెలిపారు. దీనికి సంబంధించి బీమా కంపెనీలతో  త్వరలో చర్చలు జరపబోతున్నట్లు వెల్లడించారు.     


కేరళలో భారీగా తగ్గిన రోడ్డు ప్రమాదాలు


ట్రాఫిక్ నిఘా వ్యవస్థ అమలులోకి వచ్చిన తర్వాత రోడ్డు ప్రమాదాలు గణనీయంగా తగ్గాయని రవాణా శాఖ మంత్రి ఆంటోని రాజు వెల్లడించారు. జూలై 2022లో కేరళలో 3,316 రోడ్డు ప్రమాదాలు జరిగాయని, వీటిలో మొత్తం 313 మంది మరణించారని వెల్లడించారు. జులై 2023లో కేవలం 1,201 రోడ్డు ప్రమాదాలు జరిగాయని చెప్పారు. వీటిలో67 మంది చనిపోయినట్లు తెలిపారు.  జూలై 2022లో 3,992 మంది తీవ్రంగా గాయపడగా, జులై 2023లో 1,329 మంది మాత్రమే గాయపడ్డారని ఆంటోని రాజు వెల్లడించారు.  1994 నుంచి రిజిస్టరైన అన్ని వాహనాలకు సీటు బెల్టు తప్పనిసరి చేస్తున్నట్లు   మంత్రి తెలిపారు. సెప్టెంబర్ 1 నుంచి భారీ వాహనాలు నడిపే డ్రైవర్లతో పాటు క్యాబిన్ ప్రయాణికులకు సీటు బెల్ట్‌ ను తప్పనిసరి చేస్తామని చెప్పారు.  


Read Also: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వెనక పరిగెడుతున్న ప్రపంచం - గూగుల్ సెర్చ్‌కు కొత్త ఏఐ ఫీచర్లు!


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial