Viral News: ఢిల్లీ మెట్రో గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రతి రోజు ఏదో ఒక అంశంతో వార్తల్లో ఉంటోంది. అసభ్యకర సన్నివేశాలు, డాన్సులు అందులో షరా మామూలే. చుట్టుపక్కల వారికి ఇబ్బంది కలిగిస్తూ రీల్స్, షార్ట్స్ చేస్తూ ఉంటారు. మరి కొందరు అసభ్యకరంగానే ప్రవర్తిస్తారు. డ్యాన్స్ చేస్తున్న వీడియోలు, మెట్రోలో వాదించుకోవడం, కొట్లాడుకోవటం, డ్యాన్సులు, పాటలు పాడటం, ముద్దులు పెట్టుకుంటూ, అసభ్యకరమైన సినిమాలు చూసే వారి వీడియోలు వైరల్ అవుతూనే ఉంటాయి.
తాజా వైరల్ అవుతున్న వీడియోలో కనీసం పిల్లలున్నారని కూడా ఆలోచించకుండా ఇద్దరు మహిళల మధ్య తీవ్ర వాగ్వాదం వీడియో వైరల్‌గా మారింది. ఇందులో ఇద్దరు మహిళలు సీటు కోసం గొడవ పడ్డారు. ఒకరినొకరు వేలు చూపించుకుంటూ వాగ్వాదానికి దిగారు. ఓ మహిళ వారిని వారించడానికి యత్నించినా ఫలితం లేకుండా పోయింది. ఇతరులకు ఇబ్బంది కలుగుతుందనే ఆలోచన కూడా లేకుండా గొడవపడ్డారు.
అందులో గులాబీ రంగు దుస్తులు ధరించిన ఒక మహిళ, నల్లటి దుస్తులను ధరించిన మరో మహిళపై అరుస్తూ కనిపించింది. "హా హు మై పాగల్ (అవును నాకు పిచ్చి ఉంది)" అని ఆమె ఆ స్త్రీపై అరుస్తుంది. అవతలి మహిళ స్పందిస్తూ “భౌక్, తుజే జిత్నా భౌక్నా (మీకు కావలసినంత అరవండి)” అని ఆమె చెప్పడం వినిపించింది.
మెట్రో అధికారులు గొడవలకు దూరంగా ఉండాలని ప్రయాణికులను కోరుతున్నా... వారిలో ఎలాంటి మార్పు రావడం లేదు. మరొక క్లిప్‌లో పింక్ సూట్ ధరించిన మహిళ అదే మెట్రో కోచ్‌లో మరొక ప్రయాణికుడితో వాగ్వాదానికి దిగింది. మరొక మహిళ ఆ వాగ్వాదాన్ని రికార్డ్ చేసింది. దీనిపై మెట్ర ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఇలాంటి సమస్యలకు అధికారులు ఎలా చెక్ పెడతారో వేచి చూడాల్సిందే !
ముఖ్యంగా ఢిల్లీ మెట్రోలో జరిగే వింతలు, విడ్డూరాలకు అడ్డూ అదుపు లేకుండా పోయింది. గత మే నెలలో మెట్రోలో ప్రయాణిస్తున్న ఓ యువకుడు, యువతి పరస్పరం అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నట్లు వీడియో వైరల్ అయ్యింది. దీనిపై సోషల్ మీడియాలో నెటిజన్లు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. అంతకు ముందు మరో జంట అందరూ ఉండగానే ముద్దులు పెట్టుకున్నారు.
తాజ్ మహల్ చూడటానికి వచ్చిన యువకులు ఢిల్లీ మెట్రోలో మద్యం తాగి హల్ చల్ చేశారు. కొందరు యువకులు గ్రూపులుగా విడిపోయి కొట్టుకున్నారు. ఓ యువతి ఏకంగా హెయిర్ స్టెయిట్‌నర్‌ను ఉపయోగించింది. కొందరు మహిళలు మెట్రోలో దుస్తులు ఆరేశారు. ఓ యువకుడు అసభ్యకరంగా ప్రవర్తించాడు.