Meenakshi Lekhi: 



పార్లమెంట్‌లోనే కామెంట్స్..


కేంద్రమంత్రి మీనాక్షి లేఖి పార్లమెంట్‌లో ప్రతిపక్ష ఎంపీని సైలెంట్‌గా ఉండాలని వార్నింగ్  ఇచ్చారు. "మీరు సైలెంట్‌గా ఉండండి. మీ ఇంటికి ఈడీ ఏమీ రాదు" అని సెటైర్లు వేశారు. ఈ వ్యాఖ్యలు పెద్ద దుమారమే రేపాయి. ప్రతిపక్ష ఎంపీలను బెదిరిస్తున్నారంటూ విపక్షాలు పెద్ద ఎత్తున నినాదాలు చేశాయి. ఢిల్లీ సర్వీస్ బిల్‌పై చర్చిస్తున్న సమయంలో ఓ ప్రతిపక్ష ఎంపీ మీనాక్షి లేఖి ప్రసంగానికి అడ్డు తగిలారు. వెంటనే ఆమె "ఆగండి. ఆగండి. శాంతంగా ఉండండి. లేకపోతే మీ ఇంటికి ఈడీ వస్తుంది జాగ్రత్త" అని అన్నారు. దీనిపై విపక్షాలు భగ్గుమంటున్నాయి. కేంద్ర ప్రభుత్వం దర్యాప్తు సంస్థల్ని దుర్వినియోగం చేస్తోందనడానికి ఇదే ఉదాహరణ అని విమర్శిస్తున్నాయి. ఎన్‌సీపీ ప్రతినిధి క్లైడ్ క్రాస్టో మీనాక్షి లేఖిపై విమర్శలు చేస్తూ ట్వీట్ చేశారు. ఇండియన్ యూత్ కాంగ్రెస్ కూడా ఇదే స్థాయిలో విరుచుకు పడింది. వార్నింగ్ ఇస్తున్నారా..? అంటూ ట్వీట్ చేసింది. ఇక తృణమూల్ కాంగ్రెస్ ప్రతినిధి సాకేత్ గోఖలే ట్విటర్‌లో అసహనం వ్యక్తం చేశారు. ఆమె వ్యాఖ్యలు షాకింగ్‌గా ఉన్నాయని అన్నారు. 


"కేంద్రమంత్రి మీనాక్షి లేఖి పార్లమెంట్‌లోనే ప్రతిపక్ష ఎంపీలను బెదిరించిన తీరు షాకింగ్‌గా ఉంది. సైలెంట్‌గా ఉండండి లేదంటే ఈడీ వస్తుందని హెచ్చరిస్తున్నారా..? ఇంత బహిరంగంగా కేంద్రమంత్రులు వార్నింగ్ ఇస్తున్నారు. అంటే పార్లమెంట్‌లో మాట్లాడినందుకే ఇలా బెదిరిస్తారా.."


- సాకేత్ గోఖలే, టీఎమ్‌సీ ప్రతినిధి






బీఆర్‌ఎస్ ఎంపీ ఏనుగు భరత్ రెడ్డి కూడా మీనాక్షి వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించారు. బీజేపీ మంత్రులు ఇలా పార్లమెంట్‌లోనే ప్రతిపక్షాలకు వార్నింగ్ ఇవ్వడం సిగ్గుచేటు అని మండి పడ్డారు. ప్రసంగించే సమయంలో ఆప్‌పైనా విమర్శలు చేశారు మీనాక్షి లేఖి. ఢిల్లీలోని పాలనా వ్యవహారాలపై కేంద్రానికే సగం అధికారం ఉంటుందని స్పష్టం చేశారు. అరవింద్ కేజ్రీవాల్‌కి పావు వంతు అధికారాలు మాత్రమే ఉంటాయని, అందుకే ఆయన పావువంతు సీఎం అని సెటైర్లు వేశారు.