Chandrayaan-3: చంద్రయాన్ ప్రయోగంతో భారత్ చరిత్ర సృష్టించేందుకు సిద్ధమైంది. ఇప్పటికి ఐదు సార్లు కక్ష్య పెంపు పూర్తి చేసుకుని చంద్రుడి వైపు వడి వడిగా అడుగులు వేస్తోంది. క్రమంగా ఒక్కో దశ పూర్తి చేసుకుంటూ చంద్రుడి దిశగా సాగిపోతోంది. శనివారం చంద్రయాన్‌ను ఇస్రో చంద్రుడి కక్ష్యలో ప్రవేశ పెడితే విజయం సాధించినట్లే. ఆగస్టు 23 లేదా 24న చంద్రుడిపై ల్యాండ్ అయ్యే అవకాశం ఉంది. ఈ మిషన్ చంద్రుని ఉపరితలంపై సురక్షితం, మృదువైన ల్యాండింగ్ చేసి చంద్రునిపై రోవర్‌ను దించడమే ఇస్రో లక్ష్యంగా పెట్టుకుంది. అయితే దిగిన తరువాత చంద్రయాన్ ఏం చేస్తుందో తెలుసా? తెలియక పోతే చదివేసేయండి.
ల్యాండర్ నుంచి రోవర్ చంద్రుని ఉపరితలంపై దిగేందుకు 4 గంటల సమయం తీసుకుంటుందని అంచనా. రోవర్ సెకనుకు సెంటీమీటర్ వేగంతో కదులుతుంది. రోవర్ ఒక లూనార్ డే (చంద్రుని రోజు–మన లెక్కలో 14 రోజులు) పని చేస్తుంది. ఈ సమయంలో అది తన పేలోడ్‌లు RAMBHA మరియు ILSAలను ఉపయోగించి సంచలనాత్మక ప్రయోగాలను నిర్వహిస్తుందిఆ 14 రోజుల వ్యవధిలో రోవర్ 500 మీటర్లు ప్రయాణించి చంద్రుని ఉపరితలంపై మూలమూలలనూ శోధించి భూ నియంత్రిత కేంద్రానికి కీలక సమాచారం చేరవేస్తుంది.
చంద్రునిపై వాతావరణం, ఖనిజ సంపద, అక్కడి పరిస్థితులను క్షుణ్ణంగా పరిశీలించి సమాచారం ఇస్తుంది. రోవర్‌లో లేజర్ ప్రేరిత బ్రేక్‌డౌన్ స్పెక్ట్రోస్కోప్ (LIBS), ఆల్ఫా పార్టికల్ ఎక్స్-రే స్పెక్ట్రోమీటర్ (APXS) కూడా అమర్చబడి ఉంటాయి. ఇది చంద్ర ఉపరితలం, రాళ్లు, నేల రసాయన కూర్పును విశ్లేషిస్తుంది. ఇప్పటిదాకా చంద్రుడిపై పరిశోధనలు చేసే దేశాల్లో మనది నాలుగో స్థానం. గతంలో రష్యా, అమెరికా, చైనా మాత్రమే ఇలాంటి ప్రయోగాలు చేశాయి.
చంద్రయాన్–1తో ఉపగ్రహాన్ని చంద్రుని చుట్టూ పరిభ్రమించేలా చేసిన తొలి దేశంగా భారత్ నిలిచింది. చంద్రయాన్–2 ద్వారా ల్యాండర్, రోవర్‌తో చంద్రుని ఉపరితలంపై పరిశోధనలు చేయాలని సంకల్పించింది. అయితే చివరి రెండు నిమిషాల్లో చంద్రుని ఉపరితలాన్ని ఢీకొని సిగ్నల్స్ అందకుండా పోయాయి. దాన్ని ఇస్రో శాస్త్రవేత్తలు సవాలుగా తీసుకుని నాలుగేళ్ల తరువాత చంద్రయాన్–3ని దిగ్విజయంగా చంద్రుని కక్ష్యలోకి పంపారు.
చంద్రయాన్-3 మిషన్ ఆగస్టు 23, 2023న సాయంత్రం 5.47 గంటలకు చంద్రునిపై ల్యాండ్ అవుతుందని ఇస్రో శాష్త్రవేత్తలు భావిస్తున్నారు. ఈ మిషన్ అంతరిక్ష పరిశోధనలో భారతదేశానికి కీలకం కాబోతుందని, భవిష్యత్తులో గ్రహాంతర కార్యకలాపాలకు మార్గం సుగమం చేస్తుందని అభిప్రాయపడుతున్నారు.
శాస్త్రవేత్తల్లో టెన్షన్
చంద్రయాన్-3 ఆగస్టు 5న చంద్రుని ప్రభావ పరిధిలోకి ప్రవేశిస్తుందని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) తెలిపింది. ఈ ప్రయోగంలో అత్యంత కీలకమైన దశ 5వ తేదీన జరుగనుంది. ఈ మిషన్‌లో అతి క్లిష్టమైన దశ చంద్రయాన్‌ను చంద్రుడి కక్ష్యలోకి ప్రవేశపెట్టడం. అంతరిక్ష నౌక వేగాన్ని తగ్గించి కచ్చితమైన ప్రణాళికతో చేస్తేనే చంద్రుని కక్ష్యలోకి ప్రవేశపెట్టడానికి సాధ్యమవుతుంది. చంద్రుని గురుత్వాకర్షణ చంద్రయాన్-3ని అందుకోవడంలో విఫలమైతే విపరీతమైన పరిణామాలు ఉంటాయి. భూమి గురుత్వాకర్షణ శక్తి కారణంగా అంతరిక్ష నౌక చంద్రునిపై కూలిపోవచ్చు లేదా దాని నుంచి దూరంగా ఎగిరిపోయే అవకాశం ఉంది.
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి
Join Us on Telegram: https://t.me/abpdesamofficial