Rythu Bandhu Scheme: దేశానికి అన్నం పెట్టే రైతులు ఇబ్బంది పడకూడదని, వ్యవసాయం లాభసాటి కావాలన్నదే సీఎం కేసీఆర్ ఆకాంక్ష అని తెలంగాణ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో సంక్షేమ పథకాలను వియవంతంగా అమలు చేస్తున్నామని, కరోనా సమయంలో కూడా రైతు బంధు నిధుల పంపకం ఆపలేదని మంత్రి చెప్పారు. దేశంలో రైతుల నుంచి వంద శాతం ధాన్యం కొనుగోలు చేసిన ఘనత తెలంగాణ సీఎం కేసీఆర్‌దేనని అన్నారు. కానీ రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చేయడమే పనిగా విపక్ష నేతలు పెట్టుకున్నారని నిరంజన్ రెడ్డి విమర్శించారు.
కొనసాగుతున్న రైతు బంధు నిధుల విడుదల
డిసెంబర్ 28న తెలంగాణలో రైతుబంధు నిధుల విడుదల ప్రకియ మొదలైంది. అందరూ రైతులకు నిధులు చేరే వరకు ఈ ప్రక్రియ కొనసాగుతున్నదని మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు. ప్రతి ఏడాది తరహాలోనే రైతులకు ఖరీఫ్, రబీ పంట సీజన్లలో పెట్టుబడి సాయం కింద రూ.5 వేల చొప్పున ప్రతి ఏడాది వారికి పది వేల రూపాయాలు రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నారు. తాజాగా పదవ విడత రైతు బంధు సాయం ప్రక్రియ కొనసాగుతోంది. 8 లక్షల 53 వేల 409.25 ఎకరాలకు రూ.426.69 కోట్ల నిధులను తెలంగాణ ప్రభుత్వం ఆదివారం విడుదల చేసింది. వీటిని 1,87,847 మంది రైతుల ఖాతాలో నిధులను జమ చేస్తున్నామని చెప్పారు. రైతు బంధు పథకం కింద ఈ దఫాలో ఇప్పటివరకు 56,58,484 మంది రైతుల ఖాతాల్లో రూ.475.64 కోట్లు జమ చేసినట్లు మంత్రి నిరంజన్ రెడ్డి వెల్లడించారు.
పంట పెట్టుబడికి రైతుబంధు నిధులను తెలంగాణ ప్రభుత్వం ప్రతి ఏడాది రెండు సీజన్లలో ఎకరాకు రూ.5000 చొప్పున పంట సాయం అందిస్తోంది. ప్రస్తుతం యాసంగి పంట కాలానికిగానూ 7,600 కోట్ల రూపాయలను, రైతుల ఖాతాల్లో రాష్ట్ర ప్రభుత్వం జమ చేయనున్నది. ప్రతి ఏడాది, ఖరీఫ్ సీజన్ తరహాలోనే మొదట ఒక ఎకరం రైతులకు రైతు బంధు నిధులు జమ చేస్తారు. ఆపై అధిక ఎకరాలు ఉన్న రైతులకు తెలంగాణ ప్రభుత్వం పంట పెట్టుబడి కోసం రైతు బంధు సాయాన్ని అందిస్తోంది. ధరణి పోర్టల్ నమోదు చేసుకున్న పట్టాదారులు, ఆర్ఓఎఫ్ఆర్ పట్టాదారులు అర్హులని తెలిపారు. మొదటిసారి పెట్టుబడి సాయం తీసుకోబోయే రైతులు క్షేత్రస్థాయిలో సంబంధిత వ్యవసాయ విస్తరణ అధికారులను సంప్రదించాలని టీఆర్ఎస్ ప్రభుత్వం సూచించింది.
ప్రపంచ వ్యాప్తంగా రైతుబంధు ఇచ్చే రాష్ట్రం మరొకటి లేదు. రైతు బీమా ఇచ్చే దేశం లేదని, రైతుబంధు, రైతుబీమా లాంటి పథకాలు అమలు చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని సీఎం కేసీఆర్ ఇటీవల అన్నారు. తెలంగాణ రైతుల బతుకులు ఓదరికి రావాలని, అప్పులు తీరాలని.. అనాలోచితంగా తీసుకువచ్చిన పథకం రైతు బంధు కాదన్నారు. భారతదేశంలో ప్రభుత్వం కూడా ధాన్యం మొత్తం కొనుగోలు చేయదని, ఎక్కడా లేని విధంగా 7 వేల ధాన్యం కొనుగోలు కేంద్రాలు పెట్టి పండించిన పంటను ఎక్కడ అమ్ముకోవాలనే సమస్య లేకుండా విక్రయించిన పంటకు వారం రోజుల్లోనే బ్యాంకులో డబ్బులు జమ చేసేలా తమ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు.