Pawan Kalyan : టీడీపీ అధినేత చంద్రబాబుతో జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్ హైదరాబాద్ లో భేటీ అయ్యారు. హైదరాబాద్‌లోని చంద్రబాబు నివాసంలో ఈ భేటీ జరిగింది. ఈ సమావేశంలో ఏపీ తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారు. ఈ భేటీ అనంతరం చంద్రబాబు, పవన్ కల్యాణ్ మీడియాతో మాట్లాడారు. పవన్ కల్యాణ్ మాట్లాడుతూ...ఏపీలో ప్లాస్టిక్ ఫ్లెక్సీలు నిషేధం అని రాష్ట్ర ప్రభుత్వం చెప్పిందన్నారు. కానీ సీఎం జగన్ పుట్టినరోజున ప్లాస్టిక్ ఫ్లెక్సీ వేశారన్నారు. ఆంధ్ర యూనివర్సిటీలో కూడా జగన్ పుట్టినరోజు ఫ్లెక్సీలు పెట్టారన్నారు. వైసీపీ నేతలు నిబంధనలు అందరికీ వర్తిస్తాయని మాట్లాడతారు కానీ వాటిని పాటించరన్నారు. కుప్పంలో ఇటీవల జరిగిన ఘటనలపై చంద్రబాబును పరామర్శించినట్లు తెలిపారు. వైసీపీ ప్రభుత్వం ప్రతిపక్ష పార్టీల హక్కులను కాలరాస్తున్నాయని మండిపడ్డారు.
ప్రతిపక్షాలను బయటకు రాకుండా చేయడమే వైసీపీ లక్ష్యం
"కోవిడ్ సమయంలో కూడా ప్రజలందర్నీ బయటకు రావొద్దని నిబంధలు పెట్టి వైసీపీ నేతలు పుట్టినరోజు ఫంక్షన్లు, తిరనాళ్లు చేసుకున్నారు. జీవో నెం 1 కేవలం ప్రతిపక్షాలకు మాత్రమే. ప్రతిపక్షాలు బయటకు రాకూడదు. ప్రజలతో మాట్లాడకూడదు. ప్రజాసమస్యలు తెలుసుకోకూడదు ఇదే వాళ్ల లక్ష్యం. నేను విశాఖ జనవాణి కార్యక్రమాన్ని వెళ్తే అడ్డుకున్నారు. ప్రజలు తమ సమస్యలు చెప్పుకోకుండా చేస్తున్నారు. కందుకూరు ఘటనే తీసుకోండి. రాజకీయ పార్టీలు సభల గురించి పోలీసులకు ముందుగానే సమాచారం ఇస్తాయి. ఇంతమంది వస్తారని పోలీసుల భద్రత కావాలని ముందుగానే కోరతాం. లాండ్ ఆర్డర్ ప్రాబ్లమ్ కూడా మా పనేనా. లాఠీ కూడా పట్టుకోవాలా? ఇంక పోలీసులు ఎందుకు?. గుంటూరు ఘటన కేవలం సెక్యూరిటీ సమస్య వల్ల జరిగింది. అంతే కాదు కోనసీమ అల్లర్లు, రిజర్వేషన్ల గొడవలు, కోడికత్తి ఘటన, వివేకానంద హత్య చూశాం వైసీపీ నేతలే దాడులు చేయించుకున్న సంస్కృతి. మంత్రులే వాళ్ల ఇళ్లు తగలబెట్టుకున్నారు. ఈ ఘటనల్లో పోలీసులు తమ పనిచేయకుండా ఉంటే చాలు సంఘ విద్రోహ శక్తులు దారుణాలకు పాల్పడుతుంటాయి. వైజాగ్ ఘటనలో కూడా ముందుగా గొడవలు జరుగుతాయని పోలీసులకు సమాచారం ఉంది. కానీ పోలీసులు ఏంపట్టించుకోలేదు. గుంటూరులో సంక్రాంతి కానుక ఇస్తున్నప్పుడు అంత మంది ఎందుకు వచ్చారు. వైసీపీ ప్రభుత్వం ఇచ్చిన సంక్షేమ పథకాలు నిజంగా అందుతున్నాయా అనే అనుమానం కలుగుతుంది. లేకపోతే అంతమంది ఎందుకు వచ్చారు. నిజంగా సంక్షేమ పథకాలు అమలైతే కేవలం రేషన్ కోసం తొక్కిసలాట ఎందుకు జరుగుతుంది" - పవన్ కల్యాణ్
వైసీపీ విశ్వరూపం చూపిస్తుంది
"వచ్చే ఎన్నికల్లో వైసీపీ ఓడిపోతుందని వాళ్లు గమనించారు. ఇది స్టార్టింగ్ మాత్రమే. ఎన్ని రకాల కుట్రలు చేయాలని, ప్రతిపక్షపార్టీలను ఎలా హింసించాలనే విషయంపై వాళ్లు సిద్ధమయిపోయారు. ప్రతిపక్ష పార్టీలను హింసించేందుకు వైసీపీ విశ్వరూపం చూపిస్తుంది. వీటిని సంయుక్తంగా ఎలా ఎదుర్కొవాలనే దానిపై చర్చిస్తాం. బీజేపీతో కూడా ఈ విషయంపై మాట్లాడతాను. మిగతా అన్నీ పార్టీలను మాట్లాడతాం. ఎమర్జెన్సీ టైంలో కూడా అన్ని పార్టీలు కాంగ్రెస్ కు వ్యతిరేకంగా ఏకతాటిపైకి వచ్చాయి. ప్రజాస్వామ్యంలో వ్యతిరేకత ఉంటుంది. వాయిస్ ఆఫ్ డిసెంట్ ఉంటుంది. బ్రిటీష్ వాళ్ల చట్టాలు తీసుకొచ్చి ఇప్పుడు అమలుచేస్తామంటే ఎలా ఊరుకుంటాం. దీనిపై కచ్చితంగా ఉమ్మడిగా పోరాడతాం. వైసీపీ నేతల పాచినోళ్లకు ఆ మాటలు మాత్రమే వస్తాయి. ఇరిగేషన్ మంత్రికి పోలవరం ప్రాజెక్టు గురించి తెలియదు. వీటన్నింటిపై 12న యువశక్తి మీటింగ్ లో మాట్లాడతాను. ప్రచార రథం ఏ పొలిటికల్ పార్టీ అయినా కొనుక్కుంటారు. కానీ నేను ఏం కొన్నా రాజకీయం చేస్తారు. నేను ప్రచార వాహనం కొనుక్కోకూడదు, వెహికల్స్ కొనుక్కోకూడదు. వైసీపీ వాళ్లు వందల కోట్లతో బులెట్ ఫ్రూఫ్ వాహనాలు కొనుక్కోవచ్చు. మా సొంత డబ్బులతో కొనుక్కున్న వెహికల్ పై రాజకీయం చేస్తారు. ఎట్టి పరిస్థితుల్లో వాళ్లకు వాయిస్ ఆఫ్ డిసెంట్ ఉండకూడదు. అదే వాళ్ల లక్ష్యం. " - పవన్ కల్యాణ్
బీఆర్ఎస్ పై పవన్ కామెంట్స్
బీఆర్ఎస్ పై స్పందిస్తూ... కొత్త పొలిటికల్ పార్టీ రావడం ఆహ్వానించతగినదే అని పవన్ కల్యాణ్ అన్నారు. తెలంగాణ రాగం వదలి దేశం మొత్తం పోటీ చేస్తామని వాళ్లు స్టాండ్ తీసుకున్న తర్వాత ఏపీలో కూడా పోటీ చేసే హక్కు ఉంటుందన్నారు. ఏ పొలిటికల్ పార్టీలో అయినా ఇతర పార్టీల నుంచి వెళ్లిన వాళ్లు ఉంటారన్నారు. వైసీపీలో కూడా టీడీపీ నుంచి వెళ్లిన నేతలు ఉన్నారని తెలిపారు. వైసీపీ అరాచక విధానాలపై సంయుక్తంగా ఎలా పోరాడాలనేది దానిపైనే చర్చించామన్నారు.