Hyderabad Crime News: వారిద్దరూ మైనర్లే. చిన్నతనంలోనే ఒకరినొకరు ప్రేమించుకున్నారు. ఇంట్లో ఎవరికీ చెప్పకుండా ఇద్దరూ కలిసి హైదరాబాద్ నుంచి పుణె పారిపోయారు. అక్కడే ఓ గది అద్దెకు తీసుకొని నివాసం ఉంటున్నారు. బాలిక తల్లిదండ్రులు తమ కూతురు కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. పుణెలో ఉన్నట్లు తెలుసుకొని వెళ్లగా.. బాలిక గర్భం దాల్చినట్లు గుర్తించారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్ లోని నాంపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో నివాసం ఉంటున్న పదహారేళ్ల బాలిక, బాలుడు ఒకరినొకరు ప్రేమించుకున్నారు. గతేడాది మే నెలలో ఇద్దరూ కలిసి పుణెకు పారిపోయారు. ఇద్దరూ ఓ గది అద్దెకు తీసుకొని అక్కడే సహజీవనం చేస్తున్నారు. అయితే ఈ క్రమంలోనే బాలిక గర్భం దాల్చింది. అయితే తమ కూతురు ఏమైందో తెలియక తల్లిదండ్రులు చాలా చోట్ల వెతికారు. పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ క్రమంలోనే బాలిక, బాలుడిద్దరూ కలిసి వెళ్లినట్లు... వారిద్దరూ ఒకే చోట కలిసి ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. పుణెలో ఉన్న వారిద్దరినీ హైదరాబాద్ కు తీసుకొచ్చారు. బాలిక గర్భం దాల్చిన విషయం తెలుసుకొని బాలుడిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి జువైనల్ హోంకు తరలించారు.
హన్మకొండ ప్రభుత్వ బడిలో బాలిక ప్రసవం..
హన్మకొండ జిల్లా కమలాపూర్ పాఠశాలలో విద్యార్థిని మగబిడ్డకు జన్మనివ్వడం కలకలం రేపుతోంది. అభంశుభం తెలియని ఓ విద్యార్థిని మగ బిడ్డకు జన్మనిచ్చింది. పాఠశాలలోని బాత్రూంలో విద్యార్థిని ప్రసవించింది. ఎలాంటి వైద్య సహాయం, వైద్యులు లేకుండానే ఆ విద్యార్థిని మగ బిడ్డకు జన్మనిచ్చింది. హన్మకొండ జిల్లా కమలాపూర్ మండల కేంద్రంలోని మహాత్మ జ్యోతిబాపూలే బీసీ సంక్షేమ బాలికల పాఠశాలలో ఈ ఘటన జరిగింది.
ఆలస్యంగా వెలుగులోకి ఘటన
కొన్ని నెలల క్రితం కమలాపూర్ మండల కేంద్రంలోని మహాత్మ జ్యోతిబాపూలే గురుకుల బాలికల పాఠశాలలో విద్యను అభ్యసిస్తున్న ఓ బాలిక బాత్రూం గదిలో ప్రసవించి మగ బిడ్డకు జన్మనిచ్చింది. బాత్రూంకి వెళ్లిన ఆ బాలిక ఇంకా బయటికి రావడం లేదని అనుమానం వచ్చిన అక్కడి సిబ్బందికి బాత్రూంలోకి వెళ్లి చూసేసరికి ఆ బాలిక ప్రసవించి మగ బిడ్డకు జన్మనివ్వడంతో కంగారు పడ్డ సిబ్బంది ప్రిన్సిపాల్ కు విషయం తెలిపారు. వెంటనే ఆ పాఠశాల ప్రిన్సిపాల్ ఎంజేపీ సెక్రటరీ మల్లయ్య భట్టుకి విషయం తెలిపి ఆయన ఆదేశాల ప్రకారం అదే రోజు రాత్రి ఓ వాహనంలో ఆ బాలికతో పాటు పుట్టిన మగ బిడ్డను మరో చోటికి తరలించారు. గుట్టుచప్పుడు కాకుండా రాత్రికి రాత్రి విషయాన్ని బయటకి రాకుండా ప్రిన్సిపాల్ తగు జాగ్రత్తలు తీసుకున్నారు. పాఠశాలలో ప్రసవించిన ఆ బాలిక గర్భవతి ఎలా అయింది? ఆ బాలిక గర్భానికి కారకులు ఎవరు? పాఠశాలలోనే ప్రసవం జరిగే వరకు ప్రిన్సిపాల్, ఉపాధ్యాయ సిబ్బంది ఏం చేస్తున్నారు? ఆ బాలిక గర్భవతిగా ఉన్నట్లు ఎందుకు కనిపెట్టలేకపోయారు? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.