Hyderabad: తెలంగాణలో రైతులకు కాంగ్రెస్ ఇచ్చిన ప్రధాన హామీల్లో 15 వేల రూపాయల రైతు భరోసా ఒకటి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఆరు నెలలు దాటినా ఇంకా దీనిపై నిర్ణయం తీసుకోలేదు. మొన్నటి మొన్న మంత్రిమండలి భేటీలో దీనిపై చర్చించి త్వరలోనే విధి విధానాలు ఖరారు చేస్తామని ప్రకటించింది. 


అర్హులకు, వ్యవసాయం చేసే రైతుకు మాత్రమే రైతు భరోసా అందేలా చర్యలు తీసుకుంటున్న తెలంగాణ ప్రభుత్వం ఆ దిశగానే చర్యలు ముమ్మరం చేసింది. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇవాళ కీలక సమావేశం నిర్వహించనున్నారు. ఇందులో రైతులందర్నీ భాగస్వాములను చేయాలని ప్రభుత్వ ఆలోచనగా కనిపిస్తోంది. 


కొత్త రూల్స్ ఫ్రేమ్ చేసేందుకు ప్రత్యేక మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసిన ప్రభుత్వం ఇందులో రైతుల అభిప్రాయాలను తీసుకోవాలని కూడా ప్లాన్ చేసింది. దీని కోసం ఇవాళ దాదాపు అన్ని నియోజకవర్గాల్లో అభిప్రాయ సేకరణ చేపడుతోంది. నియోజకవర్గాల్లో ఉన్న రైతు వేదికలను కేంద్రంగా చేసుకొని వివిధ మాధ్యమాల ద్వారా రైతుల ఆలోచనలు తెలుసుకోనున్నారు. రైతులంతా ఈ చర్చల్లో పాల్గొనేలా చేయాలని వ్యవసాయ అధికారులకు బాధ్యతలు అప్పగించారు.


రైతులంతా ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రజాభిప్రాయ సేకరణలోపాల్గొని రైతు భరోసా ఎవరికి ఉండాలి... ఎలా ఉండాలనే అంశాలపై సూచనలు సలహాలు ఇవ్వొచ్చు. వాటన్నింటినీ అధికారులు రికార్డు చేసుకొని ప్రభుత్వానికి నివేదిక రూపంలో సమర్పిస్తారు. 


తెలంగాణ రైతు బంధు పేరుతో ఎకరానికి పదివేల రూపాయలను ఇప్పటి వరకు ఇస్తూ వచ్చారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం దానిలో మార్పులు చేర్పులు చేయాలని భావిస్తోంది. ఐటీ కట్టేవాళ్లకు, రాజకీయ నాయకులకు ప్రభుత్వ ఉద్యోగులకు రైతు బంధు ఇవ్వడం వల్ల ఏం ప్రయోజనం అనిప్రశ్నిస్తోంది. అందుకే అలాంటి వారిని తప్పించి పొలంలో దిగి వ్యవసాయం చేసే రైతుకు మాత్రమే రైతు భరోసా ఉండాలని చూస్తోంది. దీని కోసం ప్రత్యేక మంత్రివర్గం ఏర్పాటు చేసి విధవిధానాలు రూపొందిస్తోంది.