BRS News: మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి నాలాలో కూర్చొని నిరసన తెలిపారు. మల్కాజిగిరి గౌతమ్ నగర్ డివిజన్‌లో ఆయన ఈ నిరసన ప్రదర్శన చేశారు. గత ఆరు నెలలుగా రోడ్డును తవ్వి కాలనీ వాసులను జీహెచ్ఎంసీ సిబ్బంది ఇబ్బంది పెడుతున్నారని ఆరోపించారు. జీహెచ్ఎంసీ అధికారులు పనులలో నిర్లక్ష్యం చేస్తున్నారని ప్రజా సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ నాలాలో కూర్చొని మూడు గంటలుగా ఎమ్మెల్యే నిరసన తెలిపారు.
ప్రజా సమస్యల కోసం ఎక్కడ సమస్య ఉన్నా తాను నిరంతరం నిరసన తెలుపుతూనే ఉంటానని మర్రి రాజశేఖర్ రెడ్డి హెచ్చరించారు. ప్రజా పాలన అందిస్తున్నా అంటున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ సమస్యపై స్పందించాలని ఎమ్మెల్యే డిమాండ్ చేశారు. వర్షాకాలం వస్తున్నప్పటికీ ఇంకా ఏ చర్యలు తీసుకోలేదని.. కాలనీలు నీటిలో మునిగే పరిస్థితి ఉన్నా అధికారుల ఇంకా నిర్లక్ష్యం వహిస్తూనే ఉన్నారని మర్రి రాజశేఖర్ రెడ్డి అన్నారు. వెంటనే రహదారి పగలగొట్టిన చోట దిద్దుబాటు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే, కార్పొరేటర్ పనుల పర్యవేక్షణకు వచ్చినా అధికారులు ప్రోటోకాల్ పాటించకపోవడంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
‘‘మల్కాజ్ గిరి నియోజకవర్గం 141 వ డివిజన్ పరిధిలోని పాత మిర్జల్ గుడా పరిసర ప్రాంతాలలో నిన్నటి అకాల వర్షం కారణంగా పలు కాలనీలో తీవ్రంగా దెబ్బతిన్న బాక్స్ డ్రెయిన్ లను స్థానిక కార్పొరేటర్ సునీత రాము యాదవ్ తో కలిసి పరిశీలించాను. జీహెచ్ఎంసీ అధికారులకి ముందస్తుగా నా పర్యటన వివరాలను తెలియచేసినప్పటికీ సెలవులపై వెళ్లడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. గతంలో పలు మార్లు మల్కాజిగిరి నియోజకవర్గం పరిధిలో ప్రతి సమస్యల పరిష్కారం కోసం నా తరుపున Deputy Commissioner Malkajgiri, GHMC నుండి కింది స్థాయి అధికారులు వరకు ఎన్ని వినతులు ఇచ్చినా ఫలితం శూన్యంగా ఉంది.
నా ఆధ్వర్యంలో గతంలో ఎన్ని వినతులు ఇచ్చినా అధికార్ల నిర్లిప్తత అలసత్వం తీవ్ర ఆవేదనకి గురి చేస్తుంది. ప్రజలను ఇబ్బందులు పెట్టడమే ప్రజాపరిపాలనా? అని సీఎంవోను ప్రశ్నిస్తున్నాను. ఉదయం నుంచి జీహెచ్ఎంసీ అధికారులు ఎవరు నాకు అందుబాటులో లేకపోవడం గమనార్హం. దీనిపై ముఖ్యమంత్రి తక్షణమే చర్యలు తీసుకోవాలని ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నాను. దీనిపై అధికార్లు చర్యలపై ఉపక్రమించకపోతే ఈ నిరసనను ఉధృతం చేస్తామని తెలియచేస్తున్నాను’’ అని మర్రి రాజశేఖర్ రెడ్డి సోషల్ మీడియాలో ఓ పోస్టు కూడా పెట్టారు.