Hyderabad: హైదరాబాద్ లో సంచలనం సృష్టించిన మాజీ హోంగార్డు మహ్మద్ రిజ్వాన్ హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఈ కేసును సీరియస్ గా తీసుకున్న పోలీసులు.. పలు బృందాలుగా ఏర్పడి దర్యాప్తు చేపట్టారు. రిజ్వాన్ ను చంపిన హంతకుల కోసం సెర్చ్ ఆపరేషన్ నిర్వహించిన సౌత్ & ఈస్ట్ జోన్ పోలీసులు నిందితులను పట్టుకున్నారు. మాజీ హోంగార్డు మహ్మద్ రిజ్వాన్ హత్య కేసుకు సంబంధించిన వివరాలను గురువారం రోజు సౌత్ & ఈస్ట్ జోన్ డీసీపీ రమేష్ వెల్లడించారు.
మహ్మద్ రిజ్వాన్ హత్య కేసులో 8 మందిని అరెస్టు చేసినట్లు డీసీపీ రమేష్ తెలిపారు. కాజ, సలీం, నయీం, హరిప్రసాద్, ఫరీద్, షాహిద్, గులాం, అబ్దుల్ లను పోలీసులు అరెస్టు చేశారు. ఎనిమిది మంది నిందితుల నుంచి 3 వాహనాలు, 8 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ నెల 11వ తేదీన కాజా నయీం, సలీంలు మాజీ హోంగార్డు మహ్మద్ రిజ్వాన్ ను కిడ్నాప్ చేశారు. అయితే గతంలో హోంగార్డు మహ్మద్ రిజ్వాన్.. కాజా నయీం, ఫహద్ అనే ఫైనాన్షియర్ల వద్ద కొంత మొత్తంలో అప్పు తీసుకున్నాడు. దానిపై కాజా, ఫహద్ లు వడ్డీ, చక్రవడ్డీ వేయడంతో భారీగా పెరిగిపోయింది. మొత్తంగా 33 లక్షల రూపాయలు కట్టాలని వారు మహ్మద్ రిజ్వాన్ ను ఒత్తిడికి గురిచేశారు. అయినప్పటికీ రిజ్వాన్ చెల్లించకపోవడంతో.. కాజా, సలీం రౌడీ షీటర్లు కాజా ఫరీద్ చోర్, హరిప్రసాద్ లు మాజీ హోంగార్డు రిజ్వాన్ ను కిడ్నాప్ చేసి చిత్ర హింసలు పెట్టారు. ఈ నెల 11 నుంచి 13 తేదీ వరకు నాంపల్లిలోని ఓ బిల్డింగ్ సెల్లార్ లో మహ్మద్ రిజ్వాన్ ను నిందితులు కొట్టి చిత్ర హింసలు పెట్టారు.
ఈ నెల 13వ తేదీన మహ్మద్ రిజ్వాన్ తల్లిదండ్రులకు ఫోన్ చేసి డబ్బులు డిమాండ్ చేశారు. దీంతో రిజ్వాన్ తండ్రి కిడ్నాపర్లకు 2 లక్షల రూపాయలు ఆన్‌లైన్ లో పంపించారు. దీంతో రిజ్వాన్ ను కిడ్నాపర్లు వదిలేశారు. అప్పటికే తీవ్రగాయాలతో ఉన్న రిజ్వాన్ ను తండ్రి ఉస్మానియా ఆస్పత్రిలో చేర్చారు. మహ్మద్ రిజ్వాన్ ను కిడ్నాప్ చేసి, చిత్రహింసలు పెట్టినప్పటికీ.. ఆయన తండ్రి పోలీసులకు ఎలాంటి ఫిర్యాదు చేయలేదు. అయితే ఉస్మానియా ఆస్పత్రి నుంచి మెడికో లీగల్ రిఫర్ కేసు పోలీసుల వద్దకు వచ్చింది. దీంతో పోలీసులు ఆస్పత్రికి వెళ్లి రిజ్వాన్ తండ్రి నుంచి స్టేట్ మెంట్ తీసుకున్నారు. 8 మందిపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఆ మేరకు దర్యాప్తు మొదలుపెట్టారు.
కిడ్నాప్ కేసును విచారిస్తుండగానే ఉస్మానియా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మాజీ హోంగార్డు మహ్మద్ రిజ్వాన్ మృతి చెందాడు. దీంతో పోలీసులు నిందితులపై ఐపీసీ సెక్షన్ 348, 302, 364, 386, 506, రేడ్ విత్ 34 కింద కేసులు నమోదు చేశారు. నిందితుల కోసం సెర్చ్ ఆపరేషన్ నిర్వహించిన పోలీసులు కాజా, సలీం, నయీం, హరిప్రసాద్, ఫరీద్, షాహిద్, గులాం, అబ్దుల్ ను అరెస్టు చేశారు. కాగా.. కాజా ఫరీద్ చోర్ అనే రౌడీ షీటర్ పై మొత్తం 18 క్రిమినల్ కేసులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ప్రజలను ఎవరైనా వేధింపులకు గురి చేస్తే సహించేది లేదని, నిర్భయంగా పోలీసులను ఆశ్రయిస్తే తగు చర్యలు తీసుకుంటామని డీసీపీ రమేష్ పేర్కొన్నారు.